Movie Review - అనుకోని అతిథి

Sunday,May 30,2021 - 07:23 by Z_CLU

నటీనటులు: ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి , రేంజి పనికర్ ,సుదేవ్ నాయర్ తదితరులు

సంగీతం : పి ఎస్ జయహరి

నేపథ్య సంగీతం : జిబ్రాన్

కెమెరామెన్ : అను ముతే దత్

ఎడిటింగ్ : ఆయుబ్ ఖాన్

నిర్మాత : రాజు మ్యాథ్యూ

స్క్రీన్ ప్లే : పి ఎస్ మ్యాథ్యూ

దర్శకత్వం : వివేక్

నిడివి : 133 నిమిషాలు

ప్రస్తుతం థియేటర్స్ మూత పడటంతో తెలుగు ఆడియన్స్ కోసం మలయాళం, తమిళ్ సూపర్ హట్ సినిమాలను డబ్బింగ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం మలయాళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘అథిరన్’ సినిమా తాజాగా ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది ? ఆద్యంతం థ్రిల్ చేస్తూ ఉత్కంఠ రేకెత్తించిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Anukoni Athidhi movie review in telugu by zeecinemalu 1
కథ :

ఊరికి దూరంగా ఉంటూ ఓ భవనంలో పిచ్చాసుపత్రి నిర్వహిస్తుంటాడు డాక్టర్ బెంజిమన్(అతుల్ కులకర్ణి). ఆ ఆస్పత్రి ని తనిఖీ చేసేందుకు ఆ ఊరికి వస్తాడు సైకియాట్రిస్ట్ కిషోర్ నందా(ఫహాద్ ఫాజిల్). ఆ హాస్పిటల్ లో ఏదో జరుగుతుందని గమనిస్తాడు నందా. హాస్పిటల్ గురించి సరైన నివేదిక ఇవ్వకపోతే చంపేస్తామని నందా ను బెదిరిస్తాడు బెంజిమన్. కానీ ఆ బెదిరింపులకు భయపడని నందా తన విధిని సక్రమంగా నిర్వర్తించి నివేదిక ఇవ్వాలని భావిస్తాడు.

ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్న ఓ గదిలో బంధించిన నిత్య(సాయి పల్లవి) ని చూస్తాడు నందా. ఆమె వివరాలు తెలుసుకునే క్రమంలో నిత్య ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. ఇంతకీ నిత్య ఎవరు ? ఆమె గతం ఏమిటి ? అసలు నిత్యా ఆ ఆసుపత్రిలోకి ఎలా వచ్చింది ? కిషోర్ నందా ఆ హాస్పిటల్ కి రావడానికి కారణం ఏమిటి ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు :

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే విభిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్న ఫహద్ సైకియాట్రిస్ట్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక సాయి పల్లవి నటన కూడా సినిమాకు ప్లస్ పాయింట్. నిత్య పాత్రలో ఆమె మంచి నటన కనబరిచింది. డాక్టర్ పాత్రలో విలనిజం చూపిస్తూ అతుల్ కులకర్ణి మరోసారి మెప్పించాడు. ప్రకాష్ రాజ్ కనిపించేది కాసేపే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు పి ఎస్ జయహరి అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్నిచ్చింది. కొన్ని థ్రిల్ కలిగించే సన్నివేశాలకు క్లైమాక్స్ కి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. అను ముతే దత్ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను పాటలను ఆకర్షించేలా చిత్రీకరించాడు. ఆయుబ్ ఖాన్ ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్. సినిమాను సరైన నిడివితో కట్ చేసి ఆసక్తిగా సినిమాను నడిపించాడు.

దర్శకుడు వివేక్ రాసుకున్న కథకు పి ఎస్ మ్యాథ్యూ అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంది. వివేక్ దర్శకత్వం బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

Anukoni Athidhi movie review in telugu by zeecinemalu 1
జీ సినిమాలు సమీక్ష :

థ్రిల్లర్ సినిమాలకు ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే ఉండాలి. అలాగే క్యారెక్టర్స్ లో ఒదిగిపోయి నటించే నటీనటులు దొరకాలి. ఈ రెండూ థ్రిల్లర్ సినిమా విజయంలో సింహ భాగం పోషిస్తాయి. అనుకోని అతిథికి ఈ రెండూ బాగానే కుదిరాయి. ముఖ్యంగా పాత్రలకు బెస్ట్ ఇచ్చే ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి ని తీసుకోవడమే దర్శకుడి మొదటి సక్సెస్.

ఇక కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. అలాగే క్యారెక్టర్ ఎష్టాబిలిష్ చేయడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. కానీ సినిమాలో ఉన్న లోపాలను కొంతవరకు క్లైమాక్స్ తో మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. ఆసక్తికరంగా సినిమాను నడిపిస్తూనే అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించాడు. కానీ ఫైనల్ గా క్లైమాక్స్ తో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పాత్రల్లో ఒదిగిపోయే నటీనటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చిన అంశం.

స్టోన్ హార్ట్ అనే హాలీవుడ్ మూవీని స్పూర్తిగా తీసుకొని అలాగే కేరళలో జరిగిన ఓ సంఘటనని ఎంచుకొని కథను సిద్దం చేసుకున్న దర్శకుడు వివేక్ పిఎస్ మ్యాథ్యూ అందించిన కథనంతో సినిమాను ఆసక్తికరంగా ముందుకు నడిపించాడు. కాకపోతే సినిమా చూస్తున్న క్రమంలో కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొస్తాయి. బెంజిమన్ పిచ్చాసుపత్రి , అక్కడికి నివేదిక ఇవ్వడం కోసం సైకియాట్రిస్ట్ కిషోర్ నందా రావడం, అతన్ని బెంజిమన్ బెదిరించేందుకు ప్రయత్నిస్తుండటం వంటి సన్నివేషాలతో మొదటి భాగాన్ని నడిపించిన దర్శకుడు అక్కడ నిత్య కనిపించినప్పటి నుండి కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాడు.

అక్కడి నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథకి హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వివేక్. ఇక రెగ్యులర్ గా థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి క్లైమాక్స్ ఇదేనా అంటూ ఊహించేలా ఉంటుంది. మిగతా వారికి మాత్రం కొత్తగా అనిపిస్తుంది.

ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చుతుంది.

బాటమ్ లైన్ – ఊహించిన అతిథే

రేటింగ్ : 2.25/5

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics