Movie Review - ఏక్ మినీ కథ

Thursday,May 27,2021 - 09:20 by Z_CLU

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్దా దాస్, సుదర్శన్, బ్రహ్మాజీ, సప్తగిరి, పోసాని, హర్ష వర్దన్, జీవన్ తదితరులు.

సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటింగ్ : సత్య

ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్

క‌థ‌ -మాటలు: మేర్లపాక గాంధీ

స్క్రీన్ ప్లే : మేర్లపాక గాంధీ , షేక్ దావూద్

సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా

నిర్మాణం: యూవీ కాన్సెప్ట్స్

దర్శకత్వం : కార్తీక్ రాపోలు

నిడివి : 134 నిమిషాలు

విడుదల తేది : 26 మే 2021

ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ థియేటర్ కోసం తీసిన సినిమాలు కూడా OTT బాట పడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏక్ మినీ కథ అనే కాన్సెప్ట్ ఫిలిం ఓ టి టి లో డైరెక్ట్ గా రిలీజైంది. సంతోష్ శోభన్ హీరోగా కార్తీక్ రాపోలు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది ? యూ.వి కాన్సెప్ట్ నుండి తొలి ప్రయత్నంగా వచ్చిన ఈ కాన్సెప్ట్ సినిమా ఆకట్టుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

Ek Mini Katha Telugu Review by Zeecinemalu 2

కథ :

చిన్నతనం నుండి ఎవరికీ చెప్పుకోలేని ఓ సమస్యతో బాధ పడే సంతోష్ (సంతోష్ శోభన్) పెళ్లి తర్వాత తనకి తన భార్య విడాకులు ఇవ్వడం ఖాయమనే భ్రమలో ఉంటాడు. పెళ్లి అయ్యే లోపు తన సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూసే సంతోష్ కి సర్జరీతో సైజ్ పెంచుకోవచ్చని చెప్తాడు స్పెషలిస్ట్ డాక్టర్. కానీ ఆ సర్జరీ జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సూచిస్తాడు. దాంతో వెనకడుగు వేస్తాడు సంతోష్. ఇక తన సమస్య తీరే వరకూ పెళ్లి చేసుకోకూడదని భావించే సంతోష్ కి ఉన్నపళంగా తనకి ఓ యాక్సిడెంట్ లో పరిచయమైన అమృత (కావ్య థాపర్) తో అనుకోకుండా పెళ్లి నిశ్చయమవుతుంది. అయితే కాబోయే భార్యను సంతోష పెట్టాలని, తన చిన్న సైజు వల్ల తను ఇబ్బందులు పడకూడదని తన ప్రాణాలను పణంగా పెట్టి సర్జరీకి రెడీ అయిన సంతోష్ చివరికి ఆ సర్జరీ అవ్వకుండానే హాస్పిటల్ నుండి బయటపడతాడు. ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో సర్జరీ అవ్వకుండానే అమృత మేడలో తాళి కట్టి ఆమెకు భర్తగా మారతాడు సంతోష్. చిన్నతనం నుండి ఎంతో బాధ పడుతూ పెళ్లికి పనికి రాననే ఉద్దేశ్యంతో ఉండి తన సైజ్ పెంచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిన సంతోష్ చివరికి తెలుసుకుందేమిటి ? అనేది సినిమా కథ.

నటీనటుల పనితీరు :

పేపర్ బాయ్ సినిమాతోనే తనలో టాలెంట్ ఉందని నిరూపించుకున్న సంతోష్ శోభన్, మరోసారి మంచి మార్కులు అందుకున్నాడు. తన నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అలరించి ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా తన గొంతుతో అలాగే కామెడీ టైమింగ్ తో హీరో నాని ని గుర్తుచేశాడు. హీరోయిన్ కావ్య థాపర్ అమృత క్యారెక్టర్ లో బాగా చేసింది. శ్రద్దాదాస్ తన రోల్ చిన్నదే అయినా ఫరవాలేదనిపించుకుంది. కాకపోతే శ్రద్దా ఎంట్రీ చూసి ఆమెది గ్లామర్ రోల్ అని అందాల ఆరబోత ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తే నిరాశ తప్పదు.

ఇక బ్రహ్మాజీ, హీరో తండ్రి పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. హీరోతో పాటు సినిమా అంతా ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ లో సుదర్శన్ మంచి కామెడీ పండించాడు. తన డైలాగ్ కామెడీతో చాలా చోట్ల నవ్వించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే సప్తగిరి కామెడీ రొటీన్ అనిపించినప్పటికీ కొంత వరకూ నవ్విస్తుంది. హీరో ఇంట్లోకి వచ్చి సూసైడ్ చేసుకునే కుర్రాడిగా నటించిన రాజేష్.. సూసైడ్ కామెడీతో బాగా నవ్వించాడు. బర్రి బసవ పాత్రలో నటుడు అప్పారావు, హర్ష వర్ధన్, పోసాని కృష్ణ మురళి, కేశవ్ దీపక్ తదితరులు తమ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టెక్నీషియన్స్ నుండి సినిమాకు మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా ప్రవీణ్ లక్కరాజు అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్. పాటలతో పాటు అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా “నీ మాయలో పడిపోతున్నా” పాట హైలైట్ గా నిలిచింది. గోకుల్ భారతి కెమెరా వర్క్ బాగుంది. నటీ నటులను, సన్నివేశాలను తన కెమెరా పనితనంతో బాగా చూపించాడు. సత్య జి ఎడిటింగ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. దర్శకుడు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ని తన ఎడిటింగ్ టాలెంట్ తో బోర్ కొట్టకుండా క్రిస్పీగా ఎడిట్ చేశాడు. రవీంద్ర ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది.

తన మదిలో మెదిలిన ఓ చిన్న పాయింట్ కి షేక్ దావూద్ కలిసి స్క్రీన్ ప్లే రాయడంలో మేర్లపాక గాంధీ కష్టం కనిపించింది. కార్తీక్ రాపోలు దర్శకత్వం బాగుంది. నటీనటులను ఆయా పాత్రల్లో చూపించి సినిమాను బాగానే డీల్ చేశాడు. యూ.వి కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

Ek Mini Katha Telugu Review by Zeecinemalu 3
జీ సినిమాలు సమీక్ష :

ఒక చిన్న పాయింట్ తో పెద్ద సినిమా చేయడం చాలా కష్టం. ప్రేక్షకులకు సినిమా ప్రారంభంలోనే కథ చెప్పేసి దాన్ని ఎలాంటి మలుపులు లేకుండా స్క్రీన్ ప్లే రాసుకోవడం ఇంకా కష్టం. ఈ సినిమా చూశాక మేర్లపాక గాంధీ రైటర్ గా పడిన కష్టం కనిపించింది. ఇలాంటి ఓ సింపుల్ బోల్డ్ పాయింట్ తో రెండు గంటల సినిమా తీయడం అంటే సాహసమే. హీరోకి చిన్నప్పటి నుండి సైజ్ సమస్య… పెళ్లికి ముందు ఏం చేశాడు? పెళ్లి తర్వాత చివరిగా ఏం తెలుసుకున్నాడు? సింపుల్ గా చెప్పాలంటే ‘ఏక్ మినీ కథ’ స్టోరీ ఇంతే. ఇంతకంటే ఏమీ లేదు.

ఎలాంటి ట్విస్టులు లేకుండా ఏదో సింపుల్ గా నడిచే ఈ మినీ కథలో క్యారెక్టర్స్ ద్వారా మంచి కామెడీ పుట్టించి సినిమాను ఎంటర్టైన్ మెంట్ దారిలోకి తీసుకెళ్ళి సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ కథకి యాడ్ చేసిన కామెడీ ట్రాక్స్ బాగానే పేలాయి. అదే సినిమాను ఉన్నంతలో కాపాడింది. కొంచెం బోర్ కొట్టినప్పటికీ సినిమాను చూడగలం అంటే దానికి రీజన్ కామెడీ ఒక్కటే అని చెప్పొచ్చు.

నిజానికి ఇది బోల్డ్ సబ్జెక్ట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే యూ ట్యూబ్ లో ఓ పది నిమిషాల వీడియో చేయడానికి పనికొచ్చే సెన్సిబుల్ అడల్ట్ కంటెంట్. షార్ట్ వీడియోస్ కి పనికొచ్చే ఇలాంటి కాన్సెప్ట్ ని రెండు గంటల సినిమా తీయడమే పెద్ద టాస్క్. దర్శకుడిగా ఈ టాస్క్ తీసుకొని తన దర్శకత్వంలో పెద్దగా లోపాలు లేకుండా చూసుకున్నాడు కార్తీక్ రాపోలు. ఉన్న లోపమల్లా ‘చిన్న పాయింట్” ని సాగదీసి పెద్ద సినిమా చేయడమే.

నటీనటుల టైమింగ్ పట్టుకొని కామెడీ సన్నివేశాలు బాగానే హ్యాండిల్ చేసి సినిమాలో మంచి హాస్యం పండించాడు దర్శకుడు. ముఖ్యంగా హీరో పిన్ని కొడుకు సూసైడ్ కామెడీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే మిగతా కామెడీ ట్రాక్ లు కూడా ఉన్నంతలో బాగానే పేలాయి. ట్రెండీ డైలాగ్ కామెడీ కూడా అలరిస్తుంది. ఇక ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ ని వల్గర్ సన్నివేశాలు లేకుండా క్లీన్ గా కామెడీ గా చెప్పే ప్రయత్నం చేశారు. అది మెచ్చుకోదగిన విషయం. కాకపోతే సినిమా అంతా హీరో సైజ్ మేటర్ గురించే ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో చూడటం ఇబ్బందే.

ఇక ఈ సినిమా థియేటర్స్ లో అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇది ఓటిటికి మాత్రమే పనికొచ్చే సబ్జెక్ట్. ముందు నుండి ఓటిటి కే అనుకున్నారో ఏమో కానీ సినిమాలో ఓటిటి గురించి ఓ డైలాగ్ కూడా పెట్టారు. డాక్టర్ పాత్ర చేసిన హర్ష వర్ధన్ ఓ సందర్భంలో “ఏంటీ మీ నాన్న సడెన్ గా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ? అనడిగితే”. మన సినిమా ఎంత ఓటిటి లో రిలీజైన మా నాన్న తిట్టే బూతులు వింటే ఓటిటి వాళ్ళు కూడా ఒప్పుకోరు అంటాడు. ఈ డైలాగ్ విన్నాక సినిమా చూసే వారికి ఇది ఓటిటి కోసమే తీసిన సినిమా అర్థమవుతుంది.

ఇక ఈ బోల్డ్ కంటెంట్ ని క్లీన్ కామెడీగా చెప్పాలని డిసైడ్ అయిన మేర్లపాక గాంధీ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకూ కామెడీ ఉండేలా చూసుకున్నాడు. బ్రహ్మాజీ, హర్ష వర్ధన్ కి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం నుండే సినిమాను కామెడీగా నడిపించే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యారు. కామెడీనే సినిమాకు మేజర్ హైలైట్. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. బోర్ కొడితే సినిమాను ముందుకు జరిపే ఫార్వర్డ్ ఆప్షన్ ఓటిటి లో ఉంది కాబట్టి కామెడీ కోసం ఈ మినీ కథకి కొంత సమయం కేటాయించొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

సంతోష్ శోభన్ నటన

క్యారెక్టర్స్

కామెడీ

మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

కథ -కథనం

కొన్ని బోరింగ్ సీన్స్

ట్విస్టులు లేకపోవడం

బాటమ్ లైన్ : ఏక్ మినీ ‘ప్రైవేట్’ కామెడీ

రేటింగ్ : 2.5 / 5