'అమరం అఖిలం ప్రేమ' మూవీ రివ్యూ

Friday,September 18,2020 - 03:18 by Z_CLU

నటీనటులు: విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్, న‌రేశ్ వి.కె, శ్రీకాంత్ అయ్యంగార్, అన్న‌పూర్ణ‌మ్మ‌ త‌దిత‌రులు

సంగీతం: ర‌ధ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: ర‌సూల్ ఎల్లోర్‌

ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి

ఆర్ట్‌: రామ‌కృష్ణ మోనిక‌

నిర్మాత‌: వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జోనాత‌న్ ఎడ్వ‌ర్డ్.

విడుదల : 18 సెప్టెంబర్ 2020

OTTలోకి మరో సినిమా వచ్చింది. ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమా ఈరోజు స్ట్రీమింగ్ అయింది. మరి కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ :

ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా కూతురుని ప్రేమించే తండ్రి అరుణ్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగర్), నాన్న ని కూడా అంతే ప్రేమిస్తూ ఇష్టపడే అమ్మాయి అఖిల(శివశక్తి సచ్ దేవ్). ఒకరినొకరు విడిచి ఉండలేని తండ్రి, కూతురు ఓ కారణం చేత దూరమవుతారు. ఆ ఇన్సిడెంట్ వల్ల కూతురిని అమితంగా ఇష్టపడే అరుణ్ ప్రసాద్ ఇకపై అఖిలతో మాట్లాడకూడదని నిర్ణయించుకుంటాడు. తండ్రిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండని అఖిల, అరుణ్ ప్రసాద్ కి దూరంగా బాబాయ్ ఇంట్లో ఉంటూ IAS కి ప్రిపేర్ అవుతుంటుంది.

ఈ క్రమంలో అఖిలకి అమర్(విజయ్ రామ్) పరిచయమవుతాడు. మొదటి చూపులోనే అఖిలను చూసి ప్రేమలో పడిన అమర్ ఆమె ప్రేమను పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి తండ్రికి దూరంగా ఉంటూ చివరికి IAS గా అతని ముందు గర్వంగా నిలబడాలని చూసే అఖిల, అమర్ ప్రేమలో పడిందా..? ఇంతకీ అఖిల తన తండ్రికి దూరమవ్వడానికి కారణం ఏమిటి ..? చివరికి తన తండ్రికి అఖిల మళ్ళీ ఎలా దగ్గరైంది..? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

మొదటి సినిమాతోనే హీరో విజయ్ రామ్ నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. హీరోయిన్ శివ శక్తి సచ్ దేవ్ కూడా తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. ఇక నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు తమ అనుభవంతో వారు నటించిన సన్నివేశాలకు బలం చేకూర్చారు. కేబుల్ ఆపరేటర్ గా మహేష్ ఆచంట, ఫ్రెండ్ పాత్రలో రవి, హీరో చెల్లిగా ప్రణవి మానుకొండ ఆకట్టుకున్నారు. ఇదే మొదటి సినిమా అయినప్పటికీ వారి పాత్రలతో కొత్తవారందరూ పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

లవ్ స్టోరీకి ఎప్పుడూ మ్యూజిక్ ప్రాణం పోస్తుంది. ఈ సినిమా విషయానికొస్తే రథన్ అందించిన మ్యూజిక్ కొంత వరకూ ఇంపాక్ట్ తీసుకురాగలిగింది. పాటలు జస్ట్ పరవాలేదనిపించినా BGM మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో బలం లేకపోవడంతో మ్యూజిక్ మాత్రం హైలైట్ అయింది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాలను అందంగా బంధించాడు. అమర్ రెడ్డి ఎడిటింగ్ పరవాలేదు. రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోత్రి ఆర్ట్ వర్క్ బాగుంది. దర్శకుడు జోనాతన్ తను రాసుకున్న కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.


జీ సినిమాలు సమీక్ష :

తండ్రి కూతుర్ల మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్… వాటి మధ్య ఓ ప్రేమకథ… ఈ కథతో చాలా సినిమాలొచ్చాయి. కానీ ‘నువ్వే నువ్వే’, ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ లాంటి సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమాలు అంతలా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసిన సన్నివేశాలే. అవును కథను పర్ఫెక్ట్ గా చెప్పగలిగే సన్నివేశాలు రాసుకొని అందంగా చెప్పగలిగితే ఈ పాయింట్ తో ప్రేక్షకులను మెప్పించడం చాలా సులువు. కానీ కొత్త దర్శకుడు జోనాత‌న్ ఎడ్వ‌ర్డ్ తడబడుతూ ప్రేమకథను కనెక్ట్ చేయలేకపోయాడు. అనుకున్న పాయింట్ కి రాసుకున్న స్లో గా సాగే స్క్రీన్ ప్లే, బలం లేని సన్నివేశాలు అడ్డు తగిలాయి. ఇక ఎమోషనల్ సన్నివేశాలకు ఇంకాస్త మసాలాలు దట్టించే సంభాషణలు లేకపోవడం కూడా సినిమాకు మైనస్.

హీరో -హీరోయిన్ మధ్య వచ్చే అతి తక్కువ కన్వర్సేషణ్ సీన్స్ కి అలాగే ప్రీ క్లైమాక్స్ లో తండ్రి , కూతురుని మళ్ళీ ఒకటి చేసే హీరో ప్రయత్నం తాలూకు సన్నివేశాలకు సరైన సంబాషణలు పడలేదనిపించింది. దాంతో ప్రేక్షకులు కన్విన్స్ అవ్వలేకపోయారు. ముఖ్యంగా రొటీన్ కథ కావడం పైగా సన్నివేశాలు కూడా అలాగే రొటీన్ గా అనిపించడం ఒకానొక సందర్భంలో స్క్రీన్ ప్లే కూడా మరీ నత్తనడక సాగడం బోర్ ఫీలయ్యేలా చేసింది.

హీరో -హీరోయిన్ లవ్ ట్రాక్ , తండ్రి కూతురు మధ్య వచ్చే సన్నివేశాలపై దర్శకుడు మరింత దృష్టి పెడితే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఉండేది. అలాగే లవ్ స్టోరీ కి ఇంపాక్ట్ తీసుకొచ్చే మంచి లవ్ సాంగ్స్ కూడా సినిమాకు సెట్ అవ్వకపోవడం మైనస్. ఇక సినిమా మధ్యలో ఎంటర్టైన్ మెంట్ కి స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదని అర్థమవుతుంది. హీరో ఫ్రెండ్స్ తో వచ్చే కామెడీ సన్నివేశాలు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా బుజ్జి క్యారెక్టర్ తో అన్నపూర్ణమ్మ కాంబినేషన్ లో ఏదైనా కామెడీ ట్రాక్ సెట్ చేసి ఉండాల్సింది. ఉన్నంతలో సినిమా ప్రారంభంలో వచ్చిన తండ్రి కూతుర్ల సన్నివేశాలు, సినిమా మధ్యలో వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ గా దూరంగా ఉంటూ నరక యాతన పడే సీన్స్ , హీరోకి కనెక్ట్ అయి ప్రేమను వదులుకోలేక బాధ పడే సీన్స్ మాత్రం రొటీన్ ఫార్మేట్ లో బోర్ కొట్టించాయి. ఓవరాల్ గా ‘అమరం అఖిలం ప్రేమ’ జస్ట్ పరవాలేదనిపించే లవ్ స్టోరీ అనిపిస్తుంది.

రేటింగ్ : 2.5/5