"ఒరేయ్ బుజ్జిగా" మూవీ రివ్యూ

Thursday,October 01,2020 - 10:39 by Z_CLU

నటీనటులు: రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని
కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, మధునందన్‌ తదితరులు.
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
మాటలు: నంద్యాల రవి
ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
డాన్స్‌: శేఖర్‌,
బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.
రన్ టైమ్ : 2 గంటల 28 నిమిషాలు
రిలీజ్ డేట్ : అక్టోబర్ 1

రీసెంట్ గా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు తన హోప్స్ అన్నీ ఒరేయ్ బుజ్జిగా సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఈ
సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మన హీరో. మరి ఈరోజు ఓటీటీలో రిలీజైన ఈ సినిమా, రాజ్ తరుణ్ నమ్మకాన్ని నిలబెట్టిందా..? ZeeCinemalu ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

కథ

బుజ్జి (రాజ్ తరుణ్), కృష్ణవేణి (మాళవిక నాయర్)ది ఒకటే ఊరు. కానీ ఎక్కువగా బయట చదువుకోవడం వల్ల ఒకరంటే ఒకరికి తెలియదు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన బుజ్జికి పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (పోసాని). అదే టైమ్ లో కృష్ణవేణికి కూడా పెళ్లిచేయాలనుకుంటుంది తన అమ్మ (వాణి విశ్వనాథ్). అప్పటికే సుజన (హెబ్బ పటేల్)తో ప్రేమలో పడిన బుజ్జి, అమ్మ చూసిన సంబంధం ఇష్టంలేక కృష్ణవేణి ఇంటి నుంచి పారిపోతారు.

వీళ్లిద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఒకే ట్రయిన్ ఎక్కడం చూసిన ఆ ఊరి వ్యక్తి ఇద్దరూ కలిసి లేచిపోయారని పుకారు పుట్టిస్తాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు అవుతుంటాయి. అదే టైమ్ లో హైదరాబాద్ లో అనుకోకుండా కలిసిన బుజ్జి-కృష్ణవేణి ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే ఊరిలో పుకారు గురించి తెలుసుకున్న బుజ్జి, ఎలా ఉంటుందో కూడా తెలియని కృష్ణవేణిపై కోపం పెంచుకుంటాడు. కృష్ణవేణికి కూడా బుజ్జిపై కోపం ఉంటుంది. ఈ క్రమంలో కృష్ణవేణి మేనమామ (రాజారవీంద్ర)కు ఆమెను అప్పగించేస్తాడు బుజ్జి.

ఫైనల్ గా బుజ్జి, తన కృష్ణవేణిని చేరుకున్నాడా లేదా.. గొడవలు పడుతున్న రెండు కుటుంబాల్ని ఎలా కలిపాడనేది స్టోరీ.

 

నటీనటుల పనితీరు

ఈ సినిమాకు సంబంధించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే కృష్ణవేణి పాత్ర పోషించిన మాళవిక గురించే చెప్పుకోవాలి. ఆమె లుక్స్, యాక్టింగ్ అంతా చాలా నేచురల్ గా ఉన్నాయి. ఈ సినిమాకు ఆమె పెద్ద ప్లస్. ఇక రాజ్ తరుణ్ ఎప్పట్లానే ఇరగదీశాడు. మంచి సీన్స్ పడడంతో తన కామెడీ టైమింగ్ మరోసారి చూపించాడు.

క్యారెక్టర్ నటుల్లో పోసాని ది బెస్ట్ ఇచ్చాడు. ఇక వాణి విశ్వనాధ్ లుక్స్, ఆమె క్యారెక్టర్ బాగున్నప్పటికీ ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. మధునందన్, సత్య, సత్యం రాజేష్, సప్తగిరి కామెడీతో ఆకట్టుకున్నారు. సిచ్యుయేషనల్ కామెడీ కావడంతో దాదాపు ఆర్టిస్టులంతా కామెడీ పండించారు. చివరికి పోసాని, సీనియర్ నరేష్ కూడా.

 

టెక్నీషియన్స్ పనితీరు

సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా రాధామోహన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కథపై ఆయన ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాడనేది సినిమా క్వాలిటీ చూస్తే అర్థమౌతుంది. ఇక ఆ క్వాలిటీని తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ ఎప్పట్లానే పాటలతో ఆకట్టుకొని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడ డిసప్పాయింట్ చేశాడు.

ఇక దర్శకుడి విషయానికొస్తే.. విజయ్ కుమార్ కొండా ఎత్తుకున్న పాయింట్ కొత్తదేం కాదు. ఇంకా చెప్పాలంటే గతంలో అతడు తీసిన గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాల్లోని సన్నివేశాలు, పాయింట్లు ఇందులో కూడా దొర్లాయి. కాకపోతే ఆ ఓల్డ్ కాన్సెప్ట్ నే కొత్తగా చెప్పడానికి చాలా ట్రై చేశాడు. అయితే ఈ క్రమంలో కామెడీ పండించడం కోసం అనవసరంగా కొన్ని సీన్లు పెంచుకుంటూ పోయాడు. ఓ 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

జీ సినిమాలు సమీక్ష

అసలే సినిమాల్లేవు. థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఓటీటీలో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్ తక్కువగానే ఉంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఒరేయ్ బుజ్జిగా అంటూ వచ్చిన రాజ్ తరుణ్, హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్నందించాడు. లాక్ డౌన్ లో ఇంత హిలేరియస్ మూవీ రాలేదు. అదే ఈ సినిమాకు సెల్లింగ్ పాయింట్.

తమ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ అని చెబుతూనే ఉన్నారు మేకర్స్. వాళ్ల నమ్మకం నిజమైంది. సినిమా చూసిన ఓటీటీ జనాలు కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో హీరో, హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు అనే తేడా లేకుండా అంతా కామెడీ పండించారు. చివరికి సీరియస్ గా సాగాల్సిన హెబ్బా పటేల్ బ్రేకప్ ఎపిసోడ్ ను కూడా కామెడీగా చూపించి మంచి మార్కులు కొట్టేసింది యూనిట్.

ప్రేమకథనే రొటీన్ గా చెప్పకుండా కాస్త కొత్తగా చెప్పడానికి ట్రై చేసిన దర్శకుడు దాదాపు 90శాతం సక్సెస్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో 2 విషయాల్ని మరిచిపోయాడు. ఒకటి.. కామెడీ పేరిట అనవసరంగా కొన్ని సీన్స్ పెట్టాడు. ప్రీ-క్లైమాక్స్ కు ముందు సినిమా కొంచెం సాగినట్టు అనిపిస్తుంది. ఇక రెండోది కన్ఫ్యూజన్ కామెడీ పేరిట స్క్రీన్ ప్లే తో గజిబిజి చేశాడు. ఇక్కడ కూడా అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రన్ టైమ్ తగ్గినప్పటికీ క్లైమాక్స్ లో స్ట్రయిట్ గా పాయింట్ లోకి వచ్చేస్తే బాగుండేది.

హీరోహీరోయిన్లు రాజ్ తరుణ్, మాళవిక ఈ సినిమాను నిలబెట్టారు. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ తో పాటు ఈసారి మంచి స్టెప్పులు కూడా వేశాడు. మాళవిక కథను బాగా అర్థంచేసుకొని, నేచురల్ గా నటించింది. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి దర్శకుడు రాసుకున్న సన్నివేశాల వల్ల వీళ్లు కూడా ఏం చేయలేకపోయారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రీ-క్లైమాక్స్ కుదించినట్టయితే రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.

ఓవరాల్ గా ఒరేయ్ బుజ్జిగా సినిమా ఫుల్ లెంగ్త్ ఫన్ అందించడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది. ఎలాగూ ఓటీటీలో రిలీజైంది కాబట్టి.. ఫ్రీ టైమ్ లో ఇష్టమైన స్నాక్స్, డ్రింక్స్ పక్కనపెట్టుకొని కుటుంబంతో చక్కగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సినిమా. లాజిక్కుల గురించి ఆలోచించకుండా నటీనటులతో పాటు ఫ్లోలో వెళ్లిపోతే మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు.

బాటమ్ లైన్ – బాగుందిరా బుజ్జిగా
రేటింగ్2.75/5