Here’s the Interesting things about legendery actor Jamuna

Friday,January 27,2023 - 04:54 by Z_CLU

నిన్నటి తరపు ధృవతార జమున  ఇవాళ హైదరాబాద్ లో తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జమున చాలా సుదీర్ఘమైన కెరీర్ ని కొనసాగించారు. 1936 ఆగస్ట్ 30న జన్మించిన జమున 16 సంవత్సరాలకే ఇండస్ట్రీకి వచ్చారు. డాక్టర్ గరికపాటి రాజారావు 'పుట్టిల్లు' చిత్రం ద్వారా మొదటిసారి తెరమీద కనిపించారు. ఆ తర్వాత రెండేళ్లకే 1955లో ఎల్వి ప్రసాద్ గారి 'మిస్సమ్మ' ఆవిడకు గొప్ప గుర్తింపు తెచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి లాంటి దిగ్గజాల మధ్య ఎలాంటి బేరుకు లేకుండా నటించి మెప్పించారు.

జమున గారి స్వస్థలం కర్ణాటకలోని హంపి. అసలు పేరు జనా బాయ్. తండ్రి పేరు నిప్పుని శ్రీనివాసరావు, తల్లి కౌసల్య దేవి. వీళ్లది   కులాంతర వివాహం. మొదట్లో పసుపు పొగాకు వ్యాపారంలో ఉన్న వీళ్ళ కుటుంబం తర్వాత గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వచ్చి స్థిరపడ్డారు. సావిత్రి గారు ఆ సమయంలో నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు వీరి ఇంట్లోనే ఉండేవారు. సుమారు 198 సినిమాల్లో నటించిన జమున పొగరుబోతు పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు. శ్రీ కృష్ణ తులాభారంలో సత్యభామగా చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. గుండమ్మ కథలో గారాబం తలకెక్కిన క్యారెక్టర్ లో జీవించేశారామే.

జమున గారు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎంపిగా సేవలు అందించారు. రెండు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు ఎంజిఆర్ పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, సరోజినీదేవి జాతీయ అవార్డు జమునకు దక్కిన గౌరవాల్లో కొన్ని. ముద్దుబిడ్డ, గులేబకావళీ కథ, మూగ మనసులు, ఇల్లరికం, పూజా ఫలం, లేత మనసులు, పూల రంగడు, రాము, మట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, కలెక్టర్ జానకి, నాదీ ఆడజన్మే జమున గారు నటించిన ఆణిముత్యాల్లో కొన్ని. ఆ మధ్య 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' అనే చిన్న సినిమాలో చివరిసారిగా కనిపించారు. కైకాల మరణం ఇంకా జ్ఞాపకాల్లో ఉండగానే జమునగారు సెలవు తీసుకోవడం టాలీవుడ్ కి విచారకరం.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics