Sree Vishnu’s ‘Samajavaragamana’ Movie Review

Wednesday,June 28,2023 - 07:39 by Z_CLU

నటీ నటులు : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సినిమాటోగ్రాఫర్ : రాంరెడ్డి

సంగీతం : గోపీ సుందర్

డైలాగ్స్ : నందు సవిరిగాన

సమర్పణ : అనిల్ సుంకర

సహ నిర్మాత : బాలాజీ గుత్తా

నిర్మాణం : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్

నిర్మాత : రాజేష్ దండా

కథ : భాను బోగవరపు

స్క్రీన్ ప్లే & దర్శకత్వం : రామ్ అబ్బరాజు

నిడివి : 140  నిమిషాలు

విడుదల తేది : 29 జూన్ 2023

'రాజ రాజ చోర' తర్వాత  శ్రీ విష్ణు నుండి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో  మరోసారి ఎంటర్టైన్ మెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను నవ్వించేందుకు 'సామాజవరగమన' తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీ విష్ణు. రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాలో వర్కవుట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి ? సినిమా ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేసింది ?  జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

మల్టీప్లెక్స్ లో పనిచేస్తూ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసే బాక్సాఫీస్ బాలు (శ్రీ విష్ణు) తన తండ్రిను ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించి తాతల కాలం నాటి ఆస్తి అందుకోవాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో బాలుకి సరయు (రెబా మౌనిక జాన్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. కాలేజీలో జరిగిన ఓ విషయం కారణం చేత తనను ప్రేమించే ప్రతీ అమ్మాయి చేత రాఖీ కట్టించుకునే బాలు సరయుతో పీక లోతులో ప్రేమలో పడతాడు. సరయు కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూసే బాలుకి తన కుటుంబంలో ఒకరి కారణంగా ఓ అడ్డంకి వచ్చి పడుతుంది.  ఆ అడ్డంకి దాటుకొని బాలు తను ప్రేమించిన సరయుని పెళ్ళాడాడా  ? అలాగే బాలు తండ్రి డిగ్రీ పూర్తి చేసి తన ఆస్తి దక్కించుకున్నాడా లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

బాక్సాఫీస్ బాలు పాత్రలో శ్రీ విష్ణు ఒదిగిపోయాడు. ఇప్పటికే మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఈ తరహా చలాకీ  పాత్రలు చేసిన అనుభవంతో  బాలుగా మెప్పించి ఎంటర్టైన్ చేశాడు. కొన్ని సన్నివేశాల్లో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ బాగా ప్లస్ అయ్యింది. హీరోయిన్ రెబా మోనికా జాన్ కి కథలో ఇంపార్టెంట్ కేరెక్టర్ దొరకడంతో తన నటనతో ఆకట్టుకొని మంచి మార్కులు అందుకుంది. వీకే నరేష్ తన కామెడీ తో సినిమాకు హైలైట్ అనిపించుకున్నాడు. లేటు వయసులో డిగ్రీ పాస్ అవ్వడం కోసం కష్టపడే ఉమా మహేశ్వర్ పాత్రలో నవ్వుల పూవులు పూయించాడు. శ్రీ విష్ణు -నరేష్ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో వారి సన్నివేశాలు బాగా పండాయి. శ్రీకాంత్ అయ్యంగార్ రెగ్యులర్ పాత్రే అయినా కొన్ని సార్లు నవ్వించాడు. వెన్నెల కిషోర్ ఎప్పటిలానే సెకండాఫ్ బోర్ కొట్టకుండా తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో సుదర్శన్ అలరించాడు. రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు రామ్ రెడ్డి కెమెరా వర్క్ బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. ప్రతీ ఫ్రేమ్ అందంగా ఉంది. గోపి సుందర నుండి ఆశించే సాంగ్స్ ఇందులో పడలేదు. సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినేలా లేకపోవడం కొంత మైనస్. అక్కడక్కడా నేపథ్య సంగీతం బాగుంది.  ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది, ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ రన్ టైమ్ తో కట్ చేయడం ప్లస్ అయ్యింది. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ పరవాలేదు. నందు సవిరిగాన అందించిన ట్రెండీ డైలాగ్స్ , కామెడీ క్రియేట్ చేసే పంచ్ డైలాగ్స్ థియేటర్స్ లో బాగా పేలాయి.

భాను బోగవరపు కథ , రామ్ అబ్బారాజు కథనం ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా తను టార్గెట్ చేసిన ఫ్యామిలీ , యూత్ ఆడియన్స్ ను విపరీతంగా నవ్వించి దర్శకుడిగా పాస్ అయ్యాడు రామ్ అబ్బారాజు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ , హాస్య మూవీస్ ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

కొంతమంది యంగ్ హీరోలకి కామెడీతో కూడిన లవ్ స్టోరీస్ పర్ఫెక్ట్ గా సూటవుతాయి. అందులో శ్రీ విష్ణు ఒకరు. ఈ కుర్ర హీరోకి కామెడీ జోనర్ లో మంచి హిట్స్ ఉన్నాయి. తన ఇన్నోసెన్స్ తో కామెడీ పండించడం శ్రీ విష్ణు కున్న బలం. సరిగ్గా రామ్ అబ్బారాజు అలాంటి కథే ఎంచుకొని తనతో 'సామమాజవరగమన' తీశాడు. భాను అందించిన కథకి హిలేరియస్ ట్రీట్ మెంట్ ఇచ్చి ప్రేక్షకులకి రెండు గంటల ఇరవై నిమిషాల పాటు చక్కని వినోదం అందించాడు. సినిమా ఆరంభంలో స్మోకింగ్ యాడ్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో  చెప్పేట్టుగా శ్రీ విష్ణుతో కామెడీగా వాయిస్ చెప్పించాడు దర్శకుడు. అక్కడి నుండి సినిమా చివరి వరకూ టికెట్టు కొన్న ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది.

ఓ సింపుల్ కథను అంతే సింపుల్ గా చూపిస్తూ ఆద్యంతం నవ్విస్తూ సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకూ సరదా సన్నివేశాలతో నవ్వించిన దర్శకుడు రెండో భాగం నుండి అసలు కథలోకి వెళ్ళాడు. సీనియర్ నరేష్ మంచి నటుడు. ఆయనను వాడుకొని కామెడీ పండించిన దర్శకులు మంచి విజయాలు అందుకున్నారు. రామ్ అబ్బారాజు కూడా నరేష్ ను సుబ్బరంగా వాడుకొని ఆయన కామెడీ టైమింగ్ తో మంచి వినోదం వడ్డించాడు. శ్రీ విష్ణు , నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి.

రెండో భాగాన్ని హీరో- హీరోయిన్ లవ్ ట్రాక్ లో వచ్చే కాన్ఫ్లిక్ట్ తో ఆసక్తి కలిగేలా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా గ్రాఫ్ కొంత డౌన్ అయినప్పటికీ  , వెన్నెల కిషోర్ ను అలాగే ఓ సన్నివేశంలో నరేష్ ను వాడుకొని సినిమాను పాస్ చేయించేశాడు దర్శకుడు. పెద్ద కథ లేకపోవడం, ఉన్న కథనే లాగుతూ నడిపించడంతో సెకండాఫ్ కొంత డ్రాగ్ అనిపిస్తుంది. కానీ బోర్ కొట్టకుండా అక్కడ కూడా కామెడీను నమ్ముకొని గట్టెక్కేశాడు దర్శకుడు రామ్ అబ్బారాజు. ఫస్ట్ హాఫ్ లో నరేష్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ తో వచ్చే సన్నివేశాలన్నీ మంచి కామెడీ పంచాయి. అలాగే శ్రీ విష్ణు చెప్పే ట్రెండీ డైలాగ్స్ వర్కవుట్ అయ్యాయి. ఓ సందర్భంలో ఏషియన్ సినిమాస్ , పీవీఆర్ అంటూ వచ్చే చిన్న డైలాగ్ కూడా థియేటర్స్ లో బాగా పేలడం డైలాగ్ రైటర్ లో ఉన్న టాలెంట్ ను మెచ్చుకునేలా చేసింది. అలాగే శ్రీ విష్ణు హీరోయిన్ తో అమ్మాయిల గురించి అనర్గళంగా చెప్పే డైలాగ్ యూత్ ఆడియన్స్ ను బాగా మెప్పించి వారిచే క్లాప్స్ కొట్టించింది.  సరదాగా సాగే సన్నివేశాలు , శ్రీ విష్ణు- నరేష్ సన్నివేశాలతో వచ్చే కామెడీ , ట్రెండీ డైలాగ్స్ , వెన్నెల కిషోర్ కేరెక్టర్ తో వచ్చే కామెడీ , క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. 'వివాహ భోజనంబు' అనే కామెడీ సినిమా తీసిన అనుభవంతో రెండో సినిమాను  బాగా డీల్ చేశాడు రామ్ అబ్బారాజు.

శ్రీ విష్ణు నటన , రెబా మౌనిక జాన్ , నరేష్ కామెడీ , వెన్నెల కిషోర్ కుల శేఖర్ కేరెక్టర్ , అక్కడక్కడా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కెమెరా వర్క్ , హిలెరియస్ గా నవ్వించే డైలాగ్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. సెకండాఫ్ లో డ్రాగ్ అనిపించే సన్నివేశాలు , శ్రీకాంత్ అయ్యంగార్  తాలూకు కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు మైనస్ అని చెప్పవచ్చు. ఓవరాల్ గా  'సామజవరగమన' థియేటర్ లో కడుపుబ్బా నవ్వించడం గ్యారెంటీ. కొన్న టికెట్టుకి కామెడీతో లాభం చేకూరడం ఖాయం.

 

రేటింగ్ : 3 /