Prabhas’s ‘Adipurush’ Movie Review

Friday,June 16,2023 - 02:00 by Z_CLU

నటీ నటులు : ప్రభాస్ , కృతి సనన్ , సైఫ్ అలీఖాన్ , సన్నీ సింగ్ ,  దేవదత్త, సోనాల్  చౌహాన్ తదితరులు.

ఎడిటింగ్ : అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే

డివోపి : కార్తీక్ పలని

సంగీతం : సచేత్-పరంపర, అజయ్ అతుల్

నిర్మాతలు : టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్, వంశీ , ప్రమోద్

సమర్పకులు : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్

స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఓమ్ రౌత్

నిడివి : 179 నిమిషాలు

విడుదల తేది  : 16 జూన్ 2023

 

ప్రభాస్ ను రాముడిగా చూపిస్తూ దర్శకుడు ఓం రౌత్ మోడ్రన్ రామాయణం తీస్తున్నాడనగానే 'ఆదిపురుష్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ అంతగా మెప్పించకపోయినా , ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది. మరి ప్రభాస్ 'ఆదిపురుష్' ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించిందా ?  అంచనాలను అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ : 

రామాయణంలోని ముఖ్య ఘట్టాన్ని తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. తండ్రి దశరథ మహారాజు మాట మేరకు పద్నాలుగేళ్లు వనవాసానికి సిద్దమై జానకీ (కృతి సనన్) సమేతంగా అడవుల్లోకి వెళ్ళిన రాఘవుడు (ప్రభాస్) , శేషు తన చెల్లెలి ముక్కు కోశాడనే కోపంతో లంకాదీసుడు రావణుడు జానకీను ఎత్తుకువెళ్లడంతో, రావణుడిని ఎదురించి సీతను తిరిగి తీసుకొచ్చేందుకు వానర సేన రాజు సుగ్రీవుడి అలాగే అతిబలవంతుడు హనుమంతుడు సాయం తీసుకుంటాడు రాఘవుడు. తన సేనతో లంకపై దాడి చేసి చివరికి రావణుడ్ని అంతమొందించి సీతను తిరిగి అయోధ్యకి తీసుకొచ్చి రాజుగా రాఘవుడు పట్టాభిషేకం జరగడంతో ఆదిపురుష్ కథ ముగుస్తుంది.

   

నటీ నటుల పనితీరు :

రాఘవుడిగా ప్రభాస్ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. తన ఆహార్యంతో ఆ పాత్రకు అందం తీసుకొచ్చాడు ప్రభాస్.  జానకీ పాత్రలో కృతి ఆకట్టుకుంది.  శేషు పాత్రలో సన్నీ సింగ్ మెప్పించాడు. హనుమంతుడిగా దేవదత్తా అలరించాడు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. సోనాల్  చౌహాన్ మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఈ తరహా సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఎవరి విభాగంలో వారు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా విజువల్స్ , మ్యూజిక్  సినిమాకు హైలైట్ గా నిలిచాయి. మోషన్ పిక్చర్ టెక్నాలజీ వర్క్ బాగుంది.కార్తీక్ పలని కెమెరా వర్క్ బాగుంది. సచేత్-పరంపర, అజయ్ అతుల్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది.అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని డ్రాగ్ అనిపించే సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

ఓం రౌత్ కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఓం దర్శకత్వం బాగుంది. ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

  adipurush

జీ సినిమాలు రివ్యూ :

కొన్ని కథలు ఎన్ని సార్లు తీసినా చూడాలనిపిస్తుంది. అలాంటి గొప్ప కథల్లో రామాయణం ఒకటని చెప్పనక్కర్లేదు. రామాయణం మీద ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు వాటిని ఆదరించి పెద్ద విజయాలు అందించడమే దీనికి చక్కని ఉదాహారణ.  రామాయణంలో ముఖ్య ఘట్టాలతో 'సీత రామ కళ్యాణం' నుండి 'శ్రీరామ రాజ్యం' వరకూ చాలానే వచ్చాయి. ముఖ్యంగా ధారావాహిక రూపంలో రామాయణం ఇప్పటి జెనరేషన్స్ కి కూడా తెలుసు. అలాంటి అద్భుత కథను తీసుకొని ఓం రౌత్ ఈ సినిమా చేయడం పెద్ద రిస్కే. ఇప్పటి టెక్నాలజీ వాడుకొని మోడ్రన్ రామాయణాన్ని ఆదిపురుష్ గా తీర్చిదిద్దినందుకు మెచ్చుకోవాలి. అయితే సినిమాలో ఎక్కడా రామ , సీత అనే పేర్లు వినపడకుండా రాఘవుడు, జానకీ అనే మారు పేర్లను వాడుకున్నాడు ఓం. అలాగే లక్ష్మణుడిని శేషుగా పిలిపించాడు. ఇలా పేర్లు మార్చి  పెట్టడానికి రీజన్ డిఫరెంట్ గా ఉంటుందని కావొచ్చు. కానీ సీత రామ పేర్లను వింటూ రామాయణం చూసిన , చదివిన వారికి ఈ పేర్లు కొత్తగా ఉంటాయి.

రామాయణాన్ని మోడ్రన్ గా తీయడం , మోషన్ పిక్చర్ టెక్నాలజీని  వాడుకోవడం విషయంలో ఓం రౌత్ సాహసం కనిపిస్తుంది. కానీ మనకి తెలిసిన రామాయణాన్ని కాస్త సినిమా లిబర్టీ వాడుకొని చూపించడం మైనస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా రావణాసురుడు సీతా దేవిని లంకకి తీసుకెళ్ళే సందర్భంలో రాముడు ఆ ఘటన చూస్తూ వెనుక పరిగెత్తే  సీక్వెన్స్ ప్రేక్షకులకి మింగుడు పడదు. అలాగే ఇంకొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి పక్కన పెడితే మొదటి నుండి చివరి వరకూ 'ఆదిపురుష్' విజువల్స్ తో ట్రీట్ ఇస్తుంది. మ్యూజిక్ కూడా సినిమాకు బిగ్ ప్లస్. పాటలు , నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. అక్కడక్కడా వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. కానీ ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయి. క్లైమాక్స్ ఇంకాస్త ఇంపాక్ట్ గా తీసి వుంటే బాగుండేది. రామాయణంలో ముఖ్య ఘట్టంతో తీసిన ఇందులో హనుమంతుడి పాత్రను బాగా డిజైన్ చేసి ఆ పాత్రను ఎక్కువ హైలైట్ చేయడం బాగుంది. హనుమాన్ పాత్రతో వచ్చే సన్నివేశాలు పిల్లల్ని అలరిస్తాయి.  రాముడు , హనుమంతుడ్ని  సూపర్ హీరోస్ గా చూపిస్తూ వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. హనుమంతుడు సంజీవని తీసుకొచ్చే ఎపిసోడ్ ను గూస్ బంప్స్ వచ్చేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు దర్శకుడు. ఉన్నంతలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ ఎపిసోడ్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  కుంభకర్ణుడు ట్రాక్ ను ఓం రౌత్ ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే అక్కడ ఫన్ క్రియేట్ అయ్యేది. ఆ కేరెక్టర్ ను  సింపుల్ గా వాడుకోవడం మరో మైనస్.

రాముడిగా ఎన్టీఆర్ , శోభన్ బాబు, బాలకృష్ణ ఇలా కొంత మంది చేశారు. కానీ అందులో ఎన్టీఆర్, శోభన్ బాబు తమ ఆహార్యం, అందంతో మంచి మార్కులు అందుకున్నారు. ఆ కోవలోకి ప్రభాస్ కూడా చేరాడు. ఆరడుగుల కటౌట్ తో రాముడిగా ఆకట్టుకున్నాడు. మీసమున్న రాముడిగా సరికొత్తగా కనిపించాడు. కాస్టింగ్ విషయంలో అందరూ పర్ఫెక్ట్ అనిపించారు. కానీ రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ ను తీసుకోవడం రాంగ్ ఛాయిస్ అనిపించింది. కొన్ని సందర్భాలలో తన విలనిజంతో పాత్రలో ఒదిగిపోయాడు కానీ ఆ పాత్రకు సైఫ్ కటౌట్ , గెటప్ సూటవ్వలేదు. ప్రభాస్ , కృతి సనన్ పెయిర్ బాగుంది.  కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో  వారి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ , జటాయువు సీక్వెన్స్ , ప్రీ క్లైమాక్స్ , హనుమంతుడి సన్నివేశాలు , విజువల్స్ , మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఆదిపురుష్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుంది.

రేటింగ్  : 2.75  /5