Nikhil’s ‘Spy’ Movie Review

Thursday,June 29,2023 - 02:02 by Z_CLU

నటీ నటులు : నిఖిల్ సిద్ధార్థ,   ఐశ్వర్య మీనన్, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ & ఇతరులు.

కెమెరా  : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్

సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్

రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి

కథ & నిర్మాత:  కె. రాజశేఖర్ రెడ్డి

సీఈవో : చరణ్ తేజ్ ఉప్పలపాటి

దర్శకత్వం & ఎడిటింగ్ : గ్యారీ బిహెచ్

నిడివి : 135 నిమిషాలు

విడుదల తేది : 29 జూన్ 2023

 

'కార్తికేయ2' తో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న నిఖిల్ సిద్దార్థ్ 'స్పై' అనే  మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయం అందుకున్నాడు ? స్పై అంచనాలను అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

 ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఖాదర్ ఖాన్ (నితిన్ మెహతా) భారతదేశంపై న్యూక్లియర్ ఎటాక్ ని ప్లాన్ చేస్తాడు. ఈ మిషన్ ని ఎలాగైనా అడ్డుకునేందుకు పై అధికారులు ఆర్డర్ మేరకు రా ఏజెంట్ జై ( నిఖిల్) రంగంలో దిగుతాడు. జై అన్నయ్య సుభాస్ (ఆర్యన్ రాకేశ్) కూడా రా ఏజెంట్. ఒక ఆపరేషన్ లో మిస్టీరియస్ గా ప్రాణాలు కోల్పోతాడు. ఖాదర్ ని పట్టుకోవానికి యాక్షన్ లోకి దిగిన జై అండ్ టీంకు మరో టాస్క్ ఎదురవుతుంది.

‘రా’ లో భద్రంగా ఉండాల్సిన నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సీక్రెట్ ఫైల్స్ మిస్ అవుతాయి. వాటిని ఖాదర్ చెజిక్కించుకున్నాడని తెలుసుకుంటారు. ఖాదర్ ఆ ఫైల్స్ తో ఏం ప్లాన్ చేశాడు ? జై అన్నయ్య ని చంపింది ఎవరు? న్యూక్లియర్ ఎటాక్ కి నేతాజీ ఫైల్స్ కి మధ్య వున్న సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

స్పై ఏజెంట్ గా నిఖిల్ ఆకట్టుకున్నాడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ అనిపించాడు. ఐశ్వర్య మీనన్ కి కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దక్కడంతో తన యాక్టింగ్ తో సినిమాకు ప్లస్ అనిపించుకుంది. ఆర్యన్ రాజేష్ కనిపించింది తక్కువే అయినా ఇంపార్టెంట్ రోల్ తో మెప్పించాడు. అభినవ్ గోమఠం డైలాగ్ కామెడీతో అలరించాడు. జిషు సేన్ గుప్తా పవర్ ఫుల్ విలన్ గా కాకుండా సాధారణ విలన్ గా కనిపించి సినిమాకు మైనస్ అనిపించాడు.

నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ తదితరులు కథలో ముఖ్య పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

 విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేసిన జూమ్ జూమ్ సాంగ్ తో పాటు శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఆజాదీ సాంగ్ ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ పరవాలేదు. కంటెంట్ ని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. ఎక్కడా లెంత్  లేకుండా క్రిస్ప్ గా కట్ చేయడం ప్లస్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి అందించిన కథ పరవాలేదు. కథనం ఆసక్తిగా లేదు.

ఎడిటర్ గా తనకున్న అనుభవంతో కంటెంట్ ను పర్ఫెక్ట్ రన్ టైమ్ కి కట్ చేసుకున్న గ్యారీ దర్శకుడిగా మాత్రం ఎక్కువ మార్కులు అందుకోలేకపోయాడు. ప్రొడక్షన్ వెల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

నిఖిల్ కథల ఎంపిక విభిన్నంగా ఉంటుంది. తను చేసే ప్రతీ సినిమా ఆడియన్స్ కి ఓ కొత్త అనుభూతి ఇవ్వాలని కోరుకుంటాడు నిఖిల్. అందుకే తనతో పాటు వచ్చిన మిగతా హీరోల కంటే నిఖిల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ మరోసారి అలాంటి విభిన్నమైన కథతో వస్తాడనుకున్న ప్రేక్షకులకి స్పై తో కొంత నిరాశ పరిచాడు. సహజంగా స్పై మూవీస్ లో కనిపించే రా ఏజెంట్స్ చేపట్టే  మిషన్స్  , టెర్రరిజం , బ్లాస్ట్ లు స్పై లో కనిపించాయి, కానీ అందులో కొత్తదనం లేదు. సుభాష్ చంద్ర బోస్ డెత్ మిస్టరీ ఒక్కటే కాస్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథతో స్పై తెరకెక్కిందని ముందు నుండి నిఖిల్ ప్రమోషన్ లో చెప్పాడు కానీ కథలో సుభాష్ చంద్ర డెత్ మిస్టరీ గురించి ఓ పది నిమిషాలే ఉంది. క్లైమాక్స్ కి ముందు రానా స్పెషల్ అప్పిరియన్స్ తో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి నేతాజీ గొప్పదనం చెప్పే సన్నివేశాలు వస్తాయి. కానీ ఆయన ఎలా చనిపోయారు ? అనే విషయాన్ని లోతుగా చూపించలేదు దర్శకుడు. చివర్లో సింపుల్ గా ఆయన విజన్ గురించి , దేశం కోసం ఆలోచించిన విధానం గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

స్పై యాక్షన్ మూవీస్ అంటే ఆసక్తి గా సాగే స్క్రీన్ ప్లే అవసరం. కథ ఎలా ఉన్నా కథనంతో ఈ జానర్ సినిమాలు పాస్ అవుతుంటాయి. గ్రిప్పింగ్ గా సాగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తే చాలు హిట్ అందుకోవచ్చు. కానీ స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. రా ఏజెంట్స్ మిషన్ , క్లూస్ , ట్విస్టులు బాగా ప్లాన్ చేసుకోవాలి. స్పై లో అదే మైనస్ అనిపిస్తుంది. కథ పరంగా పరవాలేదనిపించినా సరైన కథనం కుదరకపోవడంతో పూర్తిగా మెప్పించలేకపోయింది. ప్రతీ స్పై మూవీలో కనిపించే ఓ వ్యక్తిను పట్టుకునే మిషనే ఇందులోనూ ఉంది తప్ప కొత్తగా ఏమి లేదు. రెగ్యులర్ రొటీన్ కథకే సుభాష్ చంద్ర బోస్ కథను కొద్దిగా లింకు చేశారు. రా ఏజెంట్ అంటే ఆషా మాషీ కాదు. అందుకే  అడివి శేష్ లాంటి కొద్ది మంది మాత్రమే ఈ జానర్ సినిమాలు చేస్తారు. నిఖిల్ స్పై రా ఏజెంట్ గా మంచి ప్రయత్నం చేశాడు. నటన  పరంగా మంచి మార్కులు  అందుకున్నాడు. కానీ కంటెంట్ తో మెస్మరైజ్ చేయలేకపోయాడు.

సినిమాలో హీరో పక్కనే ఉంటూ డైలాగ్ కామెడీ చేసే ఫ్రెండ్ కేరెక్టర్ చూస్తే ఇది స్పై మూవీ కాదేమో అనిపిస్తుంది. లవ్ స్టోరీస్ లో ఉండే ఫ్రెండ్ పంచ్ కామెడీ ఇందులో అనవసరం అనిపించకమానదు. కాకపోతే ఆ కేరెక్టర్ కొంత ఎంటర్టైన్ చేస్తుంది. అసలు విలన్ ను దాచి సెకండాఫ్ లో రివీల్  చేయడం అనేది చాలా సినిమాల్లో చూశాం. స్పై లో కూడా అదే ఫార్మెట్ కనిపిస్తుంది. కానీ జీషు సేన్ గుప్తా కేరెక్టర్ పవర్ ఫుల్ గా కాకుండా రెగ్యులర్ విలన్ గా అనిపించింది. విలన్ క్యారెక్టర్ డిజైనింగ్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. స్పై మొదటి భాగం పరవాలేదనిపించినా రెండో భాగం మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్  మైనస్ అనిపిస్తాయి. అక్కడక్కడా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. న్యూక్లియర్ ఎటాక్ కి నేతాజీ ఉన్న సంబంధాన్ని చెప్పే విధానంలో దర్శకుడు కొంత తడబడ్డాడు. నిజానికి స్పై లో నేతాజీకీ సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటిని చెప్పే విధానం, రైటింగ్ కుదరకపోవడంతో ఈ కథని తెరపై ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో దర్శక, రచయితలు విఫలమయ్యారు. కొన్ని సందర్భాలలో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తూ నేరేట్ చేయడం తేడా కొట్టింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అంతే ఇంట్రెస్టింగ్ చూపించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో దర్శకుడు గ్యారీ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేకపోయాడు.

నిఖిల్ పెర్ఫార్మెన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కెమెరా వర్క్ , సౌండ్ డిజైనింగ్ , యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా మిగతవన్నీ మైనస్ అనిపిస్తాయి.

రేటింగ్ : 2 .5 /5