Movie Review – Pushpa

Friday,December 17,2021 - 11:57 by Z_CLU

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాసిల్ , సునీల్, రావు రమేష్ , అనసూయ , ధనుంజయ్, అజయ్ ఘోష్, అజయ్, కల్పలత, జగదీశ్ తదితరులు

కెమెరామెన్: మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా

నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై

రచన -దర్శకత్వం : సుకుమార్ బి

నిడివి : 179 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 17 డిసెంబర్ 2021

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కిన 'పుష్ప' భారీ అంచనాలతో ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 'రంగస్థలం' తర్వాత సుకుమార్, 'అల వైకుంఠ పురములో' తర్వాత బన్నీల నుండి వచ్చిన ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్ ఉన్నాయి. మరి 'పుష్ప పార్ట్ 1' ఆ అంచనాలు అందుకుందా ? బన్నీ పుష్ప రాజ్ గా మెస్మరైజ్ చేసి పార్ట్ 2 పై క్యూరియాసిటీ కలిగించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

allu Arjun pushpa movie stills కథ :

చిత్తూరు శేషాచలం అడవుల్లో రోజుకూలీగా పనిచేస్తూ జీవితాన్ని గడిపే పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఓ సందర్భంలో డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం నరికే పని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్తాడు. ఈ క్రమంలో కొండన్న (అజయ్ ఘోష్) దగ్గర ఎర్రచందనం కూలీగా పనిచేస్తుంటాడు. మరోవైపు శ్రీవల్లి(రష్మిక) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఆమె వెంటపడుతుంటాడు. కొండన్న దగ్గర పనిచేస్తూ ఓ టైంలో మంగళం శీను (సునీల్) కి ఎదురెళ్ళి అక్కడి ఎం.పి(రావు రమేష్) సపోర్ట్ తో సిండికేట్ బాస్ గా మారతాడు.

అలా ఎర్రచందనం వ్యాపారానికి రారాజుగా ఎదిగిన పుష్ప నేపథ్యం ఏమిటి? అతను ఎవరు? కూలీ స్థాయి నుండి బాస్ స్టేజ్ వరకూ ఎలా ఎదిగాడు? ఫైనల్ గా ఆ ఏరియాకి ఎస్పీ గా వచ్చిన బన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో గొడవ పెట్టుకున్న పుష్ప అతనితో పాటు చిన్నతనం నుండి ఇంటి పేరు లేదనే కారణంతో అవమానించేవారికి ఎలా సమాధానం చెప్పాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. సరికొత్త గెటప్ లో కనిపిస్తూ చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఊరమాస్ క్యారెక్టర్ లో అదుర్స్ అనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన ఎనర్జీ చూపించాడు. ఓవరాల్ గా పుష్ప రాజ్ క్యారెక్టర్ తో పుష్ప సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు బన్నీ. శ్రీవల్లి పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. పెర్ఫార్మెన్స్, గ్లామర్ రెండింటితో అలరించి సినిమాకు ప్లస్  అనిపించుకుంది. విలన్ పాత్రలో సునీల్ మెప్పించాడు. సునీల్ చేసిన పాత్రలు ఇప్పటివరకూ ఒకెత్తు, మంగళం శీను పాత్ర మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. ఇకపై సునీల్ విలన్ గా మరిన్ని ఆఫర్స్ అందుకోవడం ఖాయం. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ ఫాసిల్ బెస్ట్ ఇచ్చాడు.

రంగమ్మత్త తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడంతో అనసూయ మరోసారి మంచి నటన కనబరిచింది. హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ లో జగదీష్ అలరించాడు. అతడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. హీరో తల్లి పాత్రలో కల్పలత బాగా నటించింది. రావు రమేష్, ధనుంజయ్, అజయ్ ఘోష్, అజయ్, శత్రు తమ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు బెస్ట్ ఎఫర్ట్ పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట చాలా బాగుంది. స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో బాగా క్లిక్ అయింది. కొన్ని సన్నివేశాలకు దేవి ఇచ్చిన నేపథ్య సంగీతం సన్నివేశాల స్థాయిని పెంచేలా ఉంది. ఓవరాల్ గా తన మ్యూజిక్ తో సినిమాకు టెక్నికల్ గా బలం చేకూర్చాడు దేవి. మిరోస్లోవ్ క్యుబా బ్రోజెక్ కెమెరా వర్క్ అల్టిమేట్ అనిపించింది. కొన్ని విజువల్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. రామకృష్ణ, మౌనిక ల ప్రొడక్షన్ డిజైనింగ్, రసూల్ సౌండ్ డిజైనింగ్ బాగుంది. కార్తిక్ శ్రీనివాస్, రుబెన్ ఎడిటింగ్ పరవాలేదు. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.

శ్రీకాంత్ విస్సా అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. సుకుమార్ టేకింగ్ బాగుంది. ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ కథనంలో లోపాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Allu Arjun Pushpa Movie

జీ సినిమాలు సమీక్ష :

'రంగస్థలం'తో పీరియాడిక్ డ్రామా ఎంచుకొని దర్శకుడిగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సుకుమార్ మరోసారి 'పుష్ప' కోసం కూడా అలాంటి పీరియాడిక్ డ్రామానే ఎంచుకున్నాడు. కాకపోతే ఈసారి ఎర్రచందనం ఎలిమెంట్ తో అడవి నేపథ్యంలో సినిమా చేశాడు. ఈ కథ కోసం అల్లు అర్జున్ లుక్ మొత్తం మార్చేశాడు సుక్కు. బన్నీని సరికొత్తగా ప్రెజెంట్ చేసి ఆ విషయంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. పుష్ప కోసం మంచి కథ రాసుకున్న సుకుమార్ కథనంలో మాత్రం తన మేజిక్ చూపించలేకపోయాడు. ముఖ్యంగా రెండో భాగంలో స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. రెండో భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. ఎప్పటిలానే ఈసారి కూడా డ్రామా మీదే ఎక్కువ డిపెండ్ అయ్యాడు సుకుమార్. కాకపోతే ఆ డ్రామా పూర్తిస్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. కానీ సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రం సినిమాకు ప్లస్ అయ్యాయి.

కేశవ అనే క్యారెక్టర్ వాయిస్ ఓవర్ తో పుష్ప పాత్ర ని ఎలివేట్ చేస్తూ అతని ప్రయాణం గురించి చెప్తూ సినిమాను మొదలు పెట్టిన సుకుమార్ ఆ వెంటనే వచ్చే ఫైట్, కామెడీ సన్నివేశాలతో ముందుకు నడిపించాడు. ముఖ్యంగా పుష్ప క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం నవ్వు తెప్పిస్తుంది. తనను ఆటోలో రమ్మని చెప్పడంతో వెంటనే కారు కొని అందులో వెళ్ళే సీన్ తో పుష్ప స్వభావం ఎలాంటిదో చెప్పాడు సుకుమార్. అలాగే పుష్ప ఐడియాలజీ గురించి రెండు మూడు సన్నివేశాలు రాసుకున్నాడు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎర్రచందనం చెక్కలను ఎవరికీ కనిపించకుండా దాచే సన్నివేశాలు మెప్పించాయి. అలాగే కొన్ని సన్నివేశాలు సుకుమార్ మాత్రమే తీయగలడు అనిపించేలా ఉన్నాయి.

అలాగే చిన్నతనం నుండి తండ్రి ఇంటిపేరు చెప్పుకోలేని పరిస్థితిల్లో ఉండే 'పుష్ప' తాలూకు ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే మదర్ సెంటిమెంట్  సన్నివేశాలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. లవ్ ట్రాక్ మాత్రం అతికించినట్టుగా ఉంది తప్ప కనెక్ట్ అవ్వలేదు. తొలి చూపులోనే హీరో హీరోయిన్ ని చూసి ప్రేమలో పడటం ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా లేవు. కాకపోతే ఆ సన్నివేశాల్లో కామెడీ వర్కౌట్ అయింది. ఆ పార్ట్ ఎంటర్టైనింగ్ గా ఉంది తప్ప ప్రేమ సన్నివేశాలు మెప్పించలేదు.

సినిమా ఆరంభంలో పోలీసులతో వచ్చే ఫైట్ తో పాటు సునీల్ కి వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్స్.. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి. సెకండాఫ్ లో ధనుంజయ్ ని గోడౌన్ లో కొట్టే ఫైట్ తో పాటు అడవిలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకున్నాయి. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయాడు. సినిమా ఆరంభమైన క్షణాల నుండి స్క్రీన్ పై బన్నీ కనిపించడు కేవలం పుష్ప రాజ్ మాత్రమే కనిపిస్తాడు. విలనీ గా సునీల్ గెటప్ బాగుంది కానీ అతనికి ప్రాధాన్యం ఉన్న సన్నివేశాలు తక్కువయ్యాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మినహా మిగతా పాత్రలు కూడా పెద్దగా హైలైట్ అవ్వలేదు.

మొదటి భాగమంతా హీరో తాలూకు ప్రయాణాన్ని చూపిస్తూ అలాగే లవ్ ట్రాక్ తో సరదాగా నడిపించి ఇంటర్వెల్ బ్లాక్ తో మెప్పించిన దర్శకుడు సుకుమార్ రెండో భాగానికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. సెకండాఫ్ లో బలమైన సన్నివేశాలు ఇంకా ప్లాన్ చేసుకొని అదిరిపోయే ట్విస్ట్ ఏదైనా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ కూడా తేడా కొట్టేసింది. ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ ని లాస్ట్ లో తీసుకొచ్చి క్లైమాక్ కోసం మాత్రమే వాడుకున్నాడు సుక్కు. ఆ క్లైమాక్స్ కూడా పేలవంగా ఉంది. ఆ క్యారెక్టర్ ని మధ్యలో పరిచయం చేసి హీరో-విలన్ మైండ్ గేమ్ సీన్స్ రాసుకుంటే బాగుండేదేమో. కానీ ఆ క్యారెక్టర్ ని పార్ట్ 2 లో హైలైట్ చేయడానికి ఇందులో స్కోప్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది.

నిజానికి పార్ట్ 1 ఎండింగ్ అంటే ఎంతో కొంత క్యూరియాసిటీ రైజ్ చేయాలి. అసలేం జరిగింది ? అనే ఎలిమెంట్ తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే పార్ట్ 2 పై అంచనాలు పెరిగి పార్ట్ 1 క్లిక్ అవుతుంది. అయితే పుష్ప క్లైమాక్స్ కొచ్చేసరికి హీరో-విలన్ ఇకపై ఎలా గేమ్ ఆడతారు ? హీరో అవమానించడంతో విలన్ ఎలా రివేంజ్ తీర్చుకుంటాడు ? దాన్ని హీరో ఎలా ఎదుర్కుంటాడు ? అనే సాదా సీదా ఎలిమెంట్ తో పార్ట్ 1 ని క్లోజ్ చేసి నిరాశ పరిచాడు సుకుమార్.

నిజానికి రంగస్థలంలో ఇప్పటి వరకూ ఎవరూ చూడని ఓ రివేంజ్ ఎలిమెంట్ ని క్లైమాక్స్ గా పెట్టి మెస్మరైజ్ చేసిన సుక్కు ఈసారి మాత్రం అలాంటిది ప్లాన్ చేసుకోకపోవడం సినిమాకు మేజర్ మైనస్. నిడివి కూడా సినిమాకు మైనస్. మొదటి భాగం బోర్ కొట్టకుండా ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించదు. కానీ రెండో భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం నత్త నడకన సాగినట్టు అనిపిస్తాయి. ఓవరాల్ గా బ్రాండ్ అనేది బట్టల్లో కాదు బతకడంలో ఉంటుంది అంటూ చెప్పాడు సుకుమార్.

అల్లు అర్జున్ నటన, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్, సమంత స్పెషల్ సాంగ్, సెకండాఫ్ లో అడవిలో వచ్చే ఫైట్ ,సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్స్ కాగా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే , క్లైమాక్స్, లవ్ ట్రాక్, నిడివి సినిమాకు మైనస్ అనిపించాయి.

రేటింగ్ : 2.75/5