Movie Review – Shyam Singha Roy

Friday,December 24,2021 - 03:26 by Z_CLU

నటీ నటులు : నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, జిస్సు సేన్ గుప్తా, మనీష్ వాద్వా, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం తదితరులు

మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌

కథ : స‌త్య‌దేవ్ జంగా

నిర్మాణం : నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

నిర్మాత : వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి

స్క్రీన్ ప్లే - మాటలు- దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్‌

విడుదల తేది : 24 డిసెంబర్ 2021

నిడివి : 157 నిమిషాలు

టీజర్ , ట్రైలర్స్ తో ఎట్రాక్ట్ చేసి సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన నాని ఈరోజే 'శ్యామ్ సింగ రాయ్' అంటూ థియేటర్స్ లోకి వచ్చాడు. సరికొత్త పాత్రలో నాని ఎలా నటించాడు ? పాన్ ఇండియా సినిమాతో పూర్తి స్థాయిలో మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకునే వాసుదేవ్ (నాని) ముందుగా తన స్టోరీతో ఓ షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు. అందుకోసం హీరోయిన్ గా నటించే అమ్మాయి చూస్తుండగా సైకాలజీ చదువుకునే కీర్తి కనబడుతుంది. తనకి ఇష్టం లేకపోయినా కీర్తి కన్విన్స్ చేసి ఆమెతో తను అనుకున్న షార్ట్ ఫిలిం తీసి ఒక నిర్మాతకి చూపించి ఫ్యూచర్ ఫిలిం అవకాశం అందుకుంటాడు. ఆ షార్ట్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లో కీర్తి వాసుదేవ్ ప్రేమలో పడుతుంది. ఓ సందర్భంలో వాసు నోటి నుండి 'రోసీ' అనే పేరు రావడంతో అతనికి దూరమవుతుంది కీర్తి.

ఎట్టకేలకు తన కథను 'వర్ణం' అనే సినిమాగా తీసి దర్శకుడిగా విజయం అందుకున్న వాసుదేవ్ కి దాన్ని హిందీలో రీమేక్ చేయమని ఓ భారీ ఆఫర్ వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి బాలీవుడ్ ప్రాజెక్ట్ పెట్టి చెప్పే లోపు స్టోరీ కాపీ రైట్ కేసులో వాసుదేవ్ అరెస్ట్ అయి జైలుకి వెళ్తాడు. శ్యామ్ సింగ రాయ్ కొన్నేళ్ళ క్రితం రాసిన కథనే వాసుదేవ్ సినిమాగా తీశాడని అతని పై SR పబ్లికేషన్స్ కేసు  పెడతారు.  ఆ కేసు నుండి వాసుని బయటపడేసేందుకు  అడ్వకేట్ పద్మావతి (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) సహాయం తీసుకుంటుంది కీర్తి. అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు ? ఆటను రాసిన పుస్తకానికి వాసుదేవ్ రాసిన కథకి సంబంధం ఏమిటి ? వీరిద్దరికీ లింకేంటి ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

నాని ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతాడు. అందుకే అతనికి నేచురల్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఈ సినిమాలో ఇటు వాసుదేవ్ , అటు శ్యామ్ సింగ రాయ్ గా రెండు పాత్రలతో మెప్పించాడు. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ గా తన గెటప్ , బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసి కొత్తగా కనిపించాడు. సెకండాఫ్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు నాని. తన కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ శ్యామ్ సింగ రాయ్ ని కచ్చితంగా చెప్పుకోవచ్చు.  నాని తర్వాత కచ్చితంగా మాట్లాడుకోవాల్సింది సాయి పల్లవి గురించే. మైత్రి అనే పాత్రకు పూర్తి న్యాయం చేసింది. దేవాలయంలో నాట్యం చేస్తూ దేవదాసిగా ఉండే క్యారెక్టర్ కి తన నటన ద్వారా బెస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా ఓ సన్నివేశంలో నటిగా తనకి ఎలాంటి హద్దులు లేవని సీన్ డిమాండ్ చేస్తే దర్శకుడు చెప్పింది చేస్తుందని నిరూపించుకుంది. 'ఉప్పెన'తో మంచి క్రేజ్ అందుకున్న కీర్తికి ఓ బాబ్లీ రోల్ దక్కింది. సైకాలజీ చదివే సిటీ అమ్మాయిగా ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

అడ్వకేట్ పద్మావతి పాత్రకి  మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ న్యాయం చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంది. కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దొరకడంతో  రాహుల్ ర‌వీంద్ర‌న్‌ మంచి నటన కనబరిచి ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. జిస్సు సేన్ గుప్తా, మనీష్ వాద్వా విలన్స్ గా మెప్పించారు కానీ వారికి పూర్తి విలనిజం చూపించే స్కోప్ దక్కలేదు. అభిన‌వ్ గోమ‌టం డైలాగ్ కామెడీ కొన్ని సందర్భాల్లో పర్వాలేదనిపించింది. ముర‌ళీ శ‌ర్మ‌ , శివన్నారాయణ మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మ్యూజిక్ మినహా టెక్నికల్ గా సినిమాకు బెస్ట్ సపోర్ట్ అందింది. మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన సాంగ్స్ పరవాలేదు అనిపించాయి తప్ప మళ్ళీ గుర్తుచేసుకొని పాడుకునేలా లేవు. సాయి పల్లవి పెర్ఫాం చేసే సాంగ్ బాగుంది. ఆ పాటకు కోరియోగ్రఫీ ఆకట్టుకుంది. స‌ను జాన్ వ‌ర్ఘీస్‌ కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను తన అనుభవంతో బాగా పిక్చరైజ్ చేశాడు. న‌వీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.  కొన్ని సన్నివేశాలకు అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ప్లస్ అయ్యింది. మేకప్ బాగుంది. ముఖ్యంగా రాహుల్ రవీంద్రన్ , సాయి పల్లవిలను వృద్దులుగా చూపించడంలో మేకప్ మెన్ కష్టం కనిపించింది. కాస్ట్యూమ్స్ కూడా క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా బాగా డిజైన్ చేశారు. అక్కడక్కడా వచ్చే మాటలు బాగున్నాయి. కానీ క్లాప్స్ , విజిల్స్ కొట్టించే పదునైన మాటలు పడలేదు.

సత్యదేవ్ జంగా కథ రొటీన్ గానే ఉంది. కాకపోతే దానికి కలకత్తా నేపథ్యం ఎంచుకోవడం , దేవదాసి అనే ఎలిమెంట్ యాడ్ చేయడం కొత్తగా అనిపించింది.  డైరెక్టర్ గా రాహుల్ మంచి మార్కులు అందుకున్నాడు. కాకపోతే రైటింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే హీరో -హీరోయిన్ దొరికినప్పుడు ప్రతీ సన్నివేశం వర్కౌట్ అవుతుంది. సరిగ్గా 'శ్యామ్ సింగ రాయ్' కి అదే జరిగింది. నాని , సాయి పల్లవి ఇద్దరూ నేచురల్ యాక్టింగ్ తో ఇరగదీసే వాళ్ళే. అందుకే  సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు తీసిన దర్శకుడు రాహుల్ ఈసారి సత్యదేవ్ జంగా అందించిన పూర్వ జన్మల కథను ఎంచుకొని దానికి తనదైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కాకపోతే  రైటింగ్ లో రాహుల్ ఇంకాస్త వర్క్ చేసి ఉంటే అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హై మూమెంట్స్ , ఎవరూ ఊహించని ట్విస్ట్ పెట్టుంటే బెటర్ గా ఉండేది.

ఇక దర్శకుడిగా మాత్రం సినిమాకు పూర్తి న్యాయం చేశాడు రాహుల్. తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా సినిమాను డీల్ చేశాడు.  ఇక నాని , సాయి పల్లవిల క్యారెక్టర్ డిజైనింగ్ మీద బాగా వర్క్ చేశాడు దర్శకుడు. దాంతో ఆ పాత్రలు బాగా క్లిక్ అయ్యాయి. కాకపోతే మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ క్రియేట్ చేయలేకపోయాడు దర్శకుడు. కీర్తి శెట్టి ని కూడా గ్లామర్ షో కోసమే తీసుకున్నట్టుంది తప్ప ఆమెకి పెద్దగా స్కోప్ సన్నివేశాలు పడలేదు. ముఖ్యంగా విలనిజం ఎలివేట్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

సత్యదేవ్ జంగా అందించిన కథ పాతదే, కానీ దానికి దేవదాసి టచ్ ఇచ్చి కలకత్తా నేపథ్యం ఎంచుకోవడంతో కాస్త కొత్తగా అనిపించింది. టెక్నికల్ గా సినిమాకు పేరు పెట్టడానికి లేదు. కెమెరా వర్క్ , ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ , లైటింగ్ , మేకప్ ఇలా అన్ని శాఖల నుండి దర్శకుడికి మంచి టెక్నికల్ సపోర్ట్ అందింది. కాకపోతే మ్యూజిక్ మాత్రం మైనస్. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసేలా లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా పూర్తిగా ఆకట్టుకోలేదు. కాకపోతే నాని , కృతి రొమాంటిక్ సీన్ మాత్రం థియేటర్స్ లో వర్కౌట్ అయింది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దళితుడికి నీళ్ళు ఇవ్వకుండా కూర్చే బెట్టినపుడు నాని అతన్ని బావిలో పడేసే సీన్ అక్కడ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఆ సీన్ తో పాటు దేవదాసి ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ కి ఆయువు పట్టులా నిలిచింది. దేవదాసిల గురించి కథలో ప్రస్తావించిన విధానం బాగుంది. ఆ ఎపిసోడ్ లో హై మూమెంట్స్ , బలమైన సన్నివేశాలు ఇంకా పడి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ దానికి ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగించాయి. కాకపోతే కథకు తగ్గట్టుగా సింపుల్ క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. అలాగే సెకండాఫ్ ఎండింగ్ లోడ్రాగ్ అనిపిస్తూ నత్తనడకన సాగే సన్నివేశాలు కూడా మైనస్.   నాని, సాయి పల్లవి నటన , ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ , సాయి పల్లవి నాట్యంతో వచ్చే సాంగ్, ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే ఫైట్  సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  ఓవరాల్ గా 'శ్యామ్ సింగ రాయ్' ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని కారణాల చేత ఫైనల్ గా ఏదో వెలితి ఉండిపోతుంది.

రేటింగ్ : 2.75/ 5