Naga shaurya’s ‘Lakshya’ Movie Review

Friday,December 10,2021 - 02:50 by Z_CLU

నటీ నటులు :  నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడెకర్, శత్రు, సత్య , కిరీటి ధర్మ రాజు తదితరులు.

సినిమాటోగ్రాఫర్‌ : రామ్‌రెడ్డి

సంగీతం:  కాల‌బైర‌వ‌

ఎడిటింగ్:  జునైద్‌

నిర్మాత‌లు : నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి

విడుదల తేది : 10 డిసెంబర్ 2021

నాగశౌర్య ఫస్ట్ టైం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో చేసిన సినిమా 'లక్ష్య'. ఈ సినిమా కోసం శౌర్య సిక్స్ ప్యాక్ చేయడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఓ మోస్తారు అంచనాలు నెలకొన్నాయి. మరి  శౌర్య కొత్తగా చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ : 

విలు విద్యలో  కొడుకు సాధించలేకపోయిన విజయాన్ని మనవడితో ఎలాగైనా సాధించాలనుకుంటాడు రఘు రామయ్య(సచిన్ ఖేడెకర్). ఈ నేపథ్యంలో చిన్నతనం నుండే మనవడు పార్థు(నాగ శౌర్య) కి విలు విద్యలో కోచ్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తాడు. అలా చిన్నప్పటి నుండి విలు విద్య నేర్చుకున్న పార్థు మెల్ల మెల్లగా పోటీలో నిలిచి ఆ క్రీడలో రాణిస్తుంటాడు.

కానీ అనుకోకుండా తాత మరణించడంతో డిస్టర్బ్ అయిన పార్థు స్నేహితుడు రాజేష్(కిరీటి) చెప్పిన మాటలు విని డ్రగ్స్ అలవాటు చేసుకొని ఫైనల్ గా గేమ్ నుండి తొలగించబడతాడు. ఈ క్రమంలో తనకి పోటీ అవుతాడని భావించి రాహుల్ (శత్రు) పార్థు పై ఎటాక్ చేసి చేతి మణికట్టుకి గాయం చేస్తాడు. వీటన్నిటిని దాటి సారధి(జగపతి బాబు) సహాయంతో పార్థు మళ్ళీ అర్చెరీ గేమ్ లోకి ఎంటర్ అయి ఒలెంపిక్స్ కప్ గెలిచాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : 

పార్థు క్యారెక్టర్ కోసం కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ తో కొత్తగా అనిపించాడు నాగ శౌర్య. స్పోర్ట్స్ మెన్ గా ఆకట్టుకున్నాడు.  కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. కేతిక శర్మ హీరోయిన్ గా ఎట్రాక్ట్ చేసింది. బాబ్లీ క్యారెక్టర్ లో మరిసారి అలరించింది. సచిన్ ఖేడెకర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సారధి పాత్రలో జగపతి బాబు సినిమాకు కొంత వరకు ప్లస్ అయ్యాడు.  విలన్ గా శత్రు రాహుల్ పాత్రలో పరవాలేదనిపించాడు. కాకపోతే పూర్తి స్తాయి విలన్ గా మెప్పించలేకపోయాడు.

వడ్లమాని శ్రీనివాస్ , రాజశ్రీ నాయర్ , సురేష్ వారి పాత్రలకు న్యాయం చేశారు. రాజేష్ పాత్రలో కిరీటి ధర్మరాజు , కొండల రావు పాత్రలో వైవా హర్ష , అలాగే సత్య అలరించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

కాల భైరవ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. రామ్‌రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. జునైద్ ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. ఈ సినిమా కోసం సంతోష్ ఎంచుకున్న అర్చెరీ బ్యాక్ డ్రాప్ బాగుంది కానీ దానికి తగిన కథనం , సన్నివేశాలు రాసుకోవడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. అందులోకి స్పోర్ట్స్ డ్రామా అంటే ఎవరైనా ఆసక్తి కనబరుస్తారు.  దర్శకుడు సంతోష్ చెప్పిన ఆర్చెరీ నేపథ్యం కొత్తగా ఉండటంతో శౌర్య కూడా ఆసక్తి కనబరిచి ఈ ప్రాజెక్ట్ సైన్ చేసి ఉండొచ్చు. కానీ సంతోష్ ఈ స్పోర్ట్స్ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమాగా తెరకెక్కించలేకపోయాడు. స్పోర్ట్స్ డ్రామా సినిమాను హ్యాండిల్ చేయడం కష్టం. కథ పరంగా బాగున్నప్పటికీ దాని చుట్టూ ప్రాపర్ స్క్రీన్ ప్లే తో ఎమోషన్ పండించాలి. అప్పుడే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

ఏ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో అయినా చివరికి హీరో ఆ గేమ్ లో గెలిచి అందరిచేత చప్పట్లు కొట్టించుకోవడం కామన్. కానీ దాన్ని ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో  ప్రెజెంట్ చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందుకే ఈ జానర్ లో సినిమాలు అరుదుగా వస్తుంటాయి.కేవలం ఒకే ఒక సినిమా అనుభవంతో దర్శకుడు రెండో సినిమాకే ఈ జానర్ ఎంచుకొని పైగా ఇప్పటి వరకూ ఎవరూ  టచ్ చేయని ఆర్చెరీ స్పోర్ట్ ని కథా వస్తువుగా తీసుకోవడం అభినందించాల్సిన విషయమే. కానీ ఇలాంటి సినిమాలను హ్యాండిల్ చేయడానికి ఇంకాస్త అనుభవం అవసరమవుతుంది. ముఖ్యంగా స్క్రిప్టింగ్ లో ఎక్కువ వర్క్ చేయాల్సి వుంటుంది.

కథ , క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో  చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి కొత్త లుక్ లో కనిపించానని శౌర్య చెప్పుకున్నాడు. కానీ అదంతా వృధా అయింది. అసలు ఈ కథకి శౌర్య ఇంత కష్టపడాలా ? అనే  సందేహం ప్రేక్షకులకి కలగక మానదు. కథనంలో మాత్రమే కాదు క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా సరిగ్గా రాసుకోలేదు దర్శకుడు. ఎమోషనల్ సన్నివేశాలు,  డైలాగులు  పేలవంగా అనిపించాయి. ఇక కథలో డ్రగ్  ఎలిమెంట్ కూడా పెట్టిన దర్శకుడు దాన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు. కథ -కథనంలో లోపాలు ఉన్నాయి. బలమైన సన్నివేశాలు కూడా లేకపోవడం, ఫ్లాట్ నెరేషన్ తో స్లోగా సాగడం సినిమాకు మైనస్. సెంటిమెంట్ డ్రామా కూడా పండలేదు. అలాగే ఆర్చెరీ స్పోర్ట్ తో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా విలు విద్య నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'లక్ష్య' పూర్తి స్థాయిలో మెప్పించలేక టార్గెట్ మిస్ అయింది.

రేటింగ్ : 2.5 /5

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics