తెలుగు పాటకు ప్రాణం పోసిన కేకే గానం

Wednesday,June 01,2022 - 05:12 by Z_CLU

పాట ఏదైనా సంగీతం ఎంత బాగున్నా , సాహిత్యం చక్కగా కుదిరినా, ఆ పాటకు ప్రాణం పోసేది మాత్రం నూటికి నూరు పాళ్ళు గాయకుడే. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. కొందరు సింగర్స్ సంగీత దర్శకులను మించి భారీ క్రేజ్ సొంతం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఆ లిస్టులో కృష్ణ కుమార్ (కేకే) ఒకరు. దాదాపు అన్ని భాషల్లో ఎన్నో ప్రత్యేక గీతాలను ఆలపించిన ఈ గాయకుడు తెలుగులోనూ ఎన్నో క్లాసిక్ సాంగ్స్ పాడాడు.

కేకే ‘ప్రేమదేశం’ సినిమాతో సింగర్ గా సౌత్ లో ఎంట్రీ ఇచ్చాడు.  అందులో “కాలేజీ స్టైలే”, హలో డాక్టర్” సాంగ్స్ పాడి యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో కేకే పాడిన మొదటి స్ట్రైట్ సినిమా ‘సముద్రం’. శశి ప్రీతం మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ఆల్బంలో “హుప్స్” అనే సాంగ్ పాడాడు. ఆ తర్వాత వందేమాతరం సంగీతం అందించిన ‘ముత్యం’ సినిమా కోసం “ఉచితం” అనే పాట పాడాడు. ‘ సముద్రం ‘ , ‘ముత్యం’ సినిమాలు కేకే కి గుర్తింపు అందించలేదు. 2000 లో రిలీజైన ‘ఖుషి’ సినిమా కేకే కి తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో “హే మేరా జహా” అనే పాటతో థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించాడు. ఆ సాంగ్ కేకే కి తెలుగులో భారీ అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ పవన్ అభిమానులకు ఆ పాట ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో క్లాసిక్ సాంగ్స్ పాడి మ్యూజిక్ లవర్స్ హృదయంలో మంచి స్థానం సొంతం చేసుకున్నాడు.

కేకే పాడిన బెస్ట్ తెలుగు సాంగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ‘జయం’ సినిమాలో కేకే పాడిన “ప్రేమా ఓ ప్రేమా” పాట బాగా ఆకట్టుకుంది. తర్వాత   ‘ఆర్య’లో ” ఫీల్ మై లవ్” సాంగ్ యువతను విపరీతంగా ఎట్రాక్ చేసి పాపులర్ సాంగ్ అనిపించుకుంది. కొన్నేళ్ళ పాటు ఎక్కడ చూసినా ఆ సాంగే వినిపించింది. ఇక ‘నువ్వు నేను’ సినిమాలో “నీకోసమే నా అన్వేషణ” , ‘7/g బృందావన్ కాలనీ’ సినిమాలో “తలచి తలచి”, ‘దిల్’ లో “ఒక నువ్వు ఒక నేను” వంటి ఎమోషనల్ సాంగ్స్ కి తన గానంతో ప్రాణం పోశాడు కేకే. ఇక  ‘నా ఆటో గ్రాఫ్’ ఆల్బంలో కేకే పాడిన “గుర్తుకొస్తున్నాయి” తెలుగులో ఎవర్ గ్రీన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి “ఇంద్ర’లో దాయి దాయి దామ్మా” , వెంకటేష్ ‘ఘర్షణ’ లో ” చెలియా చెలియా” పాటలు ఒక ఊపు ఊపేశాయి.

మహేష్ ‘అతడు’ లో “అవును నిజం”, అల్లు అర్జున్ ‘ఆర్య 2’ లో “గుప్పెడంత ఈ ప్రేమకి” , గోపీచంద్ ‘ఆంద్రుడు’లో “ఓ సారి ప్రేమించాక” , పవన్ కళ్యాణ్ ‘జల్సా’ లో “మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా” పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి  గొప్ప సాహిత్యాన్ని మన చెవిలో తేనె పోసినట్టుగా తన గానంతో అందించి ఆ సాంగ్స్ ని సూపర్ హిట్స్ గా మార్చాడు కేకే. తెలుగులో మణిశర్మ , ఆర్ పి పట్నాయక్ సంగీతంలో ఎక్కువ పాటలు పాడాడు.

  హిందీలో ఎన్నో క్లాసిక్స్ పాడిన కేకే తెలుగులో కూడా చాలా క్లాసిక్ సాంగ్స్ పాడాడు. అందుకే కేకే మరణవార్త వినగానే తెలుగు సంగీత ప్రియుల షాక్ కి గురయ్యారు. ఒకటా రెండా కొన్ని వేల పాటలతో శ్రోతలను అలరించి ఆనదింప జేసిన కేకే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేకే భౌతికంగా మన ముందుకు లేకపోయినా 11 భాషల్లో 3 వేలకు పైగా ఆయన పాడిన పాటల రూపంలో మనతోనే ఉంటారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics