Lata Mangeshkar - నైటింగేల్ ఆఫ్ ఇండియా ఇక లేరు

Sunday,February 06,2022 - 11:36 by Z_CLU

Legendary singer Lata Mangeshkar passes away at 92

లెజండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర ఇక లేరు. దేశవ్యాప్తంగా గానకోకిలగా గుర్తింపు పొందిన లతాజీ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా లక్షణాలతో గత నెల హాస్పిటల్ లో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈసారి వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ట్రీట్ మెంట్ కు సహకరించలేకపోయారు. ఫలితంగా ఈరోజు ఉదయం ఆమె కన్నుమూశారు.

ఇండియన్ సింగింగ్ హిస్టరీలో లతా మంగేష్కర్ ది గోల్డెన్ పీరియడ్. తన జీవితం మొత్తాన్ని గానానికే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆమె. 30కి పైగా భాషల్లో 26వేల గీతాలు ఆలపించారామె. వీటిలో విదేశీ భాషలు కూడా ఉన్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలో ది బెస్ట్ సాంగ్స్ తీస్తే, అందులో 90శాతం లతా మంగేష్కర్ వే ఉంటాయి. ఆమె ఓ చరిత్ర.

1929లో జన్మించారు లతా మంగేష్కర్. ఆమెది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్, క్లాసికల్ సింగర్ పండిట్ దీన్ నాథ్ మంగేష్కర్ కూతురీమె. ఈమె అసలు పేరు హేమ. ఆ తర్వాత తల్లిదండ్రులే లత అనే పేరు పెట్టారు. లతా మంగేష్కర్ చిన్నప్పట్నుంచి బడికి వెళ్లలేదు. ఆమె చదువుకోలేదు. ఐదేళ్ల నుంచే ఆమెకు సంగీతం సర్వస్వం అయింది. అలా సంగీతమే ఆమె జీవితమైంది. తండ్రి చనిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆర్టిస్టుగా మారిన లతా మంగేష్కర్.. ఓవైపు నటిస్తూనే, మరోవైపు సంగీత సాధన కొనసాగించారు.

తొలిసారి ఓ మరాఠీ సినిమాకు పాట పాడారు లతా మంగేష్కర్. కానీ ఆ పాట సినిమాలో లేదు, ఎడిటింగ్ లో కట్ చేశారు. ఆ తర్వాత కొన్ని పాటలు పాడినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. సంగీత దర్శకుడు వినాయక్ తో కలిసి ఎప్పుడైతే ముంబయికి షిఫ్ట్ అయ్యారో అప్పుడు లతా మంగేష్కర్ కెరీర్ ఊపందుకుంది. ముంబయిలోనే హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటూ, మరోవైపు పాటలు పాడుతూ అంచెలంచెలుగా ఎదిగారు లతా మంగేష్కర్.

స్వతంత్యం రాక ముందు నుంచి పాటలు పాడుతున్న లతా మంగేష్కర్.. ప్రతి దశాబ్దంలో బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. సుదీర్ఘంగా 55 ఏళ్ల పాటు పాటలు ఆలపించిన లతాజీ.. దాదాపు ప్రతి ఏడాది ఓ హిట్ సాంగ్ అందించారు. హిందీ, మరాఠీ భాషల్లో అత్యథికంగా పాటలు పాడారామె. తెలుగులో నిదురపోరా తమ్ముడా, తెల్లచీరకు.. అనే పాటలు పాడింది లతా మంగేష్కరే. ఇక మలయాళంలో ఆమె కేవలం ఒకే ఒక్క పాట పాడారు.

తన కెరీర్ లో లతా మంగేష్కర్ అందుకోని అవార్డ్ లేదు. ఆమె అవార్డుల లిస్ట్ రాస్తే పేజీలు సరిపోవు. దేశ అత్యుత్తమ పురష్కారం భారతరత్న నుంచి పద్మ అవార్డులు, జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులు, డాక్టరేట్లు, ఇతర జాతీయ స్థాయి అవార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి. 2009లో ఆమె ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

కేవలం గాయనిగానే కాకుండా.. నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా కూడా రాణించారు లతా మంగేష్కర్. తన 92 ఏళ్ల జీవితంలో వివాదాలకు దూరంగా గడిపారు లతాజీ. బహుశా.. జీవితంలో ఒక్కసారి కూడా వివాదాలు ఎదుర్కోని ఏకైక సినీ ప్రముఖురాలు లతా మంగేష్కరే కావొచ్చు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది జీ సినిమాలు.