టాలీవుడ్ చరిత్రలో ఈరోజు

Monday,August 27,2018 - 11:22 by Z_CLU

చూడాలని ఉంది
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా చూడాలని ఉంది. వైజయంత్రీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై ఈరోజుకి సరిగ్గా 20 ఏళ్లు. 1998లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి.

మోసగాళ్లకు మోసగాడు
తెలుగులో మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఈరోజే విడుదలైంది. అవును.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా 1971, ఆగస్ట్ 27న విడుదలై ఈరోజుతో 47 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎంతో రిస్క్ చేసి తన సొంత బ్యానర్ పై కృష్ణ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అంతేకాదు, ఇండియాలోని అన్ని ప్రముఖ భాషలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలైంది ఈ సినిమా.

మనుషులు-మమతలు
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి కలిసి నటించిన మరో అపురూప చిత్రం మనుషులు-మమతలు. 1965లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమా ఏఎన్నార్ కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మేటి నటి, తమిళనాట రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన జయలలిత, ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రత్యగాత్మ డైరక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్ లో 100 రోజులాడింది