అనుష్క బర్త్ డే స్పెషల్

Thursday,November 07,2019 - 10:02 by Z_CLU

అది 2005 … అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రీయ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు. అప్పుడు కొత్త వాళ్లు వ‌చ్చినా కూడా అంత ఈజీగా కుదురుకునే రోజులు కావ‌వి. అలాంటి సమయంలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఓ మెరుపుతీగ.. ఆమె పేరు అనుష్క శెట్టి.. నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ‘సూప‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూగా నామినేట్ అయింది. ఇక 2006లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘విక్ర‌మార్కుడు’తో అనుష్క జాతకం మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో అనుష్క స్టార్ హీరోయిన్ రేస్ లోకి వెళ్ళడం, బడా సినిమాలలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోవడం జరిగిపోయాయి.

‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత అనుష్కకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత 2009లో అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధ‌తి’తో జేజమ్మగా నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ మరెన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘వేదం’ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది స్వీటీ. ‘సింగం’, ‘మిర్చి’, ‘సింగం 2’, ‘బాహుబలి’ లాంటి ఎన్నో సినిమాలతో తిరుగులేని హీరోయిన్ అయిపొయింది .14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచి టాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది.

‘అరుందతి’ తర్వాత ‘పంచాక్ష‌రి’ నిరాశ పరిచినా ‘రుద్ర‌మ‌దేవి’, ‘భాగ‌మ‌తి’ లాంటి సినిమాల‌తో త‌న స్థాయి నిరూపించుకుంది స్వీటీ. రుద్రమదేవి సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌తో పాటు సైమా అవార్డును సొంతం చేసుకున్న అనుష్కకి ‘బాహుబలి’ సినిమా కెరీర్‌లో కలుకితురాయిగా నిలిచింది. ఆ సినిమాలో దేవసేన పాత్రకు ప్రాణం పోసిన తీరు ప్రశంసనీయం. బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ఎంత పేరొచ్చిందో.. వాళ్లతో సమానంగా తన నటనకు మార్కులు వేయించుకుంది అనుష్క. ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాలం, కన్నడ ప్రేక్షకులను పలకరించబోతున్న అనుష్క శెట్టి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ‘జీ సినిమాలు’.