విశ్వాసం మూవీ రివ్యూ

Friday,March 01,2019 - 02:49 by Z_CLU

నటీనటులు: అజిత్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, అనైక‌, వివేక్, రోబో శంక‌ర్‌, యోగిబాబు
ఎడిట‌ర్‌: రూబెన్‌
సంగీతం: డి.ఇమాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి
నిర్మాత‌: ఆర్.నాగేశ్వ‌ర‌రావు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: మార్చి 1, 2019

తమిళనాట అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా విశ్వాసంతో మరో సూపర్ హిట్ కొట్టాడు అజిత్. ఇప్పుడు అదే సినిమా, అదే టైటిల్ తో తెలుగులోకి వచ్చింది. మరి ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఏంటి?

కథ
రావులపాలెం అనే ఊరికి మొనగాడు వీర్రాజు (అజిత్). ఆ ఊరికే కాదు, చుట్టుపక్కల 12 గ్రామాలకు అతడే హీరో. ఆ ఊరికి మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చిన నిరంజన (నయనతార)ను చూసి ఇష్టపడతాడు. నయనతార కూడా లైక్ చేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ ఊరి కోసం వీర్రాజు గొడవలు పడడం నిరంజనకు నచ్చదు. ఒక టైమ్ లో ఊరిలో జరిగిన గొడవలో కూతురికి చిన్న గాయం అవుతుంది. దీంతో భర్తను వదిలి కూతురితో పాటు ముంబయి వెళ్లిపోతుంది నిరంజన.

దాదాపు 15 ఏళ్ల తర్వాత భార్య కోసం ముంబయి వెళ్తాడు వీర్రాజు. అక్కడ కూతురు ఆపదలో ఉందని తెలుసుకొని, తను తండ్రిననే విషయం చెప్పకుండానే ఆమెకు అంగరక్షకుడిగా మారతాడు. ఇంతకీ వీర్రాజు-నిరంజనల కూతుర్ని ఎవరు చంపాలనుకున్నారు? ఎందుకు చంపాలనుకున్నారు? ఆ కుట్రను వీర్రాజు ఎలా చేధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.


నటీనటుల పనితీరు
అజిత్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. అతడి యాక్షన్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ సింప్లీ సూపర్బ్. కానీ అతడి గెటప్ మాత్రం తెలుగు ఆడియన్స్ కు ఎక్కదు. హీరోయిన్ నయనతార మరోసారి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేసింది. కొన్ని సందర్భాల్లో హీరోతో సమానంగా ఆమె సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. ఇప్పుడున్న హీరోయిన్లలో నయనతార తప్ప మరో హీరోయిన్ ఈ పాత్రను పోషించలేరు.

కాకపోతే 14 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నయనతారను ఇందులో చూడాల్సి రావడం తెలుగు ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. పైగా మేకప్ లో కూడా పెద్దగా మార్పులు చేయకపోవడంతో వయసు పైబడినట్టు కనిపించదు. అటు చూస్తే అజిత్ లావెక్కి, తెల్ల మీసాలు, గడ్డాలు, జుట్టుతో బాగా వయసైపోయిన వాడిలా కనిపిస్తాడు. కాకపోతే ఇది సెకెండాఫ్ లో మాత్రమే. ఫస్టాఫ్ లో అజిత్-నయన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఇక విలన్ గా జగపతిబాబు మరోసారి రొటీన్ పాత్ర పోషించగా.. ఫస్టాఫ్ లో కామెడీ పండించే బాధ్యతను యోగిబాబు, సెకెండాఫ్ లో కామెడీ బాధ్యతను వివేక్ తీసుకొని తమ పాత్రల్ని మెప్పించారు.

టెక్నీషియన్స్ పనితీరు
ఎప్పట్లానే దర్శకుడు శివ మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. సన్నివేశాలు రాసుకున్న దగ్గర్నుంచి, స్క్రీన్ ప్లే వరకు అన్ని విభాగాల్లో మెప్పించాడు. కాకపోతే ఈసారి తన మార్క్ యాక్షన్ కంటే సెంటిమెంట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వెట్రి వర్క్ బాగుంది. ముంబయి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఫైట్ తో పాటు.. కొన్ని పాటల్లో అతడి పనితనం కనిపిస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినప్పటికీ పాటలు మాత్రం ఆకట్టుకునేలా ఇవ్వలేకపోయాడు. మరీ ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వల్ల కొన్ని
పాటలు అస్సలే అర్థంకావు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.


జీ సినిమాలు సమీక్ష
ఎలాంటి కథలు ఎంచుకోవాలో.. ఎలాంటి సన్నివేశాలుంటే తన అభిమానులతో పాటు ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తారో అజిత్ కు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్లయినా అతడి స్టార్ డమ్ చెక్కుచెదరలేదు. ఫ్యాన్ బేస్ తగ్గలేదు. విశ్వాసం సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు అజిత్. ఈ సినిమాను అజిత్ మాత్రమే చేయగలడు. ఓ ప్రేమికుడిగా, ఓ నాయకుడిగా, తండ్రిగా, రక్షకుడిగా, విలన్ల పాలిట యముడిగా.. ఇలా విశ్వాసం సినిమాలో అజిత్ నుంచి ఎన్నో యాంగిల్స్ చూడొచ్చు. వీటన్నింటినీ ఒకే సినిమాలో అద్భుతంగా పండించి ది బెస్ట్ అనిపించుకున్నాడు అజిత్.

అజిత్ నుంచి ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో అవన్నీ విశ్వాసంలో పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు హెవీ డోస్ యాక్షన్ కూడా ఉంది. ఈసారి ఇంకాస్త ఎక్స్ ట్రా కిక్ ఇస్తూ పాటలు కూడా ఎక్కువగా ఉండేట్టు చూసుకున్నాడు అజిత్. అయితే ఇవన్నీ తమిళ ప్రేక్షకులకు మాత్రమే. తెలుగు ఆడియన్స్ కు ఈ ఎలిమెంట్స్ పెద్దగా నచ్చవు. ఎందుకంటే ఇక్కడి ప్రేక్షకుల దృష్టిలో అజిత్ స్టార్ కాదు. కేవలం హీరో మాత్రమే. ఊరికి మొనగాడుగా అజిత్ ను అద్భుతంగా చూపిస్తారు. కానీ ఎలా మొనగాడయ్యాడనే విషయాన్ని మాత్రం
ఎక్కడా ప్రస్తావించరు.

హీరో ఎలివేషన్స్ వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. దీనికి తోడు డబ్బింగ్ లో నేటివిటీని తీసుకురాలేకపోయారు. తెలుగులో బోర్డులు చూపించారు. సింక్ అయ్యేలా డబ్బింగ్ లు చెప్పించగలిగారు కానీ తమిళ ఫ్లేవర్ ను మరిపించలేకపోయారు. సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు వరకు అజిత్ ప్యాంట్ వేసుకుంటే ఒట్టు. అదే లుంగీ, సింగిల్ కలర్ కాస్ట్యూమ్. పైన హెయిర్ నుంచి కట్టిన లుంగీ వరకు మొత్తం తెలుపే. దీనికితోడు తెల్ల గడ్డం ఒకటి. తనను అమితంగా ఇష్టపడే తమిళ ఆడియన్స్ దృష్టిలో అజిత్ ఎలా ఉన్నా ఓకే. కానీ ఈ గెటప్ తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఎక్కదు.

ఇక సినిమా విషయానికొస్తే అజిత్ నుంచి ఇలాంటి కథ ఆశించడంలో తప్పు లేదు. కానీ సినిమాలో సన్నివేశాలు మాత్రం నిజంగా సర్ ప్రైజింగ్ అనిపిస్తాయి. సెకెండాఫ్ స్టార్ట్ అయినప్పట్నుంచి కుటుంబ సెంటిమెంట్ సన్నివేశాలు వరదలా వచ్చిపడుతుంటాయి. ఇంత హెవీ వెయిట్ ఎమోషనల్ సన్నివేశాలున్న సినిమాలో అజిత్ నటించడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. ఇంకా చెప్పాలంటే ఇందులో యాక్షన్ కంటే సెంటిమెంట్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. బహుశా తమిళ ప్రేక్షకులు ఈ సన్నివేశాలకే పడిపోయి ఉంటారు. సినిమాను అక్కడ సూపర్ హిట్ చేశారు.

రెగ్యులర్ గా అజిత్ తో సినిమాలు చేస్తూ వస్తున్న దర్శకుడు శివ, ఈసారి ఈ తండ్రి-కూతురు, భార్యాభర్త సెంటిమెంట్ సీన్లు చెప్పే అజిత్ ను ఒప్పించి ఉంటాడు. ఈ యాంగిల్ పై దృష్టిపెట్టిన శివ, ఈసారి తన
బలమైన హీరో-విలన్ కాంబినేషన్ ను పక్కనపెట్టేశాడు. అజిత్-జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు సరిగ్గా పండలేదు. దీనికి తోడు సినిమాలో పాటలు మైనస్. కోలీవుడ్ లో అజిత్ సూపర్ స్టార్ కాబట్టి, పైగా ఈ కథ వాళ్ల నేటివిటీకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ సూపర్ హిట్ అయింది. తెలుగులో మాత్రం ఈ సినిమా ఆడడం కష్టమే.

రేటింగ్2/5