Movie Review - సర్కారు వారి పాట

Thursday,May 12,2022 - 01:13 by Z_CLU

Mahesh’s ‘Sarkaru Vaari Paata’ Movie Review

నటీనటులు: మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, నదియా, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

సంగీతం : థమన్ .ఎస్‌

సినిమాటోగ్ర‌ఫి : మ‌ధి

 నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట

రచన- దర్శకత్వం : పరశురామ్ పెట్ల‌.

నిడివి : 162 నిమిషాలు

విడుదల తేది : 12 మే 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట‘ భారీ అంచనాలతో ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టీజర్, ట్రైలర్ తో ‘పోకిరి’, ‘దూకుడు’  సినిమాలను గుర్తుచేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు మహేష్. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

sarkaru vaari paata mahesh (1)

కథ :

అమెరికాలో మహి ఫైనాన్స్ కంపెనీ పెట్టి లోన్స్ ఇస్తూ ఉంటాడు మహేష్ (మహేష్ బాబు). తన దగ్గర లోన్ తీసుకున్న వారి నుండి ముక్కు పిండి మరీ వడ్డీ వసూళ్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో చదువు కోసమని చెప్పి మహేష్ ని బుట్టలో వేసుకొని 10 వేల డాలర్లు లోన్ తీసుకొని ఆ లోన్ ఎగ్గొట్టాలని చూస్తుంది కళావతి(కీర్తి సురేష్). నిజం తెలుసుకున్న మహేష్ ఆమె తండ్రి, ఎంపీ  రాజేంద్రనాధ్ దగ్గర ఆ డబ్బు వసూళ్ళు చేయడానికి వైజాగ్ వస్తాడు.

అలా వైజాగ్ లో అడుగుపెట్టిన మహేష్, కళావతి తండ్రి రాజేంద్రనాద్ నుండి పది వేల డాలర్లు కాకుండా 10 వేల కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తాడు. ఇంతకీ రాజేంద్రనాద్ పది వేల కోట్లు అప్పు ఉన్నది ఎవరికి? మహేష్ గతం ఏమిటి? అతను అమెరికా నుండి వైజాగ్ వచ్చి రాజేంద్రనాద్ ని ఎందుకు ఢీకొన్నాడు? ఫైనల్ గా రాజేంద్ర నాద్ ని  భాద్యత గల ఆడపిల్ల తండ్రిగా ఎలా మార్చాడు ? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

మహేష్ పాత్రలో సూపర్ స్టార్ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్ తో ‘పోకిరి’, ‘ఖలేజా’, ‘దూకుడు’ సినిమాలను గుర్తుచేసి వన్ మేన్ షో అనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇంటెన్స్ తో నటించి విజిల్స్ వేయించాడు. ఈసారి డాన్సులతో కూడా అలరించాడు.  కీర్తి సురేష్ తన కేరెక్టర్ కి పూర్తి న్యాయం చేసింది. మహేష్ – కీర్తి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఎట్రాక్ట్ చేశాయి. సముద్రఖని తన నటనతో మంచి విలనిజం పండించాడు.  కొన్ని సందర్భాల్లో వెన్నెల కిషోర్ కామెడీ పేలింది. సెకండాఫ్ లో వచ్చే ఓ సీన్ లో ప్రభాస్ శ్రీను కామెడీ వర్కౌట్ అయింది. సుబ్బరాజు కూడా కొంత వరకూ తన కేరెక్టర్ తో నవ్వించాడు. కీలక పాత్ర అయినప్పటికీ నదియా కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైంది. తన నటనతో పాత్రకు బలం చేకూర్చింది. తనికెళ్ళ భరణి , నాగ బాబు, పవిత్ర లోకేష్, బహ్మాజీ , అజయ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసి తమ నటనతో సన్నివేశాలను పండించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది తమన్ గురించే. సినిమాకు ప్లస్ అయ్యే సాంగ్స్ అందించడంతో పాటు సన్నివేశాలను ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ లో “కళావతి” సినిమాకు హైలైట్ గా నిలిచింది. మిగతా సాంగ్స్ కూడా మంచి సాహిత్యంతో వినసొంపుగా ఉన్నాయి. అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం బాగుంది. మది అందించిన విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ లో తన పనితనం చూపించి బెస్ట్ వర్క్ ఇచ్చాడు మది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ బాగుంది.

పరశురాం రాసుకున్న కథ ఆకట్టుకుంది కానీ కథనం కాస్త వీక్ అనిపించింది.  కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ క్లాప్స్ కొట్టించాయి.  మహేష్ టైమింగ్ పట్టుకొని కారెక్టర్ డిజైన్ చేసుకొని మెప్పించాడు పరశురాం. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

mahesh-keerthy-suresh-sarkaru-vaari-paata-11

జీ సినిమాలు సమీక్ష :

ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకూ ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ట్రయిలర్ వదిలి సినిమాలో ఉన్న సరుకు చూపించారో అక్కడి నుండి సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఫ్యాన్స్ తో పాటు అందరికీ పోకిరి, దూకుడు సినిమాలు గుర్తొచ్చాయి. మహేష్ కూడా ఈ సినిమా చేస్తున్నప్పుడు పోకిరి డేస్ గుర్తొచ్చాయని అన్నాడు. అయితే వాటికి ఈ సినిమాకు సంబంధం లేదని,  కాకపోతే సినిమా ‘పోకిరి’ మీటర్ లో ఉంటుందని, లవ్ ట్రాక్ ‘దూకుడు’ ని గుర్తుచేస్తుందని రిలీజ్ కి ముందే టీం క్లారిటీ ఇచ్చారు.

దర్శకుడు పరశురాంకి మహేష్ లాంటి స్టార్ దొరకడంతో ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీన్స్ డిజైన్ చేసుకున్నాడు.  ‘ఎక్కడబడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మ.. చూసుకోవాలి’ అనే డైలాగ్ కూడా పెట్టి ఫ్యాన్స్ తో విజిల్ వేయించాడు. మహేష్ లుక్ అండ్ టైమింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఇలా ఫ్యాన్స్ మహేష్ నుండి ఏం కోరుకుంటారో అవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. అలాగే ఓ మంచి స్టోరీ లైన్ కూడా తీసుకున్నాడు

కానీ మెస్మరైజ్ చేసే స్క్రీన్ ప్లే, బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో మాత్రం అక్కడక్కడ విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో మహేష్ కేరెక్టర్ అతని బిహేవియర్, ఇంట్రో ఫైట్, మహేష్ కీర్తి లవ్ ట్రాక్, రెండు సాంగ్స్  తో ఎంటర్టైన్ చేశాడు పరశురాం. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కంప్లైంట్స్ లేకుండానే నడిపించేశాడు.  కానీ సెకండాఫ్ కు వచ్చే సరికి దర్శకుడిగా మెస్మరైజ్ చేయలేకపోయాడు. మహేష్ ని కొత్త లుక్ లో చూపించి అందులో ఎక్కువ మార్కులు సొంతం చేసుకున్నాడు పరశురాం.

సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని దానికి మంచి కథనం అళ్లడంలో పరశురాం దిట్ట.  బలమైన మాటలతో సన్నివేశాలను బాగా డిజైన్ చేసుకుంటాడు. ‘సర్కారు వారి పాట’ కి పరశురాం ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. కానీ దానికి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మాత్రం సగం మార్కులే స్కోర్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. సినిమా సీరియస్ గా నడిచే సందర్భంలో సడెన్ గా హీరో -కీర్తి సురేష్ సీన్స్ పెట్టి నవ్వించే ప్రయత్నం చేయడం సెట్ అవ్వలేదు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. బ్యాంకులు, రుణాలు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చేసిన పరశురాం మహేష్ తో చిన్నపాటి సందేశం చెప్పించాడు. హీరో కారెక్టర్ ద్వారా రుణాలు ఎగ్గొట్టే వారికి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ రోజుల్లో అందరికీ లోన్స్ , ఈఎంఐ లు కామన్ అయిపోయాయి. దీన్ని బేస్ చేసుకొని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సీన్స్ రాసుకున్నాడు పరశురాం. ఆ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ తర్వాత హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ ఇంకా బాగా రాసుకుని ఉంటే బెటర్ గా ఉండేది.

ఈ కథతో రాజకీయవేత్తలు, పారిశ్రామిక వేత్తలు రుణాలు ఎగ్గొడితే ఆ భారం సామాన్యుల పై ఎలా పడుతుందో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.  బ్యాంకుల నుండి ఋణం తీసుకొని కట్టలేక ఆత్మ హత్యలు చేసుకునే సామాన్యుల వేదనని వారి భావోద్వేగాలను స్క్రీన్ పైకి తీసుకురావడంలో మాత్రం పరశురాం తడబడ్డాడు. తను నమ్మిన కథని పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దడంలో పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయాడు.

సినిమాను నిలబెట్టడానికి మహేష్ బాబు కష్టపడ్డాడు. ఈ సినిమాతో మరోసారి వన్ మెన్ షో అనే ట్యాగ్ అందుకున్నాడు సూపర్ స్టార్.  సినిమాలో మహేష్-కీర్తి ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి కానీ రెండో భాగంలో వచ్చే సీన్స్ మాత్రం కాస్త ఇబ్బంది పెడతాయి.

ఓవరాల్ గా మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, కీర్తి సురేష్, ‘కళావతి’, ‘మమ మహేశా’  సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్,  సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. వీటి కోసం  సోషల్ డ్రామాగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మూవీని ఓసారి చూడొచ్చు.

రేటింగ్ : 2.75/5