Movie Review - మసూద

Friday,November 18,2022 - 02:40 by Z_CLU

నటీ నటులు :  తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్,  బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు.

కెమెరా: నగేష్ బానెల్

సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి

ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు

నిర్మాణం : స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా

రచన- దర్శకత్వం: సాయికిరణ్

విడుదల తేది : 18 నవంబర్ 2022

సెన్సార్ : A

రన్ టైం : 160 నిమిషాలు

టీజర్ , ట్రైలర్ తో హారర్ మూవీ లవర్స్ ఎట్రాక్ట్ చేసిన ‘మసూద’ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సంగీత , తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? ఉత్తమ అభిరుచి గల స్వధర్మ్ ఎంటర్టైన్ బేనర్ హ్యాట్రిక్ హిట్ స్కోర్ చేసిందా ? జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.


కథ : 

భర్తకు దూరంగా కూతురుతో కలిసి ఉంటూ టీచర్ ఉద్యోగం చేసే నీలం (సంగీత) కి అనుకోకుండా కూతురు రూపంలో ఓ సమస్య వస్తుంది. తన కూతురు నజియా (భాంధవి శ్రీధర్) కి దెయ్యం పట్టిందని గ్రహించి ఇంట్లో వ్యక్తిగా ఉండే పక్కింటి అబ్బాయి గోపి (తిరువీర్) సహాయం కోరుతుంది నీలం.

సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ సాఫ్ట్ గా ఉండే గోపి నజియాకి దెయ్యం వదిలించేందుకు  ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరికి ఒక పీర్ బాబా (సుభలేఖ సుధాకర్) దగ్గరికి చేరుకుంటాడు. నజియా విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో ఆమెను మసూద అనే ఆత్మ ఆవహించిందని తెలుసుకుంటారు. అసలు మసూద ఎవరు ? ఆమె ఆత్మ నజియా ను ఎందుకు ఆవహించింది ? చివరికి ఆత్మను ఎలా వదిలించారు?  అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీ నటుల పనితీరు :

సంగీత , తిరు వీర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తిరువీర్ కి మంచి పాత్ర దక్కడంతో తన నటనతో మెప్పించి సినిమకు హైలైట్ గా నిలిచాడు. నీలం పాత్రలో సంగీత ఒదిగిపోయి నటించింది. కూతురుని కాపాడుకునే తల్లిగా ఆకట్టుకుంది.  కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా పరవాలేదనిపించుకుంది.  నజియా పాత్రలో బాంధవి శ్రీధర్ అద్భుతంగా నటించింది. తనకి మరిన్ని మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది. బాబాగా సుభలేఖ సుధాకర్ తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు.  సత్య కృష్ణ , సూర్య రావు తదితరులు మంచి నటన కనబరిచారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

హారర్ థ్రిల్లర్ సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ పర్ఫెక్ట్ గా అందితే ఆడియన్స్ ను థ్రిల్ చేయొచ్చని ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ నిరూపించారు. ఈ సినిమాకు నగేష్ బానెల్ విజువల్స్ తో ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.  సౌండ్ డిజైనింగ్ బాగుంది. అలాగే క్రాంతి ప్రియం ఆర్ట్ వర్క్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పరవాలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను అలాగే సెకండాఫ్ లో ఇంకొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.  రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా కంపోజ్ చేసిన  హారర్ యాక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

సాయి కిరణ్ కథ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే బాగుంది. సెకండాఫ్ ను గ్రిప్పింగ్ గా చూపించి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు సాయి కిరణ్. స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

హారర్ సినిమాకు కథా బలంతో పాటు థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉండాలి.  కథను నడిపించే చక్కని పాత్రలు , వాటిలో ఒదిగిపోయే నటీ నటులు కూడా ముఖ్యం. అలాగే టెక్నీషియన్స్ నుండి బెస్ట్ సపోర్ట్ ఉండాలి.  ఇవన్నీ కుదిరితే హారర్ సినిమాతో మెప్పించడం సులువే. అందుకే దర్శకుడు సాయి కిరణ్ ఈ జానర్ ఎంచుకున్నాడు కావొచ్చు. కొన్నేళ్లుగా హారర్ కామెడీ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో ‘అరుంధతి’  తర్వాత ఆ స్థాయిలో సీరియస్ హారర్ సినిమా రాలేదనే చెప్పాలి. అందుకే తన మొదటి సినిమాకు ‘మసూద’ అనే సీరియస్ హారర్ థ్రిల్లర్  కథ రాసుకున్నాడు సాయి కిరణ్.

ఫస్ట్ హాఫ్ అంతా కేరెక్టర్స్ వాటి బిహేవియర్ గురించి సన్నివేశాలు ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. అలాగే తిరు వీర్ – కావ్య కళ్యాణ్ రామ్ లవ్ ట్రాక్ ఎస్టాబిలిష్ చేస్తూ వచ్చాడు. నజియాలో మసూద ఆత్మ చేరే వరకూ సినిమా నత్త నడకన సాగుతూ కాస్త బోర్ కొట్టిస్తుంది కానీ నీలం కూతురులో ఆత్మ ఆవహించిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడి నుండి చాలా హారర్ సినిమాల్లాగే ప్రాబ్లం కి సొల్యుషన్ కోసం వెతికే సన్నివేశాలు వస్తాయి. అవి రొటీన్ అయినప్పటికీ బోర్ కొట్టకుండా సాగాయి. దెయ్యం వదిలించే బాబా పాత్రను రొటీన్ కి భిన్నంగా చూపించేందుకు ప్రయతించాడు దర్శకుడు. ఆ పాత్రకు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ను తీసుకోవడం ప్లస్ అయ్యింది. అలాగే కథలో ప్రధానమైన పాత్రలకు సంగీత , తిరువీర్ ను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది.

మసూద ఎవరో తెలుసుకునేందుకు గోపి పాత్ర చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు తాలూకు సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే మసూద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కాకపోతే ఆ ఎపిసోడ్ కాస్త స్పీడ్ గా సాగడంతో  కన్ఫ్యూజ్ చేసేలా ఉంది. ఆ ఎపిసోడ్ కి ఎడిటర్ తన కత్తెరకు పదును పెట్టి స్పీడుగా లాగించే ప్రయత్నం చేశాడు. సాయి కిరణ్ కి  హారర్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా ఈ సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా ప్రీ  క్లైమాక్స్ , క్లైమాక్స్ ఎపిసోడ్స్ ను బాగా డైరెక్ట్ చేశాడు. క్లైమాక్స్ కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపించినప్పటికీ మెప్పిస్తుంది. అలాగే కథా బలం ఉన్న ఉత్తమ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్ ని మరో సారి మెచ్చుకోవాలి.

కేరెక్టర్స్ , పెర్ఫార్మెన్స్ , మ్యూజిక్ , కెమెరా వర్క్ , ఇంటర్వెల్ బ్లాక్ , ప్రీ క్లైమాక్స్ -క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో స్లో సాగే సాగే సన్నివేశాలు , ఎక్కవ లెంగ్త్ మైనస్ పాయింట్స్.

ఓవరాల్ గా మసూద ఈ మధ్య కాలంలో ఓ మంచి హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్ : 2.755