Movie Review - బట్టల రామస్వామి బయోపిక్కు

Friday,May 14,2021 - 02:14 by Z_CLU

నటీనటులు – అల్తాఫ్ హాసన్, శాంతిరావు, సాత్విక, లావణ్య రెడ్డి, భద్రం తదితరులు
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
సమర్పణ – మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు – సతీశ్ కుమార్, రామకృష్ణ వీరపనేని
కథ – రామ్ నారాయణ్, వాసుదేవ మూర్తి
డైలాగ్స్, లిరిక్స్ – వాసుదేవ్ మూర్తి
డీవోపీ – పీఎస్కే మణి
ఎడిటింగ్ – సాగర్
స్క్రీన్ ప్లే, మ్యూజిక్, దర్శకత్వం – రామ్ నారాయణ్
సెన్సార్ – U/A
రన్ టైమ్ – 2 గంటల 16 నిమిషాలు
రిలీజ్ డేట్ – మే 14, 2021
వేదిక – జీ5

కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చింది బట్టల రామస్వామి బయోపిక్. ట్రయిలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా, ఈరోజు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది? రామస్వామి కథేంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Battala Ramaswamy Biopikku zeecinemalu 2

కథ

పుట్టడంతోనే కృష్ణుడి పోలికలతో పుడతాడు రామస్వామి. కానీ అతడికి రాముడు మంచి బాలుడు అనే టైపులో ఉండాలని కోరిక. చిన్నప్పట్నుంచి రామస్వామికి చీరలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చీరల వ్యాపారం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే జయప్రదను చూసి ఇష్టపడతాడు. అమె సహాయంతో చీరల వ్యాపారం కూడా ప్రారంభిస్తాడు. అయితే అనుకోని విధంగా జయప్రద చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మరో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇలా 3 పెళ్లిళ్లు చేసుకున్న రామస్వామి.. ఒకే ఇంట్లో ముగ్గురితో కలిసి ఎలా కాపురం చేశాడు, అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు

రామస్వామి పాత్ర పోషించిన అల్తాఫ్ హసన్ సరిగ్గా సరిపోయాడు. మిడిల్ క్లాస్ వ్యక్తిగా అతడి లుక్, గెటప్ సరిపోయింది. మరీ ముఖ్యంగా తన చూపులతోనే సగం నటించేసి సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఇక రామస్వామి మొదటి భార్యగా నటించిన శాంతిరావు.. మిగతా ఇద్దరు భార్యలుగా సాత్విక, లావణ్య రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో స్నేహితుడిగా భద్రంకు మంచి పాత్ర పడింది. ఇతర నటీనటులంతా తమ పాత్రల మేరకు పెర్ ఫెక్ట్ గా నటించారు. ఇంటి ముందు కూర్చొని రోడ్డున పోయే ప్రతి ఒక్కర్ని పలకరిస్తూ ”అట్టానా” అంటూ కామెడీ పండించే పెద్దావిడ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిందే.

టెక్నీషియన్స్ పనితీరు

ముందుగా దర్శకుడు రామ్ నారాయణ్ గురించే చెప్పుకోవాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, సంగీతం విభాగాల్ని కూడా ఇతడే చూసుకున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వం బాగుంది. పల్లె వాతావరణం, ఆ నేటివిటీని తీసుకురావడంతో ఇతడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ తగ్గకుండా వాసుదేవ్ మూర్తితో కలిసి స్టోరీ రాసుకున్న విధానం బాగుంది. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా కూడా బాగానే మెరిశాడు రామ్ నారాయణ్. అందానికే అందానివే అనే పాట వినసొంపుగా ఉంది. కథ, సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ కథకు తగ్గట్టు కుదిరాయి. కథపై పూర్తి నమ్మకంతో దిగిన నిర్మాతలు ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా మెప్పించవు. పల్లె వాతావరణంలో తీసినప్పటికీ ఇంకాస్త రిచ్ గా సినిమా తీసి ఉండొచ్చు.

battala ramaswamy biopikku telugu review zeecinemalu 1

జీ సినిమాలు రివ్యూ

ఒకప్పట్లా పెద్ద హీరో దొరికాడా లేదా… మంచి టెక్నికల్ సపోర్ట్ ఉందా లేదా అని చూసే రోజులు పోయాయి. ఇప్పుడు కావాల్సింది ఒకే ఒక్కటి. చేతిలో మంచి కంటెంట్ ఉందా లేదా? ఇది ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు ZEE5లో ఎక్స్ క్లూజివ్ గా రిలీజైన బట్టల రామస్వామి బయోపిక్కు అనే సినిమా ఇలాంటిదే. ఇందులో నటీనటులెవ్వరు అనే ఆరాలు అనవసరం. డైరక్టర్ ఇంతకుముందు ఏం తీశాడు అనే లెక్కలు
అక్కర్లేదు. జస్ట్ సినిమా స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే కనెక్ట్ అయిపోతాం. చివరివరకు విడిచిపెట్టం. బట్టల రామస్వామి బయోపిక్కు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకుమించిన ఎనాలసిస్ అక్కర్లేదు.

ఓ సాధారణ వ్యక్తి జీవితంలో ఇన్ని ట్విస్టులు ఉంటాయా..? దిగువ మధ్యతరగతి వ్యక్తికి కూడా బయోపిక్ ఉంటుందా? ఇవి సినిమాలో డైలాగులే. శుభం కార్డు పడిన తర్వాత మనకు కూడా ఇలానే అనిపిస్తుంది. భలేగా తీశారే అనే ఆశ్చర్యం కలుగుతుంది. సరిగ్గా ఇక్కడే రామస్వామి సక్సెస్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ఆఖర్లో చిన్న తృప్తిని
మిగులుస్తుంది.

రొమాంటిక్ కామెడీలు చాలానే వచ్చాయి. కానీ అన్నీ సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నవే. హీరోను ఉమెనైజర్ గా చూపించినవే. కొన్ని సినిమాల్లో ఏమీ లేకపోయినా వాటికి రొమాంటిక్ కామెడీ అనే ట్యాగ్ లైన్ తగిలించి మార్కెట్ చేసిన సందర్భాలు చూశాం. కానీ అసలుసిసలు రొమాంటిక్ కామెడీ అంటే ఎలా ఉంటుందో బట్టల రామస్వామి బయోపిక్ చూస్తే అర్థమౌతుంది. ఇందులో రొమాన్స్ ఉంది కానీ కళ్లకు కనిపించదు. కామెడీ కూడా ఉంది, కానీ కావాలని పెట్టినట్టు అనిపించదు. అదే ఈ సినిమాలో గ”మ్మత్తు”.

చిన్న స్కూటీపై ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునే రామస్వామి జీవితాన్ని పుట్టుక నుంచి కళ్లకుకట్టి చూపించింది ఈ సినిమా. శవంతోనే సినిమా స్టార్ట్ చేసి, అదే శవం చుట్టూ కామెడీ పండించిన దర్శకుడి చమత్కారాన్ని, అతడి స్క్రీన్ ప్లే టెక్నిక్ ను మెచ్చుకోకుండా ఉండలేం. రాముడిలా సింగిల్ వైఫ్ తో సెటిల్ అవ్వాలనుకున్న రామస్వామి, కృష్ణుడి టైపులో ముగ్గురు భార్యలను ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఎంత సరదాగా చూపించాలో అంతే సరదాగా, సరసంగా చూపించాడు డైరక్టర్.

బూతు అనిపించే విషయాల్ని కూడా కామెడీలో కలిపేసి, డైలాగ్స్ తో మాయచేశాడు. ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా ఇలాంటి సినిమాను తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. రామస్వామికే కాకుండా.. ప్రతి భార్యకు ఓ బ్యాక్ డ్రాప్ ఇచ్చి అందర్నీ కథలోకి తీసుకొచ్చిన విధానం బాగుంది. మరీ ముఖ్యంగా మూడో భార్యను రామస్వామి కట్టుకున్న విధానం, ఆ పెళ్లి తంతు, శోభనం ముచ్చట్లు లాంటి సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.

కరోనా న్యూస్ చూస్తూ, కరోనా కష్టాలు వింటూ, బుర్రలో కరోనా భయాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న ఈ రోజుల్లో కాస్త రిలీఫ్ అందిస్తాడు మన రామస్వామి.

బాటమ్ లైన్ – రామస్వామి రొమాన్స్
రేటింగ్ – 2.75/5

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics