Movie Review – Thalaivii

Friday,September 10,2021 - 11:36 by Z_CLU

నటీనటులు : కంగనా రనౌత్ , అరవింద్ స్వామీ, భాగ్య శ్రీ , నాజర్ , సముద్రఖని, మధు బాల, పూర్ణ , రెజినా తదితరులు

సినిమాటోగ్రఫీ : విశాల్ విట్టల్

సంగీతం : GV ప్రకాష్ కుమార్

రచన : విజయేంద్ర ప్రసాద్

సమర్పణ : జీ స్టూడియోస్

నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్

దర్శకత్వం : విజయ్

నిడివి : 152 నిమిషాలు

విడుదల తేది : 10 సెప్టెంబర్ 2021

నటి, మాజీ ముఖ్య మంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన 'తలైవి' వినాయక చవితి సందర్భంగా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కంగనా జయలలితగా మెప్పించిందా? ఈ సినిమా జయలలితకు ఘన నివాళి గా నిలిచిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

Kangana Ranaut Thalaivi stills zeecinemalu కథ :

మైసూర్ నుండి చెన్నై వచ్చి అమ్మ కోరిక మేరకు సినిమాల్లో హీరోయిన్ గా నటించే జయ( కంగనా రనౌత్) తక్కువ టైంలోనే అగ్ర హీరోగా వెలుగుతున్న MJ రామచంద్రన్ (అరవింద్ స్వామి) కి వరుస సినిమాలతో దగ్గరవుతుంది. కలిసి ఎక్కువ సినిమాలు చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఒక వైపు హీరోగా ఉంటూనే మరో వైపు రాజకీయనాయకుడిగా ఎదుగుతున్న MJR కొన్ని కారణాల దృష్ట్యా జయకి కొంత దూరమవుతాడు.

ఈ లోపు తమిళ రాజకీయాల్లో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. ఊహించని పరిస్థితుల వల్ల MJR కొత్త పార్టీ పెట్టి ముఖ్య మంత్రిగా ఎన్నికవుతాడు. అదే సమయంలో జయని రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తాడు. సినిమా తప్ప రాజకీయాలు వద్దనుకొనే జయ చివరికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాయకురాలిగా ఎలాంటి ప్రయాణం సాగించింది.. చివరికి ముఖ్య మంత్రి స్థాయికి ఎలా చేరుకుంది... అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

జయ పాత్రలో కంగనా బాగా నటించింది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో జయని తలపించేలా కనిపించి ఆకట్టుకుంది. బయోపిక్ లో ఆ వ్యక్తిలా కనిపించడమే పెద్ద టాస్క్ ఆ టాస్క్ లో కంగనా మంచి మార్కులు అందుకొని అక్కడే సగం సక్సెస్ అయింది. మిగతా సగం నటనతో మెప్పించింది. అరవింద్ స్వామి కూడా తన గెటప్ తో MJR ని గుర్తుచేశాడు. ఆ పాత్రలో ఒదిగిపోయి నటించి సినిమాకు ప్లస్ అయ్యాడు. కరుణా పాత్రలో నాజర్ , RNV పాత్రలో సముద్రఖని , జానకమ్మ పాత్రలో మధు బాల మంచి నటన కనబరిచి ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. భాగ్య శ్రీ పూర్ణ , రెజినా కొన్ని సన్నివేశాలకే పరిమితమై పరవాలేదనిపించుకున్నారు. భరత్ రెడ్డి , మిగతా నటీ నటులు ఆయా పాత్రలకు న్యాయం చేసి సినిమాలో పార్ట్ అయ్యారు.

సాంకేతిక వర్గం పనితీరు :

GV ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినేలా లేవు కానీ పరవాలేదనిపిస్తాయి. విశాల్ విట్టల్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. రామకృష్ణ సబ్బాని , మోనికా నిగోత్రే ఆర్ట్ వర్క్ ఒకప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేసి సన్నివేశాలకు అందాన్నిచ్చాయి. పాత్రలకు కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ముఖ్యంగా కంగనాకి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఎట్రాక్ట్ చేశాయి. నటీ నటులను పాత్రలకు తగ్గట్టు చూపించే విషయంలో మేకప్ మెన్ కష్టం కూడా కనిపిస్తుంది. కంగనాని జయగా చూపించడంలో మేకప్ మెన్ సక్సెస్ అయ్యాడు.

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. దర్శకుడు విజయ్ ఈ బయోపిక్ ని బాగానే హ్యాండిల్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మిగతా టెక్నీషియన్స్ వారి విభాగాల్లో మంచి అవుట్ పుట్ అందించారు.

Kangana Ranaut Thalaivi stills zeecinemalu జీ సినిమాలు సమీక్ష :

జనాల గుండెల్లో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిన వ్యక్తి తాలూకు కథతో బయోపిక్ సినిమా తీయడం అంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న ప్రయత్నమనే చెప్పాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మంచి నివాళి అని కాకుండా అనవసరంగా తీశారు అనే ఫీడ్ బ్యాక్ అందుకొక తప్పదు. అలాగే బయోపిక్ అంటే అందులో డ్రామా క్రియేట్ చేసే స్టఫ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అలాంటి డ్రామా ఉన్న జయలలిత కథను తీసుకోవడం , ఆమె కథతో బయోపిక్ సినిమా తీయడమనే ఛాలెంజ్ తీసుకొని ఫైనల్ అవుట్ పుట్ తో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు.

ముఖ్యంగా జయలలిత గారి కథను ఎక్కడి నుండి ఎక్కడి వరకు చూపించాలనేది క్లియర్ కట్ గా ఫిక్స్ చేసుకొని అంత వరకే చూపించి ఆమె జీవితాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించాడు దర్శకుడు విజయ్. 1967 నుండి 1991 వరకూ నటి నుండి ముఖ్యమంత్రిగా ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించారు. విజయేంద్ర ప్రసాద్ గారి కథ -కథనం సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దర్శకుడు విజయ్ కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విధానం ఆకట్టుకొని అలరిస్తుంది. కీలక పాత్ర రైటర్ విజయేంద్ర ప్రసాద్ కే దక్కుతుంది.

జయ నటిగా ఎలా మారింది? ఆమె సినిమా వైపుకి ఎలా వచ్చింది? అనేది డిటైల్ గా చూపించకుండా కేవలం డైలాగ్స్ తో సరిపెట్టేశారు. బహుశా అదంతా ఎక్స్ ట్రా కంటెంట్ అనుకున్నారు కావొచ్చు. అలాగే నటిగా ఆమె అందుకున్న ఆఫర్స్, స్టార్డం కూడా కాస్త పై పైనే చూపించారు. మొదటి భాగంలో ఆమె సినిమా కెరీర్, MJR తో ప్రేమాయణం చూపించి రెండో భాగంలో కంప్లీట్ గా ఆమె రాజకీయ జీవితాన్ని చూపించి సినిమాను ఆకట్టుకునేలా మలిచారు.

మొదటి భాగంలో అక్కడక్కడా కాస్త స్లోగా సాగుతూ డ్రాగ్ అనిపించినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక రెండో భాగంలో వచ్చే తమిళ రాజకీయాలు అందులో MJR , జయ ఎలాంటి కీ రోల్స్ పోషించారనేది కళ్ళకు కట్టిన్నట్టుగా చూపించాడు దర్శకుడు విజయ్. ముఖ్యంగా ఒకప్పటి రాజకీయ విషయాలు మళ్ళీ ఈ సన్నివేశాల ద్వారా తమిళులకి మళ్ళీ గుర్తుచేసి అప్పటి రోజులను గుర్తుచేశాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు కోలీవుడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే జయ నుండి మొదటి సారి అమ్మ అని పిలిచే సన్నివేశాలు ఆమె డిల్లీ పార్లిమెంట్ లో ఇందిరా గాంధి నిలదీసి మాట్లాడే సన్నివేశం ఆ తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక రాజకీయంలో జయమ్మ ఎదుర్కున్న ఆటు పోట్లను, ఇబ్బందులు, అవమానాలను కూడా చూపిస్తూ ఆమె ఎంత గొప్ప పోరాటం చేసి నిలబడింది అనేది అంతే గొప్పగా చూపించాడు విజయ్. ఆ సన్నివేశాలు జయలలితా అభిమానులకు పార్టీలో పనిచేసిన వ్యక్తులకు విపరీతంగా కనెక్ట్ అయి ఆమె లేని లోటుని గుర్తుచేస్తాయి. ఆమె ముఖ్యమంత్రిగా విజయం అందుకున్నాక పార్టీలో పనిచేసే మగ వారిని చూసి ప్రేక్షకులు క్లాప్స్ కోట్లా ఉంది.

కంగనా, అరవింద్ స్వామి నటన, కథ-కథనం, ఆర్ట్ వర్క్, నేపథ్యసంగీతం, సన్నివేశాలు, అక్కడక్కడ సందర్భానుసారంగా వచ్చే  మాటలు సినిమాకు హైలైట్స్ కాగా మొదటి భాగంలో డ్రాగ్ అనిపించే కొన్ని సన్నివేశాలు అలాగే కొన్ని సందర్భాల్లో సినిమా స్లోగా సాగడం మైనస్ అనిపిస్తాయి. అవి మినహాయిస్తే సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఫైనల్ గా 'తలైవి' ద్వారా జయలలితకు ఘననివాళి అందింది.

రేటింగ్ : 3/ 5