Movie Review – Seetimaarr

Friday,September 10,2021 - 05:21 by Z_CLU

న‌టీన‌టులు: గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా తదితరులు

సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌

సంగీతం: మ‌ణిశ‌ర్మ‌

స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్

నిర్మాణం : శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్

నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి

కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది

నిడివి : 138 నిమిషాలు

విడుదల తేది : 10 సెప్టెంబర్ 2021

గోపీచంద్ తన కెరీర్ లో ఫస్ట్ టీం 'సీటిమార్' అంటూ ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ కొట్టి సీటి వేశాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

seetimaar gopichand కథ :

రాజమండ్రి సమీపంలో ఓ పల్లెటూరిలో ఉండే కార్తిక్(గోపీచంద్) స్పోర్ట్స్ కోటా ద్వారా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. మరో వైపు ఆ ఊళ్ళో ఉండే కొందరు అమ్మాయిలకు కబడ్డీ ట్రైనింగ్ ఇస్తూ కోచ్ గా ఉంటాడు. ఈ క్రమంలో ఊరిలో ఉన్న స్కూల్ ని దక్కించుకోవడానికి కొందరు చూస్తుంటారు. ఆ స్కూల్ ని కాపాడుకోవడం కోసం నేషనల్ కబడ్డీ పోటీలో తన టీంని నిలిపి అక్కడ కప్ కొట్టి మళ్ళీ స్కూల్ ని తిరిగి తెచ్చుకునే క్రమంలో తన టీంను తీసుకొని డిల్లీకి బయలుదేరతాడు కార్తిక్.

అలా కబడ్డీ నేషనల్ కప్ కోసం వెళ్ళిన కార్తీక్ కి అనుకోకుండా ఓ సమస్య ఎదురవుతుంది. ఘజియాబాద్ కి చెందిన మక్కాన్ సింగ్(తరుణ్ అరోరా) కార్తీక్ టీం ని కిడ్నాప్ చేసి అతనికి ఓ టాస్క్ పెడతాడు. తనని నమ్ముకొని వచ్చిన అమ్మాయిలను కాపాడలేని స్థితిలో ఉండే కార్తీక్ చివరికి తెలంగాణా కబడ్డీ టీం కోచ్ జ్వాలా రెడ్డి (తమన్నా) సహాయంతో తన టీంని మక్కాన్ మనుషుల నుండి విడిపిస్తాడు. ఫైనల్ గా కార్తీక్ టీం ఫైనల్స్ కి అటెండ్ అయి కప్ కొట్టి స్కూల్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారా లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

కబడ్డీ కోచ్కార్తీక్ గా గోపీచంద్ ఆకట్టుకున్నాడు. మ్యచో ఇమేజ్ తో మరోసారి మాస్ ప్రేక్షకులను కూడా అలరించాడు. సినిమా మొత్తానికి తన నటనతో హైలైట్ గా నిలిచాడు గోపీచంద్. తెలంగాణా కబడ్డీ టీం కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో తమన్నా నటన అలరించింది. ముఖ్యంగా తెలంగాణా స్లాంగ్ లో తమన్నా చెప్పే డైలాగ్స్ థియేటర్స్ లో బాగానే పేలాయి. కానీ ఆ యాసని పర్ఫెక్ట్ పట్టుకోలేకపోయింది. దిగంగ‌న సూర్య‌వంశి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో ఆమె జస్ట్ పరవాలేదనిపించుకుంది. హీరో అక్క పాత్రలో భూమిక ఎప్పటిలానే మంచి నటన కనబరిచింది. IPS ఆఫీసర్ పాత్రకు రెహ్మాన్ పూర్తి న్యాయం చేసి సినిమాకు ప్లస్ అయ్యాడు. రావు రమేష్ కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితమైనప్పటికీ తన పంచ్ డైలాగ్స్ తో నవ్వించి మెప్పించాడు. కబడ్డీ టీం ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలందరూ బాగా నటించారు. ముఖ్యంగా శైలు పాత్రలో ప్రీతీ నటన బాగుంది. స్పెష‌ల్ సాంగ్‌లో అప్స‌ర రాణి అందాలతో కనువిందు చేసింది. పోసానీ మురళి కృష్ణ , నాగ మహేష్ , టి ఎన్నార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతంతో పాటు రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలకు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అలాగే జ్వాల రెడ్డి సాంగ్ థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. ఐటెం సాంగ్ విజువల్ గా ఎట్రాక్ట్ చేసింది. ఎస్. సౌందరాజన్ కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా రాజమండ్రి లోకేషన్స్ ని మరింత అందంగా చూపించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సంపత్ నంది రాసుకున్న కథ -కథనం రొటీన్ అయినప్పటికీ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

seetimaar gopichand tamanna జీ సినిమాలు సమీక్ష :

గోపీచంద్ , తమన్నా లను కబడ్డీ కోచ్ గా చూపిస్తూ సంపత్ నంది 'సీటిమార్' అనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా తీస్తున్నాడనగానే అందరి చూపు ఈ సినిమాపై పడింది. అయితే సినిమాను కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించానని ట్రైలర్ తో క్లియర్ కట్ చెప్పాడు సంపత్ నంది. మొదటి భాగమంతా స్పోర్ట్స్ డ్రామాగా నడిపిస్తూ రెండో భాగంలో యాక్షన్ సీన్స్ , మాస్ డ్యూయెట్ సాంగ్ , ఐటెం సాంగ్ ఇలా కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించాడు.

గోపీచంద్ ని ఇప్పటి వరకూ చూడని కబడ్డీ కోచ్ గా చూపిస్తూ ఆ పాత్రతో మెప్పించాడు దర్శకుడు. కాకపోతే కార్తిక్ ఎందుకు కబడ్డీ కోచ్ గా మారాడు ? అతనికి ఆ గేమ్ ఎలా అబ్బింది ? అనే డీటెయిలింగ్ మిస్ అయ్యాడు. అలాగే కొన్ని లాజిక్స్ కూడా వదిలేసి కమర్షియల్ సినిమా ఫార్మేట్ ని ఫాలో అయిపోయాడు. ఒక ఊరు , అక్కడ స్కూల్ సమస్య , కబడ్డీ గేమ్ , ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు సంపత్ నంది.

మొదటి భాగంలో వచ్చే రావు రమేష్ తాలూకు సన్నివేశాలు , అన్నపూర్ణ -ప్రగతి గ్యాంగుతో కామెడీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తాయి. ఇక రెండో భాగంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని వారిని సంతృప్తి పరుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ చేత సీటీ కొట్టిస్తుంది. కానీ ఆ ఎపిసోడ్ 'సాహో','వినయ విధేయ రామ' సినిమాలను గుర్తుచేసింది.

స్పోర్ట్స్ డ్రామా ను కమర్షియల్ మీటర్ లో చెప్పడం కాస్త చాలెంజింగ్ అనే చెప్పాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా డమాల్ అవుతుంది. ఈ ఛాలెంజ్ లో దర్శకుడు సంపత్ నంది కొంత వరకు సక్సెస్ అయ్యాడు కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇక కబడ్డీ గేమ్ ని కేవలం క్లైమాక్స్ కోసమే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఆ గేమ్ తాలూకు సినిమాగా అనిపించదు. కబడ్డీ ని కేవలం ఒక సెటప్ కోసం మాత్రమే వాడుకున్నాడు దర్శకుడు. గోపీచంద్ నటన , తమన్నా క్యారెక్టర్ , రావు రమేష్ పంచ్ కామెడీ , ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రాక్ , జ్వాలా రెడ్డి సాంగ్ , ఫైట్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ఫైనల్ గా స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'సీటిమార్' నిరాశ పరచదు... మోస్తరుగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.75/5