Movie Review – Happy Birthday

Friday,July 08,2022 - 02:51 by Z_CLU

నటీ నటులు : లావణ్య త్రిపాఠి , నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు

సంగీతం: కాలభైరవ

డిఓపీ: సురేష్ సారంగం

సమర్పణ :  నవీన్ యర్నేని  , రవి శంకర్ ( మైత్రి మూవీ మేకర్స్)

నిర్మాణం : క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్

నిర్మాత : చిరంజీవి (చెర్రి), హేమలత

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : రితేష్ రానా

విడుదల తేది : 8 జులై 2022

నిడివి : 154 నిమిషాలు

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ బర్త్ డే' ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రిలీజ్ కి ముందు రాజమౌళి సినిమాను ప్రమోట్ చేయడం, హీరో ఎవరు అంటూ కమెడియన్స్ తో ఫన్నీ ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాపై ఓ మోస్తారు బజ్ క్రియేట్ అయింది. మరి రితేష్ రానా తన రెండో సినిమాతో మెప్పించాడా ? లావణ్య త్రిపాఠికి హిట్ దక్కిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

LavanyaTripati-HappyBirthday-Teaser-out-zeecinemalu

కథ :

పసుపులేటి హ్యాపీ (లావణ్య త్రిపాఠి) తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్ ఏర్పాటు చేసిన పార్టీ కోసం రిట్జ్ గ్రాండ్ హోటల్ కి వెళ్తుంది. అక్కడ పార్టీ బోర్ కొట్టడంతో పక్కనే ఉన్న పాష్ పబ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటుంది. అలా ఎంజాయ్ కోసం అదే హోటల్ పబ్ కి వెళ్ళిన హ్యాపీ ని బేరార్ కిడ్నాప్ చేయాలని చూస్తాడు.

మరో వైపు గన్ లైసెన్స్‌లు లీగలైజ్ చేసిన రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) కూడా ఆ హోటల్‌కు వస్తాడు. మరో వైపు తనకి ఇచ్చిన ఓ డీల్ కోసం ఆ హోటల్ లో అడుగుపెడతాడు మ్యాక్స్ (సత్య). అదే హోటల్ లో పనిచేసే లక్కీ (నరేష్ అగస్త్య)తనకి అప్పు ఇచ్చిన  వ్యక్తి(రాహుల్ రామకృష్ణ) చెప్పిన పని చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఒకరితో ఒకరికి సంబంధం లేని వీళ్ళు ఆ హోటల్ లో ఎలా కలుసుకున్నారు ? ఫైనల్ గా ఆ హోటల్ లో ఏం జరిగిందనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

లావణ్య త్రిపాఠి సరికొత్తగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేసింది. రెండు పాత్రల్లో మెప్పించింది, కానీ ఆమె క్యారెక్టర్స్ డిజైనింగ్ సరిగ్గా కుదరలేదు. నరేష్ అగస్త్య తన కేరెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు.  మినిస్టర్ పాత్రలో వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. ఎ టు జెడ్ సర్వీసెస్ అంటూ సత్య తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేశాడు. గుండు సుదర్శన్ కి ఇంపార్టెంట్ రోల్ దక్కడంతో బాగా నవ్వించాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తో వచ్చే సన్నివేశాల్లో బాగా నవ్వించాడు.  రాహుల్ రామకృష్ణ, వైవా హర్ష , విధ్యులేఖ రామన్ , గెటప్ శ్రీను రాఘవ రోహిణి తమ పాత్రలతో ఓ మోస్తారుగా ఎంటర్టైన్ చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

కాల భైరవ మ్యూజిక్ బాగుంది. సినిమాలో ఉన్న ఒకే ఒక్క సాంగ్ పరవాలేదనిపించింది. బ్యాక్ స్కోర్ కథకు తగ్గ్గట్టుగా అందించాడు. సారంగం సురేష్ కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో లైట్స్ తో కొన్ని విజువల్స్ చూస్తే అతని పనితనం కనిపించింది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పరవాలేదు. సెకండాఫ్ లో కాస్త ట్రిమ్ చేసి ఉండొచ్చు. రితేష్ రానా కథ -కథనం రొటీన్ గా ఉన్నాయి. డైరెక్షన్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో తన రైటింగ్ , టేకింగ్ తో హిలేరియస్ గా నవ్వించాడు. క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ స్టోరీకి తగ్గట్టుగా ఉన్నాయి.

Lavanya-tripathi-happy'birthday-movie-firstlook-zeecinemalu

జీ సినిమాలు సమీక్ష : 

సర్రియల్ యాక్షన్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు కొత్త. ఈ జోనర్ లో ఓ సినిమా చేసి నవ్వించడం ఛాలెంజింగే. రెండో సినిమాకు ఈ జోనర్ లో కొత్తగా ట్రై చేసినందుకు దర్శకుడు రితేష్ రానాని మెచ్చుకోవాలి. కాకపోతే ఈ సినిమా కోసం హోటల్ లో జరిగే రొటీన్ కామెడీ కథ తీసుకున్నాడు రితేష్. సత్య , వెన్నెల కిషోర్ కేరెక్టర్స్ తో దర్శకుడు హిలేరియస్ గా నవ్వించాడు. కాకపోతే రెండో భాగం నుండి ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూ సినిమాను ముందుకు నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా లైటర్ వే కామెడీతో సినిమా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ లో  'షాకయ్యరా ?' అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేశాడు.  సెకండాఫ్ లో లావణ్య త్రిపాఠి తో డ్యుయల్ రోల్ చేయించి కన్ఫ్యూజ్ చేశాడు. దాంతో అసలు వారిద్దరూ ఏం చేయానుకుంటున్నారో... ఎం చేస్తున్నారో... ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితి. నిజానికి లావణ్యతో డ్యుయల్ రోల్ చేయించడం , దాన్ని బలంగా రాసుకోకపోవడం సినిమాకు మైనస్. అలాగే గన్నులతో కొత్తగా కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. గెటప్ శ్రీను , రాఘవ లతో వచ్చే కామెడీ ట్రాక్ కూడా అనవసరం అనిపిస్తుంది. నరేష్ అగస్త్య కి వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ నుండి వీడియో కాల్ చేయడం ఓ సారి నవ్వించింది కానీ పదే పదే రిపీట్ అవ్వడంతో అది కూడా విసుగు తెప్పిస్తుంది.

వెన్నెల కిషోర్ ఇంట్రోతో వచ్చే ఇంటర్వ్యూ సీన్ , సత్య, వెన్నెల కిషోర్ ట్రాన్స్ లేషన్ సన్నివేశం , అలాగే  వెన్నెల కిషోర్ ని గుండు సుదర్శన్ ఇర్రిటేట్ సీన్ లాంటివి సినిమాలో హిలేరియస్ వర్కౌట్ అయ్యాయి. అలాగే దర్శకుడు అక్కడక్కడా వాడిన ట్రెండీ కామెడీ కూడా నవ్విస్తుంది. స్టిక్కర్స్, జిఫ్ లతో మంచి కామెడీ క్రియేట్ చేశాడు. సినిమా ఆరంభంలో లావణ్య త్రిపాఠి తో ఓ సాంగ్ పెట్టి దాని కింద 'నిర్మాతల కోరిక మేరకు ఈ పాటను చిత్రీకరించాం' అంటూ సరదాగా డిస్క్రిప్షణ్ లో పెట్టి అక్కడ కూడా నవ్వించాడు దర్శకుడు. కానీ కొన్ని నవ్వుల కోసం మిగతా సినిమా అంతా భరించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా రెండో భాగం బోర్ కొట్టిస్తూ సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా ? అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలను దర్శకుడు లాజిక్స్ లేకుండా తెరకెక్కించిన విధానం నవ్వు తెప్పిస్తుంది.

రితేష్ రానా తన మొదటి సినిమా 'మత్తు వదలరా' తో బాగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించి ధియేటర్ బయటికి పంపాడు. కానీ ఈసారి 'హ్యాపీ బర్త్ డే' తో కొంత వరకే  ఎంటర్టైన్ చేసి ఎక్కువ భాగం బోర్ కొట్టించాడు. కామెడీ ని ఎంజాయ్ చేసే వారు వెన్నెల కిషోర్ -సత్య కామెడీ కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.25 /5