జీ స్పెషల్: 'పెదరాయుడు' చరిత్రకు పాతికేళ్ళు

Monday,June 15,2020 - 11:08 by Z_CLU

బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమాల లిస్టు చూస్తే అందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయం అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఇదే రోజు (జూన్ 15) థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులచేత మంచి తీర్పు అందుకొని కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా గురించి ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

అప్పటికే అపజయలతో సతమవుతున్న మోహన్ బాబు తనకు నటుడిగా, నిర్మాతగా మంచి విజయం అందించే చిత్రం గురించి ఎదురుచూస్తున్న సమయంలో సరిగ్గా మిత్రుడు రజనీకాంత్ నుండి ఫోన్ వచ్చింది. తమిళ్ లో విజయం అందుకున్న ‘నాట్టామై’ సినిమా తెలుగులో తీస్తే మంచి విజయం అందుకుంటుందని, వెంటనే వచ్చి సినిమా చూడమని మోహన్ బాబుకి చెప్పారు రజని. వెంటనే సినిమా చూసి నచ్చడంతో ఆ విషయాన్ని రజనికి చెప్పి రైట్స్ గురించి మాట్లాడారు మోహన్ బాబు. నిర్మాత ఆర్.బి.చౌదరితో తాను మాట్లాడానని వెళ్లి ఒకసారి కలవమని మోహన్ బాబు కి చెప్పి పంపించారు రజని. సూపర్ స్టార్ చెప్పడంతో వెంటనే తెలుగు రైట్స్ ను మోహన్ బాబు చేతిలో పెట్టారు తమిళ నిర్మాత చౌదరి. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తీయాలని డిసైడ్ అయిపోయాడు మోహన్ బాబు. వెంటనే ఈ రీమేక్ బాధ్యతను దర్శకుడు రవిరాజా పినిశెట్టి చేతిలో పెట్టారు.

సినిమాలో పాపారాయుడు పాత్రకు మినహా అన్ని పాత్రలకు నటీనటుల ఎంపిక జరిగిపోయింది. ఆ పాత్రను నేను చేస్తా అంటూ గెటప్ తో సహా మోహన్ బాబుకి చెప్పి షాకిచ్చాడు రజని. అతిథి పాత్రను రజనీకాంత్ చేస్తానని చెప్పడంతో మోహన్ బాబు సంతోషానికి అవధుల్లేవ్. అదే విషయాన్ని దర్శకుడు రవిరాజా పినిశెట్టి తో పంచుకుంటే ఆయన కూడా షాక్ అయ్యాడు. అంతా ఓకే హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో సినిమా ఓపెనింగ్. సినిమా ప్రారంభోత్సవానికి చాలా మంది ప్రముఖులు హాజరై మోహన్ బాబుకి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఓపెనింగ్ కి ఎన్టీఆర్, నాగేశ్వరావు గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. రజనీకాంత్ మెడలో మోహన్ బాబు దండ వేసే మొదటి షాట్ కి నందమూరి తారక రామారావు గారు క్లాప్ ఇచ్చారు.

ఓ అద్భుతమైన సినిమాకు అన్ని వాటంతటవే కుదురుతాయన్నట్టుగా సినిమా షూటింగ్ ఎలాంటి అడ్డు లేకుండా నిర్విరామంగా జరిగింది. పెదరాయుడు, రాజా రెండు పాత్రల్లో మోహన్ బాబు అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. వెండితెరపై పెదరాయుడిగా కలెక్షన్ కింగ్ అదరగొట్టేసారంటూ సినిమా నుండి బయటికొచ్చిన జనాలు చెప్పుకున్నారు. ఇక సినిమాలో రజని చేసిన పాపారాయుడు పాత్ర తాలూకూ సన్నివేశాలకు థియేటర్ లో అరుపులే. “ఆపరా….” అంటూ సూపర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్ కి సీట్లో నుండి ఎగిరెగిరి మరీ కేకలు వేస్తూ మురిసిపోయారు అభిమానులు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత మోహన్ బాబు నుండి నటుడిగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు రజనీకాంత్. అంతే కాదు నిర్మాతగా ఇబ్బందుల్లో ఉన్న మోహన్ బాబుకి షూటింగ్ నిమిత్తం 45 లక్షలు అందించి సినిమా మంచి విజయం సాధించాక తిరిగివ్వమని చెప్పి సూటుకేసు చేతికిచ్చారు కూడా. సినిమా పెద్ద హిట్టయ్యాక మళ్లీ రజనీను కలిసి ఇచ్చిన డబ్బును తిరిగిచ్చి, అలాగే పారితోషికంగా వస్తురూపంలో ఓ పెద్ద బహుమతిని రజనీకి అందించారు మోహన్ బాబు.

పెదరాయుడు భార్యగా భానుప్రియ చక్కని నటన కనబరిస్తే రాజా భార్య పాత్రలో సౌందర్య అదరగొట్టేసింది. ముఖ్యంగా పెదరాయుడు గొప్పతనం తెలుసుకొనే సన్నివేశంతో పాటు తన భర్తతో పాటు తనను కూడా ఊరి నుండి వెలి వేసిన తరువాత వచ్చే సన్నివేశాలు, అలాగే శ్రీమంతం సన్నివేశంలో తన నటనతో మెప్పించింది సౌందర్య. ఇక బాబు మోహన్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కూడా సినిమాలో మంచి హాస్యాన్ని పండించి ప్రేక్షకులకు కితకితలు పెట్టి చక్కని వినోదాన్ని అందించింది. పాకీజాతో బ్రహ్మీ కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అయింది.

సినిమాకు కోటి స్వరపరిచిన సంగీతం కూడా ప్లస్ పాయింట్. “కదిలే కాలమా” పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా కంపోజ్ చేశాడు కోటి. ఏసుదాసు గాత్రం కూడా ఆ పాటకు ప్రాణం పోసింది.”బావవి నువ్వు భామను నేను”,
“అబ్బ దాని సోకు..” “కో అన్నదోయి..” “ఢమ ఢమ గుండె ఢమరుకం మోగే..” పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని పెదరాయుడు పాటల పరంగా కూడా సూపర్ హిట్ ఆల్బమ్ అనిపించుకుంది. అలాగే నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు కోటి. ముఖ్యంగా తీర్పు చెప్పడానికి పాపారాయుడు, పెదరాయుడు నడుచుకుంటూ వచ్చే సన్నివేశాలకు కోటి ఇచ్చిన ఆర్.ఆర్ ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుంటుంది. సినిమాటోగ్రాఫర్ ప్రకాష్ రావు , ఎడిటర్ గౌతమ్ రాజు కూడా విజయంలో మంచి పాత్ర పోషించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి గారు సినిమాకు అందించిన మాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. పాతికేళ్లయినా ‘పెదరాయుడు’ సినిమాలో భార్య భర్తల అనుబంధం గురించి మోహన్ బాబు చెప్పిన “ఫిష్ అండ్ ఫిషర్ మెన్” డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో చోట కనబడుతూంటుంది.

సరిగ్గా ‘పెదరాయుడు’ విడుదలైన రోజే చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజైన చిరు సినిమాకి మార్నింగ్ షో కే బ్యాడ్ టాక్ వచ్చింది. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘పెదరాయుడు’ మాత్రం రోజు రోజుకి ఊపందుకుంటూ రికార్డులు తిరగరాసి సంచలన విజయం అందుకొని చరిత్ర సృష్టించింది.

తెలుగు సినిమా చరిత్రలో పెదరాయుడు ది ఓ అరుదైన రికార్డు. 41 కేంద్రాలలో డైరెక్టుగా 100 రోజులాడిన సినిమా 9 కేంద్రాలలో 150 రోజులు, 6 కేంద్రాలలో డైరెక్టుగా 175 రోజులు ప్రదర్శింపబడింది. హైదరాబాద్ శాంతి థియేటర్ లో 200 రోజులకు పైగా ఆడి, టోటల్ గా 12 కోట్లకు పైగా షేర్ వసూళ్లు చేసి ‘ఘరానా మొగుడు’ రికార్డును క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.

సత్యమూర్తి రాసిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ :

1) ‘The relationship between two persons in a family must be like a fish and water but should not be like a fish and a fisherman’

2) ఆపరా. అంతకుమించి ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నాకళ్లల్లోకి సూటిగాచూసి మాట్లాడలేని నువ్వు నాతీర్పుకే ఎదురుచెప్తావా? ప్రాణాలు తీస్తాను. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. జరిగిన అన్యాయం, జరగాలసిన న్యాయం ముఖ్యం. రేయ్ తీయరా తాళి. కట్టరా వెళ్లి.

3) పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం.. మనకు పుట్టారుగాబట్టి.. పెళ్ళాన్ని పోషించడం మన బాధ్యత..మనల్ని నమ్ముకొని వచ్చిందిగాబట్టి.. తల్లిదండ్రుల్ని కంటిరెప్పల్లా కాపాడుకోవడం మన ధర్మం.. వాళ్ళు మనకు జన్మనిచ్చారుగాబట్టి..
మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలిగానీ సిగ్గుపడకూడదురా.

4) గురువులేని చదువు.. జన్మనిచ్చిన వారిని మరచిపోయినవాడి బ్రతుకు రాణించదురా.. రాణించదు.

5)నారు నాటితే వరి పెరుగుతుంది.. మాట జారితే గొడవ పెరుగుతుంది..

6)కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికింకా విలువుందంటే.. ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా.. కట్టించుకున్న ఆమెది

7)రేయ్.. చివరకు మిగిలేది ఆరడుగుల నేల,గుప్పెడు బూడిదే

-రాజేష్ మన్నె