రొటీన్ అన్నారు.. రికార్డ్ క్రియేట్ చేసింది

Friday,January 06,2023 - 08:36 by Z_CLU

కొన్ని నెలలుగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదని , ఐ ఫీస్ట్ అనిపించే భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాలకే ప్రేక్షకులు ఇల్లు కదిలి థియేటర్స్ కి వస్తున్నారని వింటూనే వున్నాం. కానీ థియేటర్స్ లో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ , పర్ఫెక్ట్ మీటర్ లో మాస్ కంటెంట్ ప్లాన్ చేస్తే కచ్చితంగా ఆడియన్స్ సినిమా చూసి తమ జేబులో ఉన్న డబ్బును కోట్ల కలెక్షన్స్ రూపంలో బాక్సాఫీస్ లో వేస్తారని ‘ధమాకా’ మంచి సౌండింగ్ తో రుజువు చేసింది. 100 కోట్ల గ్రాస్ అందుకున్న ధమాకా గురించి ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

 

అదరగొట్టిన రవితేజ -శ్రీలీల

రవితేజలో మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని పర్ఫెక్ట్ వాడుకొని రెండు షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ ఇస్తే మాస్ మహారాజా ఊరుకుంటాడా ? రెచ్చిపోడు ధమాకా లో అదే కనిపించింది. ఇక హీరో పక్కన అందమైన హీరోయిన్ ఉంటే ప్రేక్షకుడికి కన్నుల పండుగే. క్రేజ్ ఉన్న శ్రీ లీలను తీసుకొని ఆమెతో మాస్ స్టెప్స్ వేయించి , క్లాస్ పెర్ఫార్మెన్స్ చేయించడంతో అమ్మడు యూత్ ఆడియన్స్ ను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించేసింది.

సాదించిన త్రినాద్ రావు నక్కిన -ప్రసన్న కుమార్ 

రొటీన్ కథే అయినా రైటర్ ప్రసన్న ధమాకా కి ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసేలా చేసింది. హీరో కేరెక్టర్ తో మంచి సీన్స్ తో పాటు విజిల్స్ క్లాప్స్ పడే సన్నివేశాలు రాసుకున్నాడు ప్రసన్న కుమార్. రైటర్ గా తన సత్తా చాటి ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ తో స్టార్ రైటర్ అయిపోయాడు. ఈ డబుల్ యాక్షన్ కన్ఫ్యూజన్ డ్రామాను త్రినాద్ రావు నక్కిన సరికొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. ఈ దెబ్బతో తను బడా కమర్షియల్ సినిమాలను కూడా హ్యాండిల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు.  మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చే అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరిన ‘ధమాకా’ ఊహించని వసూళ్లు రాబట్టింది. రాబడుతూనే ఉంది.

కమర్షియల్ మీటర్

మాస్ సినిమాలకు కమర్షియల్ మీటర్ అంటూ ఒకటుంటుంది. స్క్రిప్ట్ రెడీ అయ్యే టప్పుడు మనం మాస్ ఆడియన్ లా ఆలోచిస్తే ప్రతీదీ వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా సినిమాలో బాగా వర్కవుట్ అయింది కామెడీ. కమర్షియల్ సినిమాలో ఫైట్స్ , పాటలతో పాటు కామెడీ ట్రాక్ బాగా రాసుకుంటే ఇందాక చెప్పినట్టు ప్రేక్షకులు సంతోషంగా కలెక్షన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు.

‘ఇంద్ర’ ఎపిసోడ్

హీరోకి ఎలివేషన్ ఇచ్చే ఎపిసోడ్ ఒకటి పడాలి. అందులో కామెడీ ఉండాలి ఎలా ? టక్కున మెగా స్టార్ ఇంద్రను వాడేసుకున్నారు. ఆ కామెడీ ఎపిసోడ్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. ఆ ఎపిసోడ్ ఎండింగ్ లో రావు రమేష్ డైలాగులు కూడా వినిపించకుండా అరుస్తూనే ఉన్న జనంలో సినిమా చూసిన వాడిగా అబ్బా ఇంద్రని భలే వాడారుగా అనిపించింది. ఆలోచన రావడం , దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంతో సినిమాకి ఆ ఎపిసోడ్ హైలైట్ అనిపించుకుంది.

 ‘రావు రమేష్ -హైపర్ ఆది’ హిలేరియస్ ట్రాక్

రావు రమేష్ -హైపర్ అది ట్రాక్ లో కొత్తదనం లేదు కానీ కడుపుబ్బా నవ్వించింది. ఒక్క సీన్ కోసం ధమాకా లో ఎంటరైన హైపర్ ఆది తన కేరెక్టర్ పెంచేసుకొని సంచుల పంచులతో సినిమాకే హైలైట్ అయ్యాడు. ఎండింగ్ లో రావు రమేష్ తో రవితేజ పాతిక వేలిచ్చి వేయించుకునే వాడిని మిమ్మల్నే చూస్తున్నా అంటే జనాలు పగలబడి నవ్వేశారు. చాలా చిన్న పంచ్ డైలాగ్ కే ఇంత నవ్వారంటే ఆది కేరెక్టర్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

‘మ్యూజిక్’ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్

ధమాకా సక్సెస్ లో మరో కీ రోల్ పోషించిన వ్యక్తి భీమ్స్. చాలా రోజులకి సాంగ్స్ వస్తే నేల టికెట్టు బ్యాచ్ తో పాటు బాల్కనీ లో కూర్చున్న ఆడియన్స్ కూడా గోల గోల చేస్తూ స్క్రీన్ ముందు చిందేశారు. క్లాస్ మాస్ తేడా లేకుండా సాంగ్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యాయి. ఓ సందర్భంలో పల్సర్ బైకు సాంగ్ ను పర్ఫెక్ట్ గా వాడుకున్న విధానం థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకొని హీరో కేరెక్టర్ కి ఎలివేషన్ ఇచ్చింది.

100 కోట్లతో భరోసా

ఫైనల్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ మీటర్ లో సినిమా తీస్తే మాస్ బొమ్మ అద్భుతాలు చేస్తుంది. దానికి తోడు టైమ్ కలిసొస్తే ‘ధమాకా’లా 100 కోట్లు కొల్లగొడుతుంది. ఓవరాల్ గా మాస్ కమర్షియల్ ‘ధమాకా’ థియేటర్స్ లో ఇంత పెద్ద హిట్ అవ్వడం ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది.

ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కౌంట్ లో వేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి అలాగే రవితేజ ఫ్యాన్స్ మాస్ మహారాజాను ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా అలా చూపించి మేజిక్ చేసిన త్రినాద్ రావు నక్కిన గారికి , ఈ సినిమాకు కథ అందించిన , స్క్రీన్ ప్లే -డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసిన రైటర్ ప్రసన్నా కుమార్ కి చివర్లో సాంగ్స్ తో వండర్ క్రియేట్ చేస్తున్న భీమ్స్ కి కంగ్రాట్స్ .

రాజేష్ మన్నె