యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

Monday,October 08,2018 - 07:32 by Z_CLU

మరో 3 రోజుల్లో గ్రాండ్ గా రిలీజవుతుంది అరవింద సమేత. అయితే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న యంగ్ టైగర్ NTR, ఈ సినిమా గురించి దర్శకుడు త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు. అవి మీకోసం…

సినిమానే ఇప్పుడు…

ఇద్దరం కలిసి సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది కానీ మాది లాంగ్ జర్నీ. మేమిద్దరం ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం. ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం… చాలా షేర్ చేసుకుంటాం.

సినిమా అందుకే లేటయింది…

ఇక సినిమా విషయానికి వస్తే నాది త్రివిక్రమ్ గారిది ఒకటే సిద్ధాంతం. ఏదీ మనకు మనం, బలవంతంగా చేయకూడదు. టైమ్ వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది అనుకుంటాం. సినిమా విషయంలో కూడా అంతే. మా ఇద్దరి కాంబోలో ఈ సినిమా ఇప్పుడే రావాలి. అదే జరిగింది.

అదీ త్రివిక్రమ్…

త్రివిక్రమ్ గారు నాకన్నా మా అమ్మకు చాలా క్లోజ్. మన ఫ్రెండ్ సర్కిల్ లో చాలా తక్కువ మంది గడప దాటి లోపలికి వచ్చి మనలో కలిసిపోయేవాళ్ళు ఉంటారు. అందులో చాలా ముఖ్యుడు త్రివిక్రమ్.

నాకది కనిపించలేదు…

అరవింద సమేత కథ కన్నా ముందు త్రివిక్రమ్ గారు నాకు 2, 3 కథలు చెప్పారు. అన్నీ అద్భుతంగా ఉన్నాయి.  కానీ ఇంకా ఏదో కావాలి అనే ఫీలింగ్ ఆయనలోనే ఉండిపోయేది. కానీ ఎప్పుడైతే ‘అరవింద సమేత’ ఓపెనింగ్ చెప్పారో జస్ట్ అద్భుతం. నాలోనే కాదు, ఆయనలో కూడా ఆ ఎగ్జైట్ మెంట్ చూశాను.

చాలా స్వార్థంగా ఆలోచించా…

త్రివిక్రమ్ లాంటి గొప్ప దర్శకుడితో పని చేస్తున్నాననగానే నేను కూడా కొంచెం స్వార్థంగానే  ఆలోచించా. ఆయన సినిమాలన్నీ చూసి ఉన్నాను. ఆయన స్టాండర్డ్స్ ఏంటో నాకు తెలుసు. అందుకే ఆయన 100% పెట్టేలా సినిమా ఉండాలనుకున్నా…

పర్ఫెక్ట్ లీడర్..

త్రివిక్రమ్ గారు నా దృష్టిలో పర్ఫెక్ట్ లీడర్. ఈ రోజు ఈ సినిమాలో ప్రతీది ఇంత పర్ఫెక్ట్ గా సింక్ అయిందంటే డెఫ్ఫినేట్ గా అది ఆయన వల్లే.

అది మాత్రం చాలా అరుదు…

నా దృష్టిలో ‘పెనివిటీ’ సాంగ్ నిజంగా ప్రయోగమే. ఒక ఆడదాని బాధని మగ గొంతుతో వినిపించడమనేది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. త్రివిక్రమ్ గారి దృష్టిలో ఆ పాట తల్లి బాధ కొడుకు గొంతులో వినడం లాంటిది…

ప్రేక్షకులు చెప్పేది ఒకటే…

‘జెన్యూన్ గా, నిస్వార్థంగా, భయపడకుండా ఒక కథను మాకు చెప్పు, ఒక జెన్యూన్ ఎఫర్ట్ మాకు కనిపిస్తే బ్రహ్మరథం పడతామని ప్రేక్షకులు చెప్పకనే చెప్తున్నారు. ‘పెనివిటి’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ దానికి నిదర్శనం.

సునీల్ కమెడియన్ కాదు…

రేపు సినిమా రిలీజయ్యాక సునీల్ ఈ సినిమాలో ఎంత బలమైన క్యారెక్టర్ ప్లే చేశాడన్నది తెలిసిపోతుంది. నా దృష్టిలో సునీల్ కమెడియన్ కాదు, ఒక నటుడు అంతే. కామెడీ అనేది సినిమాలో జస్ట్ భాగం మాత్రమే. ఈ సినిమాలో సునీల్ అసలు కామెడీ చేయడు.

కథకు బానిస…

దర్శకుడి దగ్గరి నుండి బిగిన్ అయితే ప్రతి టెక్నీషియన్ వరకు ఈ కథకు బానిసలమై పోయాం. ఆ బలమైన పాత్రలకు బానిసలమైపోయాం…

ప్రొడ్యూసర్ గురించి…

నిర్మొహమాటమైన ప్రొడ్యూసర్. ఎక్కడైనా ఏదైనా నచ్చకపోతే ఇంటికొచ్చి మరీ చెప్పే రకం ఆయన. అందరూ ఆయన్ని చినబాబు అని పిలుస్తారు కానీ ఆయన పెదబాబే. ఎక్కడా జంకకుండా నిస్వార్థంగా, నా సినిమా బాగా రావాలి అనే ఒక్క ఆలోచన తప్ప, ఇక్కడ తగ్గిద్దాం, ఇక్కడ మిగుల్చుకుందాం అనే ఆలోచన కూడాలేని వ్యక్తి రాధాకృష్ణ గారు.

ఫైనల్ గా…

ప్రేక్షకులందరూ మా ప్రయత్నాన్ని, ఈ అరవింద సమేత చిత్రాన్ని ఆశీర్వదిస్తారని, మంచి చిత్రాన్ని ఎంకరేజ్ చేసే మీ గుణం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను, థాంక్యూ.