ఇయర్ ఎండ్ స్పెషల్ : టాలీవుడ్ టాప్ మూవీస్ 2018

Saturday,December 29,2018 - 10:03 by Z_CLU

2018 టాలీవుడ్ బాక్సాఫీస్ సూపర్ సక్సెస్ అయింది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఎక్కువగా హిట్ అవ్వడంతో టాలీవుడ్ కళకళలాడింది. ఎప్పట్లానే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు అందుకున్నారు. 2018లో 171 స్ట్రయిట్ సినిమాలు విడుదలైతే.. ప్రతి నెలలో బయ్యర్లు, ప్రొడ్యూసర్లను ఖుషీ చేసే సినిమాలు వచ్చాయి. నెల వారీగా 2018లో సక్సెస్ అయిన సినిమాలేంటో చూద్దాం.

టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ సంక్రాంతితోనే మొదలవుతుంది. 2018లో కూడా అలానే స్టార్ట్ అయింది. కాకపోతే స్టార్టింగ్ లోనే పెద్ద ఎదురుదెబ్బ. షూర్ షాట్ అని భావించిన అజ్ఞాతవాసి మిస్ ఫైర్ అయింది. ఆకట్టుకుంటుందనుకున్న రంగులరాట్నం కూడా తిరగలేదు. బాలయ్య నటించిన జైసింహా మాత్రమే సంక్రాంతి మూవీగా నిలిచింది. ఇక జనవరి చివర్లో వచ్చిన భాగమతి హిట్ మూవీగా నిలిచింది.

నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో ఫిబ్రవరి బాక్సాఫీస్ గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇదే నెలలో వచ్చిన తొలిప్రేమ కూడా సూపర్ హిట్ అయింది. ఈ రెండు మినహాయిస్తే మిగతా సినిమాలేవీ ఆడలేదు. గాయత్రి, ఇంటిలిజెంట్, మనసుకు నచ్చింది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అ! మూవీ మాత్రం కాసులు రాల్చకపోయినా, విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

మార్చిలో కిర్రాక్ పార్టీతో థియేటర్లలోకి వచ్చిన నిఖిల్ ఎక్స్ పెక్టే చేసిన లెవెల్లో రిజల్ట్ పొందలేకపోయాడు. ఇదే నెలలో ఎమ్మెల్యేగా మనముందుకొచ్చిన కల్యాణ్ రామ్ పరిస్థితి కూడా ఇంతే. నీది నాది ఒకే కథ అనే సినిమా మాత్రం హృదయాలకు హత్తుకుంది. ఇలా స్తబ్దుగా సాగుతున్న మార్చి బాక్సాఫీస్ కు ఊపుతీసుకొచ్చింది రంగస్థలం. చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కాసులవర్షం కురిపించింది. కొత్త రికార్డులు సృష్టించింది. ఫైనల్ గా ఈ ఏడాది నంబర్ వన్ మూవీగా నిలిచింది.

ఏప్రిల్ లో మహేష్ బాబు మెరిశాడు. స్టయిలిష్ సీఎంగా భరత్ అనే నేను సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ నెలలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఛల్ మోహన్ రంగ అంటూ వచ్చిన నితిన్ పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. ఆచారి అమెరికా యాత్ర, కణం, కృష్ణార్జున యుద్ధం, సత్యగ్యాంగ్.. ఇలా అంచనాలతో వచ్చిన ఎన్నో సినిమాలు ఈ నెలలో ఆ అంచనాల్ని అందుకోలేకపోయాయి.

2018, మే.. ఈనెల టాలీవుడ్ హిస్టరీలో కలకాలం నిలిచిపోతుంది. ఎందుకంటే ఇదే నెలలో మహానటి సినిమా వచ్చింది. ఇది కేవలం సావిత్రి బయోపిక్ కాదు. తెలుగు సినీచరిత్రలో ఓ క్లాసిక్. ఇది కేవలం 10-12 మంది టెక్నీషియన్స్, నటీనటుల సినిమా మాత్రమే కాదు. టోటల్ టాలీవుడ్ కు చెందిన మూవీ. ఇది మా సినిమా అని టాలీవుడ్ అంతా గొప్పగా చెప్పుకున్న మూవీ. అంతలా ప్రేక్షకుల్ని, చిత్రపరిశ్రమను ప్రభావితం చేసింది మహానటి. సౌత్ ఇండస్ట్రీలో బయోపిక్స్ తీయాలనుకునే మేకర్స్ కు ఓ గైడ్ లా మారింది. ఈ మూవీతో పాటు ఈ నెలలో వచ్చిన నా పేరు సూర్య ఓపెనింగ్స్ తో దుమ్ముదులపగా.. మెహబూబా, అమ్మమ్మగారిల్లు, నేలటిక్కెట్టు సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి.

జూన్ లో కూడా ఇలాంటి ఆశ్చర్యకర ఫలితాలే వచ్చాయి. హిట్ అవుతాయని భావించిన ఆఫీసర్, రాజుగాడు, నా నువ్వే, ఈ నగరానికి ఏమైంది సినిమాలు బోల్తాపడ్డాయి. ఈ నెలలో హిట్ అయిన ఒకేఒక్క మూవీ సమ్మోహనం. కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మంచి విజయాన్నందుకుంది సమ్మోహనం.

జూన్ అనుకుంటే జులైలో మరీ ఆశ్చర్యం. ఊహించని విధంగా వచ్చిన ఆర్ఎక్స్100 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు లాభం తెచ్చిపెట్టింది. ఈనెలలో బిగ్గెస్ హిట్ ఇదే. చిరంజీవి అల్లుడు నటించిన విజేత ఆకట్టుకోకపోగా.. పంతం, తేజ్ ఐ లవ్ యు, లవర్, వైఫ్ ఆఫ్ రామ్, సాక్ష్యం, హ్యాపీ వెడ్డింగ్, ఆటగదరా శివ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి.

ఆర్ఎక్స్100 ఎలా అయితే సర్ ప్రైజ్ హిట్ అయిందో, ఆగస్ట్ లో గూఢచారి కూడా అలానే ఆశ్చర్యకరంగా విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేసింది. మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. గూఢచారితో పాటు అదే రోజు వచ్చిన చిలసౌ సినిమా కూడా సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకెత్తు, గీతగోవిందం సినిమా మరో ఎత్తు. ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల తర్వాత పెద్ద హిట్ ఇదే.

ఆగస్ట్ లానే సెప్టెంబర్ లో కూడా మంచి హిట్స్ పడ్డాయి. ఈ నెలలో దేవదాస్, నన్ను దోచుకుందువటే, శైలజారెడ్డి అల్లుడు లాంటి హిట్ సినిమాలొచ్చాయి. అదే నెలలో వచ్చిన యూ-టర్న్, సిల్లీఫెలోస్, కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ, అక్టోబర్ లో మాత్రం నోటాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇదే దారిలో హలో గురు ప్రేమకోసమే, వీరభోగవసంతరాయలు సినిమాలు కూడా మిస్ ఫైర్ అయ్యాయి. ఈ నెలలో క్లిక్ అయిన ఒకే ఒక్క మూవీ అరవింద సమేత. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి.

అక్టోబర్ లో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ నవంబర్ లో మాత్రం మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. ఇతడు నటించిన టాక్సీవాలా సినిమా సూపర్ హిట్ అయింది. విడుదలైన మొదటి రోజే బ్రేక్-ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. దీంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.O సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన 2.O చాన్నాళ్ల తర్వాత రజనీకాంత్ కు హిట్ అందించింది. ఇదే నెలలో భారీ అంచనాల మధ్య వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ, 24 కిస్సెస్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. ఉన్నంతలో సవ్యసాచి సినిమా ఫర్వాలేదనిపించుకుంది.

డిసెంబర్ లో కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏదీ ఈ ఏడాదికి సరైన ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. ఈ నెలలో అంతరిక్షం, సుబ్రహ్మణ్యపురం సినిమాలు మాత్రమే ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. నెక్ట్స్ ఏంటి, కవచం, భైరవగీత, ఇదంజగత్ సినిమాలేవీ ఆడలేదు.