ఇయర్ ఎండ్ స్పెషల్ : కొత్త దర్శకులు 2019

Tuesday,December 31,2019 - 10:02 by Z_CLU

ప్రతీ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమలోకి కెరటంలా కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటి కెరటాలు ఇండస్ట్రీలో కొత్త మార్పు తీసుకొచ్చాయి. 2019లో ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చిన కొత్త దర్శకులపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఈ ఏడాది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు స్వరూప్. రిలీజ్ రోజు వరకూ ఇతని పై గానీ సినిమాపై కానీ ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కాని వన్స్ థియేటర్స్ లో బొమ్మ పడింది మొదలు అందరికి దర్శకుడే మైండ్ లో మెదిలాడు. తొలుత సినిమాను కామెడీగా ప్రారంభించి ఆ తర్వాత ఓ క్రైం చుట్టూ కథను నడిపి చివరికి ఎవరూ ఊహించని విధంగా కథను మలుపు తిప్పి ఓ వేలు ముద్ర స్కాంను బయటపెట్టాడు. స్వరూప్ కథకి, స్క్రీన్ ప్లేకి మెస్మరైజ్ అవ్వని ప్రేక్షకుడు లేడు.


తమిళ్ లో ‘హ్యాపీ డేస్’ రీమేక్  సినిమాను డైరెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు ‘118’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ , నివేతా థామస్ , శాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ బోణి కొట్టాడు గుహన్.


హీరోగా రెండు సినిమాలు చేసి ఈ ఏడాది సడన్ గా దర్శకుడిగా అవతారమెత్తాడు విశ్వక్ సేన్. తను తమ్మిన కథను రీమేక్ లా కాకుండా స్ట్రైట్ సినిమాలా తెరక్కించి దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. రెండో భాగంలో కాస్త తడబడినా ఫైనల్ గా సినిమాతో హిట్ అందుకున్నాడు.


ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. కొందరు దర్శకులు జనాలకు తెలిసిన గొప్ప వ్యక్తుల గురించి కథలు రాసుకుంటే అతను మాత్రం తను ఇష్టపడిన ఓ వ్యక్తి కథతో ‘మల్లేశం’ అనే సినిమా తీసి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతనే ఆర్.రాజ్. అవును కొందరికి మాత్రమే తెలిసిన అందరికీ ఆదర్శంగా నిలిచే మల్లేశం కథతో సినిమా తీసి మెగా ఫోన్ పట్టాడు. తను టార్గెట్ చేసిన ప్రేక్షకులకు ఆ సినిమాను రీచ్ చేయడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.


రీమేక్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడమంటే కష్టమే. ఏ మాత్రం తేడా కొట్టినా దర్శకుడిగా ఇక కెరీర్ ఉండదు. అయితే కొందరిలా తను కూడా రీమేక్ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుల్లో ఒకడిగా నిలిచాడు. తనే వెంకట్ రాంజీ. అడివి శేష్ హీరోగా ‘ఎవరు’ సినిమా తీసి మొదటి సినిమాతోనే ఎట్రాక్ట్ చేసాడు. రీమేక్ అయినప్పటికే కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించిన విధానం అందరిన ఆకట్టుకుంది.


కార్తీక్ రాజును నమ్మి అతనికి దర్శకుడిని అవకాశం ఇచ్చి నిర్మాతగా మారి సినిమా తీసాడు సందీప్ కిషన్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తన స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో థ్రిల్ చేసాడు కార్తీక్. అద్దంలో తన మొఖానికి బదులు మరో మొఖం కనపడటం అనే లైన్ తీసుకొని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనం రాసుకొని ఫైనల్ గా దర్శకుడిగా హిట్టు కొట్టాడు.

మెగా ఫోన్ పట్టాలనే కోరికను ఎట్టకేలకు ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో తీర్చేసుకొని ఈ ఏడాది డెబ్యూ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు భరత్ కమ్మ. విజయ్ దేవేరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో హిట్ అందుకోలేకపోయినా దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు.


కోలీవుడ్లో దర్శకుడిగా హిట్టు కొట్టిన టి.ఎన్.సంతోష్ కూడా ఈ ఇయర్ నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ రీమేక్ సినిమాతో ఈ ఇయర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు సంతోష్.


తను దర్శకుడిగా పరిచయం అవ్వడమే కాకుండా… రెండు కుటుంబాలకు చెందినా హీరో -హీరోయిన్ ని ప్రేక్షకులకు పరిచయం చేసే భాద్యతను భుజాన వేసుకొని ‘దొరసాని’ సినిమాతో వచ్చాడు కె.వి.ఆర్.మహేంద్ర. మొదటి సినిమాకు ఓ పీరియాడిక్ లవ్ స్టోరీను ఎంచుకున్న మహేంద్ర ప్రేక్షకులను మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

ఓ పల్లెటూరి ప్రేమకథతో తనలాంటి కొత్త వారిని తీసుకొని ‘రాజా వారు రాణి గారు’ అనే సినిమాతో మెగా ఫోన్ పట్టాడు రవి కిరణ్. తను చెప్పాలనుకున్న నిజాయితి గల ప్రేమకథను ఎంటర్టైనింగ్ చూపించి ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేసాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలను చాలా నేచురల్ గా తెరకెక్కించి డైరెక్టర్ గా పరవాలేదనిపించుకున్నాడు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ తన మొదటి సినిమాతో ఓ రేంజ్ లో హంగామా చేసాడు రితేష్ రానా. కీరవాణి అబ్బాయి శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన ‘మత్తు వదలరా’ సినిమాతో థ్రిల్లర్ ప్రేక్షకులకు కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా ఎంటర్టైన్ మెంట్ అనే మత్తు ఎక్కించి మేజిక్ చేసాడు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇలా ఈ ఇయర్ కొందరు దర్శకులు తమ మొదటి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలు అందుకుంటే కొందరు మాత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేక ఫెయిల్ అయ్యారు.