జీ తెలుగులో భేతాళుడు

Thursday,January 19,2017 - 06:50 by Z_CLU

సంగీత దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించిన విజయ్ ఆంటోనీ లోని అభినయ ప్రతిభ ఆ తరవాత వెలుగు చూసింది. S.A. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘సుక్రన్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా 2005 సంవత్సరంలో తమిళ సినీరంగంలో అడుగుపెట్టిన విజయ్, ఆ తరవాత ఓ రెండు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించినప్పటికీ 2012 సంవత్సరంలో ‘నాన్’ చిత్రంతో నటుడిగా మారారు. విజయ్ అంటోనిని తమిళ ప్రేక్షకులే కాక, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. ‘నకిలీ’. ‘డా.సలీమ్’ చిత్రాలతో తన అభినయ ప్రతిభను ప్రదర్శించి మరో అడుగు ముందుకేశారు విజయ్. ఇక ‘బిచ్చగాడు’ చిత్రం ఆయనను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిందీ చెప్పక్కర్లేదు. ఆ తరవాత ఆయన ఎలాంటి చిత్రంలో నటించబోతున్నాడాని ప్రేక్షకులందరిలోనూ నెలకొన్న ఉత్కంఠకు తెరతీస్తూ, ‘భేతాళుడు’ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. దినేష్ అనే పాత్ర తనను ఎవరో వెంబడిస్తున్నట్టు భ్రమిస్తూ భయపడతంతో కథ మొదలై, తన గత జన్మ జ్ఞాపకాల్లోని జయలక్ష్మి అనే మహిళను వెదుక్కుంటూ వెళ్ళడంతో కథ రసవత్తరంగా మారుతుంది. దినేష్ పాత్రలో విజయ్ ఆంటోని కనబరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా అరుంధతి నాయర్ నటించారు. హీరోగా నటిస్తూ విజయ్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకుల్ని అలరించింది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘భేతాళుడు’ చిత్రాన్ని నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర కానుకగా జనవరి 22 వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 ‌‍గంటలకు ప్రసారం చేస్తున్నామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు.