మళ్ళీ సినిమాల్లో నటిస్తుందా?

Sunday,September 25,2016 - 10:00 by Z_CLU

సమంత – నాగ చైతన్య ప్రేమించుకుంటున్నారనే వార్త ఇప్పుడు పాతదైపోయింది. ఆ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అటు నాగార్జున కూడా వీళ్ల ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చేశాడు. త్వరలోనే పెళ్లి తేదీ ఎనౌన్స్ చేస్తానని కూడా చెప్పాడు. కేవలం పెళ్లి కోసమే సమంత సినిమాలు ఆపేసిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. సో.. జనతా గ్యారేజ్ మాత్రమే ఆమె చివరి తెలుగు సినిమా కానుంది. అయితే ప్రస్తుతం సమంత తన ఆలోచన మార్చుకున్నట్టు కనిపిస్తోంది. సినిమాల విషయంలో యూ-టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

జనతా గ్యారేజ్ తరువాత మరో సినిమాకు సైన్ చెయ్యని ఈ భామ మళ్ళీ సినిమా చేయడానికి సిద్దమవుతోందట. కన్నడలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కి.. సూపర్  హిట్ అయిన ‘యూ టర్న్’ అనే సినిమా పై సమంత మనసు పడిందట. కుదిరితే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటోందట. అంతేకాదు ఈ సినిమాతోనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోందట. మరోవైపు ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని నాగార్జున సొంతం చేసుకొని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాను తన కోడలు సమంతతోనే  నాగ్ తెరకెక్కిస్తాడా? అనేది చూడాలి.