ఈ బోస్ పవన్ కోసమేనా...?

Thursday,September 15,2016 - 01:25 by Z_CLU

కొత్తగా ఇప్పుడు తెరపైకి బోస్ వచ్చాడు. ఈ టైటిల్ ను దర్శకరత్న దాసరి నారాయణరావు రిజిస్టర్ చేయించడంతో అందర్లో క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకంటే, పవన్ తో సినిమా చేస్తానంటూ దాసరి చాన్నాళ్లుగా ఊరిస్తున్నారు. ఇప్పుుడు టైటిల్ రిజిస్టర్ చేయించడంతో… పవన్-దాసరి కాంబోపై అందరి దృష్టి పడింది. పైగా… సన్నాఫ్ ఇండియా అంటూ ఫైర్ ఉన్న క్యాప్షన్ పెట్టడంతో.. ఈ టైటిల్ కచ్చితంగా పవన్ కోసమే పెట్టి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

తన సొంత బ్యానర్ తారకప్రభు ఫిలిమ్స్ పై ‘బోస్’ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట దాసరి. ఈ మధ్యకాలంలో దాసరి తన బ్యానర్ లో సినిమాలేమీ చేయలేదు కాబట్టి.. ఈ ‘బోస్’ ఖచ్చితంగా పవన్ కోసమేననే టాక్ బలంగా వినిపిస్తోంది.  దాసరి ప్రొడక్షన్ లో పవన్ సినిమా ఉండబోతుండటం, దానిని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. నిజంగానే పవన్ ‘బోస్’ గా వస్తే.. ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద పండగ ఇంకోటి ఉండదు. అయితే ఈ బోస్ పై క్లారిటీ రావాలంటే ముందు కాటమరాయుడు పూర్తవ్వాలి. తర్వాత త్రివిక్రమ్ సినిమా కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడు కానీ బోస్ పై క్లారిటీ రాదు.