వీకెండ్ రిలీజ్

Wednesday,March 04,2020 - 04:06 by Z_CLU

ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చిన్నసినిమాలే అయినప్పటికీ కాస్త క్యూరియాసిటీ పెంచే సినిమాలు మాత్రం ఓ 3 ఉన్నాయి. వీటిలో ఒకటి ‘ఓ పిట్టకథ’.

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా పరిచయమౌతున్న సినిమా ఓ పిట్టకథ. సంజయ్ తో పాటు విశ్వంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో నిత్యాషెట్టి హీరోయిన్ గా పరిచయమౌతోంది. అంజి సినిమాలో చిరంజీవితో పాటు నటించిన చిన్నపిల్ల ఈ నిత్యాషెట్టి. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకుడు.

 

‘ఓ పిట్టకథ’తో పాటు వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘పలాస 1978’. లండన్ బాబులు ఫేమ్ రక్షిత్ హీరోగా, నక్షత్ర హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ ప్రజెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం లో అప్పారావు  బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించడంతో పాటు మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు.

ఈ సినిమాలతో పాటు ‘కృష్ణమనోహర్’, ‘అర్జున’ అనే మరో 2 సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో ప్రభుదేవా నటించిన పొన్ మానిక‌వ‌ల్ మూవీని తెలుగులో కృష్ణమనోహర్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు చాలా ఏళ్ల కిందట రాజశేఖర్ నటించిన అర్జున అనే సినిమా కూడా ఇన్నాళ్లకు థియేటర్లలోకి వస్తోంది. రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మరియం జకారియా హీరోయిన్. కన్మణి దర్శకుడు.

 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, స్క్రీన్ ప్లే, కాలేజ్ కుమార్ అనే మరో 3 సినిమాలు కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. ఇలా ఈ శుక్రవారం ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఎన్ని క్లిక్ అవుతాయో చూడాలి.