వీకెండ్ రిలీజ్

Wednesday,April 10,2019 - 01:12 by Z_CLU

ఈ వీకెండ్ మొత్తంగా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ మూవీస్, మిగతా 2 స్ట్రయిట్ మూవీస్. ఈ 4 సినిమాల్లో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ ఒకే ఒక్కటి. అదే చిత్రలహరి.

సాయి తేజ్, నివేత పెతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా చిత్రలహరి. కిషోర్ తిరుమల డైరక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. జీవితంలో సక్సెస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి ఏం చేశాడు, ఐదుగురు వ్యక్తులు ఇతడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారనేది ఈ సినిమా స్టోరీ. దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

చిత్రలహరితో పాటు థియేటర్లలోకి వస్తున్న మరో స్ట్రయిట్ మూవీ రుణం. బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి గుండ్రెడ్డి దర్శకుడు. ఇద్దరు స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది రుణం. గోపీకృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్టీన్ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న హాలీవుడ్ మూవీ హెల్ బాయ్. దీన్ని సాహసపుత్రుడు పేరిట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. NVR సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. హెల్ బాయ్ సిరీస్ లో ఇది మూడోది.

జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఇప్పటికే మలయాళం లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు తెలుగులో విడుదల చేస్తున్నారు.