Weekend Release - ఈ వారం 5 సినిమాలు

Wednesday,September 22,2021 - 05:07 by Z_CLU

ఈ వారం థియేటర్లలోకి 5 సినిమాలొస్తున్నాయి. చెప్పాలంటే ప్రతి వారం రిలీజయ్యే సినిమాల కంటే కాస్త తక్కువే. దీనికి కారణం లవ్ స్టోరీ సినిమా. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు హయ్యస్ట్ థియేటర్లు దక్కాయి. ఈ మూవీతో పాటు ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాలేంటో చూద్దాం

దాదాపు రెండేళ్లుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. ఈ శుక్రవారం ఈ మూవీ గ్రాండ్ గా వస్తోంది. ఈ సినిమాపై టోటల్ ఇండస్ట్రీ కన్నుపడింది. ఇప్పటికే సీటీమార్, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో థియేటర్లకు క్రౌడ్ వస్తున్నారని తేలడంతో, లవ్ స్టోరీ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా రారా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అందుకే ఇండస్ట్రీ అంతా లవ్ స్టోరీ రిజల్ట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తోంది. ఇక ఈ సినిమా ఎట్రాక్షన్స్ విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ-సాయిపల్లవి జంటగా నటించడమే పెద్ద ఎట్రాక్షన్. దీనికితోడు పాటలు పెద్ద హిట్టయ్యాయి. ట్రయిలర్ కూడా హిట్టయింది.

లవ్ స్టోరీతో పాటు థియేటర్లలోకి వస్తున్న చిన్న సినిమా సిండ్రెల్లా. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ ‘రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్ ప‌తాకాల‌పై మంచాల ర‌వికిర‌ణ్, ఎం.ఎన్‌.రాజు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ ఈ వీకెండ్ విడుదలకు సిద్దమైంది.

ఈ సినిమాలు రిలీజైన 2 రోజులకు అంటే, 26వ తేదీ ఆదివారం రోజున “నీ జతగా” అనే మరో సినిమా రిలీజ్ కాబోతోంది. శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్ పై, భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది ఈ సినిమా. రామ్ నిర్మించిన ఈ సినిమాకు భమిడిపాటి వీర దర్శకత్వం వహించారు.

ఇక ఈ వారం ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ అవుతున్న సినిమా “అలాంటి సిత్రాలు”. తెరపై నటులు ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పాత్రలు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయనేది ఇప్పుడు ముఖ్యం. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పుడు డిఫరెంట్ స్టోరీస్, నెరేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది ”అలాంటి సిత్రాలు” మూవీ. సుప్రీత్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాను రాఘవేంద్రరెడ్డి సమర్పిస్తున్నారు. ఈ శుక్రవారం ZEE5 Exclusive Movieగా స్ట్రీమింగ్ కు రాబోతోంది ఈ సినిమా.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics