వీకెండ్ రిలీజ్

Tuesday,December 31,2019 - 11:02 by Z_CLU

న్యూ ఇయర్ లో కొత్త సినిమాలు హోరెత్తనున్నాయి. 2 రోజుల్లో ఏకంగా 12 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. ఎందుకంటే.. అవతల సంక్రాంతి తరుముకొస్తోంది. ఇప్పుడు రిలీజ్ చేయకపోతే ఇక మరో 2 నెలల వరకు గ్యాప్ దొరకదు. అందుకే చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ అన్నీ ఒకేసారి క్యూ కట్టాయి.

జనవరి 1న 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వర్మ తీసిన బ్యూటిఫుల్, ధనుష్ నటించిన తూటా సినిమాలతో పాటు మమ్ముట్టి నటించిన డబ్బింగ్ మూవీ రాజా నరసింహా వస్తున్నాయి. ట్రిబ్యూట్ టు రంగీలా ట్యాగ్ లైన్ తో బ్యూటిఫుల్ వస్తోంది. అటు ధనుష్-మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తోంది తూటా. ఇక
మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన మధురరాజా సినిమా తెలుగులో రాజా నరసింహాగా వస్తోంది.

ఈ మూవీస్ తో పాటు అదే రోజు (జనవరి 1) రథేరా, అతడే శ్రీమన్నారాయణ, ఉల్లాల ఉల్లాల సినిమాలు వస్తున్నాయి. రక్షిత్ హీరోగా నటించిన అతడే శ్రీమన్నారాయణ మూవీ ఆల్రెడీ కన్నడలో సూపర్ హిట్ అయింది. 1న తెలుగులో వస్తోంది. ఇక సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకుడిగా మారి తీసిన ఉల్లాల ఉల్లాల సినిమా కూడా వస్తోంది. నటరాన్, నూరిన్ హీరోహీరోయిన్లుగా నటించారు. సిద్ధు-మానస హీరోహీరోయిన్లుగా నటించిన రథేరా కూడా రేపే థియేటర్లలోకి వస్తోంది.

ఇక 3వ తేదీన బూమరాంగ్, హల్ చల్, వైఫ్ ఐ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అధర్వ, మేఘా ఆకాష్ జంటగా నటించిన సినిమా బూమరాంగ్. తమిళ్ లో మంచి విజయం సాధించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా తెలుగులో కూడా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఇక డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కిన హల్ చల్, వైఫ్ ఐ సినిమాలు కూడా అదే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి.

వీటితో పాటు.. 3న నమస్తే నేస్తమా, సమరం, ఉత్తర అనే మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇలా నూతన సంవత్సరం ప్రారంభంలోనే 2 రోజుల్లో 12 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.