వీకెండ్ రిలీజ్

Wednesday,December 11,2019 - 12:29 by Z_CLU

ఈ వీకెండ్ 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో హై-ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ వెంకీమామ మాత్రమే. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కు చెందిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయినప్పటికీ, ఇంకా సస్పెన్స్ నడుస్తోంది.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వర్మ సమర్పిస్తున్న సినిమా అమ్మ రాజ్యంలో కడపరెడ్లు. పొలిటికల్ సెటైరిక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదాపడింది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినప్పటికీ, విడుదలపై అనుమానాలున్నాయి. ఈ సినిమాపై మరోసారి కోర్టుకు వెళ్తానని కేఏ పాల్ ప్రకటించారు. అటు వర్మ మాత్రం గురువారం సినిమా తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని అంటున్నాడు.

ఈ సినిమాతో పాటు పూర్తి హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన హేజా అనే సినిమా కూడా వస్తోంది. మ్యూజికల్ హారర్ సినిమాగా చెబుతున్న హేజాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వ విభాగాల్ని మున్నా కాశీ చూసుకున్నాడు. ఈ సినిమాలో హీరో కూడా అతడే.

అమ్మరాజ్యంలో కడపబిడ్డలు, హేజా సినిమాలతో పాటు మామాంగం అనే మరో డబ్బింగ్ మూవీ కూడా గురువారమే థియేటర్లలోకి వస్తోంది. కేరళ ప్రాంతానికి చెందిన చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు, ఈ హిస్టారికల్ మూవీలో ఉన్నాయంటున్నారు మమ్ముట్టి.

ఇక ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా, భారీ అంచనాల మధ్య శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది వెంకీమామ. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. రాశిఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్, సెకండాఫ్ లో ఎమోషన్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ అంటోంది యూనిట్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అందర్నీ షాక్ కు గురిచేస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాలతో పాటు సుమన్ నటించిన అయ్యప్ప కటాక్షం అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. సుమన్ కు హీరోగా ఇది వందో చిత్రం. రుద్రాభట్ల వేణుగోపాల్ తీసిన ఈ సినిమాలో అయ్యప్ప లీలల్ని చూపించబోతున్నారు.