వీకెండ్ రిలీజ్

Thursday,October 17,2019 - 12:28 by Z_CLU

2 వారాల కిందట రిలీజైన సైరా సినిమా థియేటర్లలో ఇంకా నడుస్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక స్క్రీన్స్ దానికే ఉన్నాయి. అయినప్పటికీ ఈ వారం మరో 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. గతవారం విడుదలైన ఆర్డీఎక్స్ లవ్, చాణక్య సినిమాలు క్లిక్ అవ్వకపోవడంతో.. ఈవారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలపై అందరి ఫోకస్ పడింది

ఈవారం థియేటర్లలోకి వస్తున్న సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. చాన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి, ఎట్టకేలకు రేపు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు ఈ సినిమాని. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను అడివి సాయికిరణ్ తెరకెక్కించాడు. రైటర్ అబ్బూరి రవి ఈ సినిమాలో విలన్ గా నటించగా, నటుడు మనోజ్ నందం
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. నిత్యానరేష్, సాషా ఛత్రి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కశ్మీర్ పండిట్లు, ఉగ్రవాదం నేపథ్యంలో సాగుతుంది.

ఆది సినిమాకు పోటీగా ముస్తాబైంది రాజుగారి గది3. అన్నీ తానై ఓంకార్ తీసిన ఈ సినిమాతో అవికా గౌర్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెకిది రీఎంట్రీ మూవీ లాంటిది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఓంకార్ నిర్మించిన ఈ సినిమాలో అతడి తమ్ముడు అశ్విన్ బాబు హీరో. గతంలో వచ్చిన రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో ఈ తాజా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం టైటిల్ ను మాత్రమే రిపీట్ చేశాడు ఓంకార్. కథను కాదు.

ఈ రెండు సినిమాలతో పాటు కృష్ణారావు సూపర్ మార్కెట్, మళ్లీ మళ్లీ చూశా, సరోవరం అనే 3 చిన్న సినిమాలు కూడా శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. కృష్ణారావు సూపర్ మార్కెట్ తో కమెడియన్ గౌతంరాజు కొడుకు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. మళ్లీ మళ్లీ చూశా సినిమాతో అనురాగ్ కొణెదల హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఓ గ్రామంలో జరిగిన కథతో సరోవరం సినిమా వస్తోంది.