వీకెండ్ రిలీజ్

Wednesday,September 04,2019 - 05:00 by Z_CLU

ఓవైపు సాహో హవా కొనసాగుతున్నప్పటికీ ఈ వీకెండ్ కొన్ని సినిమాలు థియేటర్లలోకి రావడానికి ఉబలాటపడుతున్నాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో 5
స్ట్రయిట్ మూవీస్ అయితే, 2 డబ్బింగ్ సినిమాలు. వీటన్నింటిలో కాస్తోకూస్తో ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా జోడీ మాత్రమే.

ఆది సాయికుమార్, శ్రద్ధాశ్రీనాద్ జంటగా నటించిన లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. విశ్వనాథ్ అరిగెల డైరక్ట్ చేసిన ఈ సినిమాకు ఫణికల్యాణ్ మ్యూజిక్ ఇచ్చాడు. 2 పాటలు ఆల్రెడీ హిట్ అవ్వడం, ట్రయిలర్ క్లిక్ అవ్వడం సినిమాకు కలిసొచ్చే అంశం. వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న ఆది సాయికుమార్, ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఇక టైటిల్ సాంగ్ తో ఆకట్టుకున్న మూవీ ఉండిపోరాదె. చాలామంది ఈ సాంగ్ ను రింగ్ టోన్స్ గా కూడా పెట్టుకున్నారంటే పాట ఎంత హిట్ అయిందో అర్థంచేసుకోవచ్చు. తరుణ్ తేజ్, లావణ్య జంటగా నటించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పై నమ్మకంతో 3 భాషల్లో దీన్ని నిర్మించడం విశేషం. నవీన్ నాయని ఈ సినిమాను డైరక్ట్ చేశాడు.

ఈ రెండు సినిమాలతో పాటు దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం అనే మరో 3 స్ట్రయిట్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో దర్పణం సినిమా తెరకెక్కగా.. 2 గంటల్లో జరిగే ప్రేమ ప్రయాణంగా 2 అవర్స్ లవ్ సినిమా వస్తోంది. ఇక ఈ తరం ప్రేమకథగా వస్తోంది నీకోసం సినిమా.

ఈ వీకెండ్ డబ్బింగ్ సినిమాల్లో ముందుగా చెప్పుకోదగ్గది వీడే సరైనోడు మూవీ. నయనతార ఇందులో హీరోయిన్ గా నటించింది. జీవా హీరో. అర్బన్, రూరల్ బ్యాక్ డ్రాప్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు నయనతారే మెయిన్ ఎట్రాక్షన్.

ఇక థియేటర్లలోకి వస్తున్న మరో డబ్బింగ్ మూవీ తారామణి. అంజలి, ఆండ్రియా, వసంత్ రవి మెయిన్ లీడ్స్ పోషించిన ఈ సినిమా, ఈ కాలంలో సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని చర్చిస్తుంది.