రేపే రామ్ సినిమా ఆడియో రిలీజ్

Wednesday,October 11,2017 - 11:02 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ రేపు (13-10-2017) గ్రాండ్ గా జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సినిమా పాటల విడుదల వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను రేపు సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. రామ్-దేవిశ్రీ కాంబోలో ఇది ఐదో సినిమా కావడం విశేషం. గతంలో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల, దేవిశ్రీ కాంబినేషన్ లో నేను శైలజ సినిమా వచ్చింది. అందులో పాటలన్నీ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “కాంపౌడ్ వాల్” అనే లిరిక్స్ తో సాగే సాంగ్ అయితే.. అత్యథిక మంచి వీక్షించిన తెలుగు పాటగా యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. మళ్లీ ఈ కాంబినేషన్ లో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా వస్తోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటలు విడదలయ్యాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. ‘ట్రెండ్‌ మారినా… ఫ్రెండ్‌ మారడు’ అనే పాట స్నేహితులు పాడుకునే కొత్త పాటగా ట్రెండ్‌ సృష్టిస్తే… ‘వాట్‌ అమ్మా… వాట్‌ ఈజ్‌ థిస్‌ అమ్మా’ అనే పాట ప్రేక్షకుల చేత ‘సూపరమ్మా..’ అన్పించుకుంది. ఇప్పుడీ రెండు పాటల్ని ప్రేక్షకులు హమ్‌ చేస్తున్నారు. వీటితో పాటు మిగతా పాటల్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు.

ప్రేమ, స్నేహం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాక్ స్టార్ అభిరామ్ పాత్రలో కనిపించనున్నాడు రామ్. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ సాధించడంతో పాటు లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది ఉన్నది ఒకటే జిందగీ మూవీ.