'విశ్వక్ సేన్' ఇంటర్వ్యూ

Thursday,May 30,2019 - 02:40 by Z_CLU

‘వెళ్ళిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’, సినిమాల్లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ మూడో సినిమా ‘ఫలక్ నుమా దాస్’ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా విశ్వక్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే…

 

రెండు కళ్ళు లాంటివి

హీరో అవ్వకముందే ఫిలిం మేకింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ముందుగా అనిమేషన్ కోర్స్ చేసాను. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. యాక్టింగ్ , డైరెక్షన్ నాకు రెండు కళ్ళు. ఏది ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేను. రెండిటిలో ఉన్నత స్థాయికి చేరాలనుంది. అదే నా టార్గెట్.

 

రీజన్ అదే

‘అంగమలై డైరీస్’ అనే మళయాళ సినిమా చూసాక తెలుగులో మన నేటివిటీ కి తగ్గట్టు రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందనిపించింది. పైగా అందులో క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూసే క్యారెక్టర్స్ లాగే అనిపించాయి. ఆ సినిమాలో ‘అంగమలై’ అనే ఊరిని చూపిస్తూ కథ రన్ చేసారు. అక్కడితో పోలిస్తే మన హైదరాబాద్ సిటీలో ఎన్నో కలర్ ఫుల్ ప్లేసెస్, మంచి ఆర్కిటెక్చర్ ప్లేసెస్ ఉన్నాయి. అందుకే అంగమలై డైరీస్ ని రీమేక్ సినిమాను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ఈరోజు ‘ఫలక్ నుమా దాస్’ గా తీసుకొచ్చాను.


ఎమోషనల్ ఫిలిం

టీజర్, ట్రైలర్ చూసి సినిమా అంతా గొడవలతో గోలగోలగా ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ ఇందులో ఒక కోర్ ఎమోషన్ ఉంటుంది. మదర్ , ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ తో పాటు ఫ్రెండ్షిప్ లో ఉండే ఎమోషన్ ని హైలైట్ చేసి చూపించాను. సెకండ్ హాఫ్ అంతా రిలేషన్షిప్ తో ఎమోషనల్ గా ఉంటుంది.

‘ఫలక్ నుమా దాస్’ కి బ్రేక్ ఇచ్చి

‘ఫలక్ నుమా దాస్’ షూటింగ్ ఇంకో ఇరవై రోజులుందనగా తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ కథ చెప్పాడు. ఆ కథ బాగా నచ్చింది. పైగా తరుణ్ భాస్కర్ పిలిస్తే ఆగేదే లేదు. అందుకే నా సినిమాకు బ్రేక్ ఇచ్చి ఆ సినిమా కంప్లీట్ చేసాను.

 

 

ఊహకందని సినిమా…

సినిమాలో నెక్స్ట్ ఏంటనేది ఎవరూ ఊహించలేరు. ఎంత మేధాశక్తి వాడినా సినిమా ఊహకందదు. ప్రతీ సీన్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది.

ఎంకరేజ్ చేయలేదు

ఈ సినిమా కథతో చాలా ప్రొడక్షన్ ఆఫీసులకి తిరిగాను. ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. సినిమా పూర్తి చేసి టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక వాళ్ళే సినిమా రైట్స్ కోసం కాల్ చేసారు.

ప్రొడక్షనే కష్టం

నటించడం , డైరెక్ట్ చేయడం కంటే ప్రోడక్షనే కష్టమనిపించింది. నిర్మాణం అనేది ఆశా మాషి వ్యవహారం కాదు. రిలీజ్ వరకూ టెన్షనే. దిగాక తప్పదు కదా అనుకుంటూ ముందుకెళ్ళాను.

ఆప్ట్ క్యారెక్టర్ 

తరుణ్ భాస్కర్ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు. ఆ నమ్మకం ఉంది. ఆయన చాలా మంచి యాక్టర్. అందుకే ఇందులో ఎస్.ఐ బీ.టి.సైదులు అనే క్యారెక్టర్ చేయించాను. ఆయనకి ఆప్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది.


నా కోసమే వదిలారేమో

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంచి లోకేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆ లోకేషన్స్ ని పూర్తిగా ఎవరూ చూపించలేదు. నిజానికి నా కోసమే వదిలారేమో అనిపించింది. ఆ లోకేషన్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి.

ఆలోచన మార్చుకున్నాను

ఒకప్పుడు సినిమా డైలాగ్స్ అంటే… అచ్చ తెలుగులో ఉండాలని, మనం మాట్లాడే భాష కాకుండా పేపర్ లో వచ్చే పదాలు వాడాలని అంటుండే వాళ్ళు. నేను కూడా అలాగే ఆలోచించే వాణ్ణి. అయితే ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం చూసాక నా ఆలోచన మార్చుకున్నాను. మనం మాట్లాడే పదాలతోనే డైలాగ్స్ ఉంటే కంటెంట్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుందని గ్రహించాను.

సెన్సార్ .. నో కట్స్

సెన్సార్ బోర్డ్ సినిమాకి ఎలాంటి కట్స్ ఇవ్వలేదు. కానీ కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయమన్నారు. డైలాగ్స్ మ్యూట్ చేయడం వల్ల సినిమా ఏం మారిపోదు కదా.

ఆ నమ్మకంతోనే

సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. అసలు రెడీ అయిన వెంటనే అందరికీ చూపించేయాలనిపించింది. అంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను. అందుకే ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేసాం. ముందుగా పది థియేటర్స్ అనుకున్నాం. కానీ ఆ సఖ్య ముప్పై దాటింది. వరంగల్ టూర్ లో రెండు థియేటర్స్ లో ప్రీమియర్ ఉంటుందని అక్కడే అనౌన్స్ చేసి వేరే ప్లేస్ కి వెళ్ళే లోపే బుకింగ్స్ అయిపోయాయి. సినిమాకి అంత క్రేజ్ ఉంది. హైదరాబాద్ ఐమ్యాక్స్ లో దాదాపు అన్ని స్క్రీనింగ్స్ లో ఈ రోజు ప్రీమియర్స్ ఉన్నాయి. చాలా హ్యాపీ గా ఉంది. ఈరోజు రాత్రికే సూపర్ హిట్ టాక్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నా.

అనౌన్స్ మెంట్… ఆన్ ది వే

నాని గారి బ్యానర్ లో శైలేష్ అనే డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఉంటుంది.

టైం తీసుకుంటా

డైరెక్షన్ కి కొన్ని నెలలు బ్రేక్.. ప్రస్తుతం ఫోకస్ అంతా యాక్టింగ్ మీదే. కార్టూన్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాను. దానితో పాటు నాని ప్రొడక్షన్ లో ఇంకో సినిమా ఉంది. వాటి తర్వాత నా డైరెక్షన్ లో మళ్ళీ ఓ సినిమా చేసుకుంటాను. ఎటులేదన్నా దాదాపు ఏడాది పైనే టైం పడుతుంది.