సక్సెస్ ఫుల్ టాలీవుడ్ ఫార్ములా

Wednesday,April 18,2018 - 10:09 by Z_CLU

ఈ మధ్య పల్లెటూరి కథలతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ సాదిస్తూ పల్లెటూరి కథలా మజాకా..అనిపించుకుంటున్నాయి. అప్పట్లో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో విజయాలు సాదించిన తెలుగు సినిమాలెన్నో… అయితే మధ్యలో కొన్నేళ్ళు ఈ జానర్ సినిమాలు తగ్గాయి. ఈ హైటెక్ కాలంలో పల్లెటూరి కథలు కమర్షియల్ గా వర్కౌట్ అవుతాయా..? అనే సందేహంతో చాలా మంది ఈ బ్యాక్ డ్రాప్ ను పక్కన పెట్టేసారు. అయితే పల్లెటూరి కథలకు మళ్ళీఊపొచ్చింది. పల్లె అందాలతో కట్టిపడేసే కథ రాసుకుంటే హిట్ గ్యారెంటీ అని ప్రూవ్ చేస్తున్నాయి చాలా సినిమాలు.

ఈ తరహా చిత్రాలకు ఆద్యం పోశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్తబంగారు లోకం’ అనే టైటిల్ తో పల్లెటూరి యాసను, కట్టుబాట్లను మళ్లీ పరిచయం చేసి దానికి అందమైన ప్రేమకథను జోడించి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ లవ్ అయినప్పటికీ.. బ్యాక్ డ్రాప్ మొత్తం పల్లె వాతావరణం కనిపిస్తుంది


ఆ తర్వాత ఇదే దర్శకుడు మహేష్,వెంకటేష్ వంటి స్టార్స్ ను సైతం పల్లెటూరికి రప్పించాడు. అప్పటివరకు ఎవరూ ఊహించిన మల్టీస్టారర్ సెటప్ కు విలేజ్ బ్యాక్ డ్రాప్ సెట్ చేశాడు. ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లెచెట్టు అంటూ అందమైన కుటుంబకథా చిత్రాన్ని అందించాడు.

శ్రీకాంత్ అడ్డాల తర్వాత ‘ఉయ్యాల జంపాల’ అంటూ విరించి వర్మ…’సోగ్గాడే చిన్ని నాయన’ అంటూ కళ్యాణ్ కృష్ణ కూడా థియేటర్స్ లో బాగానే సందడి చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఉయ్యాల జంపాల సినిమాలో మచ్చుకైనా సిటీ వాసనలు కనిపించవు. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో అయితే పల్లెటూరి వాతావరణం మొత్తం కనిపిస్తుంది.

ఇక 2017 లో సంక్రాంతి సినిమాగా థియేటర్స్ లో కొచ్చిన అచ్చ తెలుగు పల్లెటూరి సినిమా ‘శతమానం భవతి’ మళ్లీ కుటుంబాలను థియేటర్స్ కి క్యూ కట్టించి చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకుంది. నిజానికి పల్లెటూరి కుటుంబ కథా సినిమాలు కనుమరుగు అవుతున్న సమయంలో మంచి కథ-కథనంతో మనసులకు హత్తుకునే సన్నివేశాలతో కన్నులకు పండుగ తీసుకోచ్చాడు సతీష్ వేగేశ్న. సంక్రాంతి కి పర్ఫెక్ట్ సినిమా..అంటే ఎన్నేళ్లయినా ‘శతమానం భవతి’ పేరే వినిపిస్తుంది. థియేటర్ లోనే కాదు ఈ సినిమా టీవీలోనూ పెద్ద హిట్టే. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా రేటింగ్ అందుకున్న సినిమా ఇది.

‘శతమానం భవతి’ తర్వాత పల్లెటూరి కథలకు మళ్లీ గ్యాప్ వచ్చేలా ఉందనుకుంటున్న టైమ్ లో వచ్చింది ‘ఫిదా’. తెలంగాణ పల్లెను అత్యద్భుతంగా చూపిస్తూ, శేఖర్ కమ్ముల ఆవిష్కరించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అందర్నీ మరోసారి పల్లెల్లోకి తీసుకెళ్లిపోయింది.

స్టార్ హీరోలు కూడా పల్లెటూరి కథతో అక్కడి క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తే బాగుంటుంది అంటూ ప్రేక్షకులు మనసులో అనుకుంటుండగానే సుకుమార్ ఆ ఆలోచనకి రూపం ఇచ్చాడు. ‘రంగస్థలం’ అనే బ్రహ్మాండమైన సినిమాను అందించాడు. కేవలం ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ మాత్రమే కాదు.. 80ల నాటి పల్లెల్ని చూపించారు ఈ సినిమాలో.పల్లెటూరి వ్యక్తులు, పల్లెటూరి భాష, పల్లెటూరి జీవన విధానం.. ఇలా రంగస్థలం మొత్తం ఓ విజువల్ ఫీస్ట్.

ఈ జానర్ లో ఎన్ని సినిమాలోచ్చినా మంచి కథ -కథనం పాత్రలతో అలరిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది రంగస్థలం. పల్లె వాతావరణం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి మరెన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ రావాలని మనసారా కోరుకుందాం.