'విజయేంద్ర ప్రసాద్' ఇంటర్వ్యూ

Sunday,October 22,2017 - 12:04 by Z_CLU

‘భజ్రంగీ భాయిజాన్’, ‘బాహుబలి’ వంటి భారీ సినిమాలతో రచయితగా తన  సత్తా చాటుకున్న విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ గా విజయ్ నటించిన ‘అదిరింది’ సినిమాకు పనిచేశారు. దీపావళి కానుకగా ఇటీవలే తమిళ్లో విడుదలై గ్రాండ్ హిట్ అందుకున్న ఈ సినిమా త్వరలోనే తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

కథ అతనిదే.. స్క్రీన్ -ప్లే మాత్రమే నాది..

దర్శకుడు అట్లీ.. నన్ను కలిసి ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగే అన్యాయాల గురించి కథ చెప్పాడు. ఆ స్క్రిప్ట్ కి నన్ను స్క్రీన్ ప్లే రాయమని అడిగాడు. వెంటనే ఓకే అని చెప్పి తన కథకి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. సినిమా కథ అతనిదే..నేను స్క్రీన్ ప్లే మాత్రమే రాశాను.

 

పాత కథే .. కానీ

కథ కొత్తదేం కాదు… పాతదే.. ఇప్పటికే మన సినిమాల్లో చూసిన కథే ఇది..కానీ సినిమా చూస్తే అదంతా పట్టించుకోకుండా అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం  అందరికీ జరుగుతున్న సమస్యే ఇది. ఈ మధ్యే  నాకు తెలిసిన వాళ్ళు కూడా ప్రయివేట్ హాస్పిటల్స్ వల్ల నష్టపోయామని చెప్తుంటే జాలి కలిగింది.

 

చాలా హ్యాపీ 

దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తమిళ్ లో పెద్ద విజయం సాధించడం రచయితగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ విజయంలో నేను కూడా ఒక భాగం అవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రెస్పాన్స్ ముందే ఊహించాం. విజయ్ మూడు పాత్రలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు.

 

 

అదంతా సినిమాకు ప్రమోషనే

సినిమా చూడొద్దని తమిళనాడులో కొందరు హాస్పిటల్స్ యాజమాన్యం ప్రచారం చేస్తున్నారని విన్నాను. నిజానికి ఈ సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఎన్నొచ్చిన అదంతా సినిమాకు ప్రమోషన్ అవుతుందే కానీ ఇంకేం ఉండదు.

 

 

మళ్ళీ అతనితో పనిచేస్తా

అట్లీ తో పని చేయడం కొత్త అనుభూతి కలిగించింది. శంకర్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం బాగా కనిపించింది. అతనిలో తన గురువు శంకర్ లో ఉండే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయని అనిపించింది. సినిమా అంటే చాలా ఇంటరెస్ట్ ఉన్న దర్శకుడు. తన ఆలోచన విధానం మేకింగ్ బాగా నచ్చాయి. త్వరలోనే మళ్ళీ మనం పని చేద్దాం సార్ అంటూ చెప్పాడు. కచ్చితంగా అతనితో మళ్ళీ పనిచేస్తా.

 

 

ఇక్కడ కూడా అదే రేంజ్

మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది టైటిల్ తో త్వరలోనే రిలీజ్ కానుంది. అక్కడ గ్రాండ్ హిట్ సాధించి నట్లే ఇక్కడ కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. విజయ్ కి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోయినా కంటెంట్ కి బాగా కనెక్ట్ అవుతారని ఈ సినిమా నుంచి ఇక్కడ కూడా విజయ్ కి మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నాను.

 

రాజమౌళి ఆ టైపు కాదు

బాహుబలి తో గ్రాండ్ హిట్ అందుకున్నాం.. కదా వెంటనే ఇంకో సినిమా చేసేయ్యాలి అనుకునే వ్యక్తిత్వం కాదు రాజమౌళి ది. పరిగెత్తి పాలు తాగే టైప్ అస్సలు కాదు. ఆలస్యం అయినా పరవాలేదు కాని తనను బాగా ఎగ్జైట్ చేసే కథతోనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలనుకుంటాడు. తన ప్రతీ సినిమాకు అదే పాటిస్తూ సినిమాలు చేస్తున్నాడు. తదుపరి సినిమాకు ఇంకా ఎలాంటి కథ అనుకోలేదు. ప్రస్తుతం తనను ఎగ్జైట్ చేసే కథను రెడీ చేసే పనిలో ఉన్నా.

 

విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా…

ఆ హీరో..ఈ హీరో అని చెప్పకుండా ఒక ఎగైట్ మెంట్ ఉండే పక్కా కమర్షియల్ కథ కావాలని చెప్పాడు. అంతే కాదు విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథను రెడీ చేయమని కండీషన్ పెట్టాడు.  సీజీ తో ఏ మాత్రం పని కూడా లేకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు ఎలాంటి కథ రాయాలో తెలియడం లేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నా…చూడాలి ఎలాంటి కథ పుట్టుకొస్తుందో.

 

నెక్స్ట్ ప్రాజెక్స్ట్

ప్రస్తుతానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘మణి కర్ణిక’ సినిమాకు పనిచేస్తున్నా.. అలాగే మరో రెండు హిందీ సినిమాలకు బయోపిక్ లు రాస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నా. త్వరలోనే ఆ సినిమాల వివరాలు తెలియజేస్తా.