విజయ నిర్మల కన్నుమూత

Thursday,June 27,2019 - 08:39 by Z_CLU

ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల కన్నుమూశారు. నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో గుండెపోటుతో మృతిచెందారు విజయనిర్మల. ఆమె వయసు 73
సంవత్సరాలు.


తమిళనాడులో జన్మించిన విజయనిర్మల.. ఏడేళ్లకే వెండితెరపైకొచ్చారు. తమిళ్ లో మత్స్యరేఖ అనే సినిమా చేశారు. తర్వాత 11 ఏళ్లకు టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పాండురంగ మహత్యం సినిమాలో బాలకృష్ణుడు వేషంలో మెప్పించారు. అప్పటికే ఆమె క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు.


అలా బాలనటిగా ఇండస్ట్రీకొచ్చిన విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. అన్ని భాషల్లో ఆమెకు విజయాలున్నాయి. తెలుగులో ఎక్కువ. కృష్ణతోనే ఆమె ఏకంగా 47 సినిమాలు చేశారు. అందులో సగానికి పైగా హిట్స్.


సాక్షి సినిమా టైమ్ లో తొలిసారిగా కలిశారు విజయనిర్మల-కృష్ణ. ఆ టైమ్ లోనే వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ కొనసాగించారు విజయ నిర్మల. ఇంకా చెప్పాలంటే నటిగా మాత్రమే కాకుండా… నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణించారు.


తన సొంత బ్యానర్ పై 15కు పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేసిన విజయనిర్మల, మెగాఫోన్ పట్టుకొని 44 సినిమాలు డైరక్ట్ చేశారు. అత్యథిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కారు.