విజయ్ ఆంటోని ఇంటర్వ్యూ

Tuesday,June 04,2019 - 04:02 by Z_CLU

సరికొత్త కథలతో వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా దూసుకెళ్తున్న విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7 థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

ఫోకస్ నటన మీదే

కిల్లర్ సినిమాకు నేను సంగీతాన్ని అందించ‌లేదు. సైమ‌న్ కింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యాక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. మంచి టీం కుదిరింది. మూడేళ్ల వ‌ర‌కు నేను నా సినిమాల‌కు సంగీతం అందించకూడదని డిసైడ్ అయ్యాను. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడం, న‌ట‌న‌ మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటున్నాను.

 

స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది

సినిమాలో స్క్రీన్‌ప్లే అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. జెనరల్ గా ఏ సినిమా చేసినా పూర్తి స్క్రిప్ట్ విన‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ ఇస్తాను. ఈ సినిమాలో నేను కిల్ల‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. అర్జున్‌ గారు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించారు. స్క్రీన్‌ప్లే సినిమాకు హైలైట్‌. కచ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేసేలా ఉంటుంది.

 

సినిమా చూడాల్సిందే

సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిందని భావిస్తున్నాను. సినిమాలో నేను ఎందుకు వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటాను? అసలు నేను మ‌ంచి వాడినా…? చెడ్డ‌వాడినా..? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈసారి డిసపాయింట్ చేయనని అనుకుంటున్నాను.

 

ఆయనొక లెజెండ్

నేను గొప్ప న‌టుడ్ని కాను. న‌ట‌న‌తో నా వంతుగా నేను ఏదో ప్ర‌య‌త్నం చేస్తున్నాను. అయితే అర్జున్‌గారు సెటిల్డ్ యాక్ట‌ర్‌. ఆయ‌న న‌ట‌న‌ను చూస్తూ ఉండిపోయేవాడిని. నటనలో ఆయనొక లెజెండ్.

 

ఈసారి… నో మెసేజ్

ఇంత‌కు ముందు నేను చేసిన కొన్ని చిత్రాల్లో మంచి మెసేజ్ ఉంది. కానీ సినిమా మాత్రం క‌మ‌ర్షియ‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. కుటుంబంతో క‌లిసి చూసేలా ఉంటుంది. ఎలాంటి మెసేజ్‌ను ఈ సినిమాలో ఇవ్వ‌లేదు.

 

 బయట బ్యానర్స్ లోనే

తదుప‌రి సినిమా `ఖాకి`(త‌మిళం). ఈ టైటిల్‌తో తెలుగులో రీసెంట్‌గా ఓ మూవీ వ‌చ్చింది కాబ‌ట్టి.. తెలుగు టైటిల్ మారే అవ‌కాశాలున్నాయి. అలాగే అరుణ్ విజ‌య్‌తో క‌లిసి `జ్వాలా` అనే సినిమా కూడా చేస్తున్నాను. ఇందులో జ‌గ‌ప‌తిబాబుగారు, ప్రకాష్‌రాజ్ న‌టిస్తున్నారు. ఇవి కాకుండా ఓ ప‌ది సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అన్నీ బయట బ్యానర్స్ లోనే చేస్తున్నాను.

 

తెలుగు నేర్చుకున్నాకే

స్ట్ర‌యిట్ సినిమాను త్వ‌ర‌లోనే చేయాల‌నుకుంటున్నాను. కానీ ముందుగా నేను తెలుగు నేర్చుకోవాలి. పూర్తిగా నేర్చుకున్నాకే తెలుగులో సినిమా చేస్తాను.