గాన గంధర్వుడు బాలు మనకిక లేరు

Friday,September 25,2020 - 01:49 by Z_CLU

ఒక శకం ముగిసింది.. భారతీయ సినీగొంతుక మూగబోయింది.. లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం 1.04కు తుదిశ్వాస విడిచినట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించాడు.

ఆగస్ట్ 5న కరోనా బారిన పడ్డారు బాలసుబ్రమణ్యం. ఆ విషయాన్ని తనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వెంటనే చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పట్నుంటి హాస్పిటల్ లోనే ఉంటున్న బాలు.. ఈనెల 7న కరోనా నుంచి కోలుకున్నారు.

కొవిడ్ టెస్టుల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అయితే అప్పటికే ఆయన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నెగెటివ్ వచ్చినప్పటికీ ఎక్మో లైఫ్ సపోర్ట్ తోనే ఆయన ఉన్నారు. ఈ క్రమంలో ఆయన లేచి కూర్చోవడం, నోటితో ఆహారం తీసుకోవడం లాంటివి కూడా చేశారు.

అంతా బాగుంది, క్రమంగా కోలుకుంటున్నారనే టైమ్ కు మరోసారి ఆయన ఆరోగ్యం విషమించింది. పరిస్థితి చేయి దాటిపోయిందంటూ వైద్యులు నిన్ననే ప్రకటించగా.. ఈరోజు బాలు మనందర్నీ వీడి వెళ్లిపోయారు.