ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Wednesday,September 25,2019 - 03:39 by Z_CLU

టాలీవుడ్ మరో హాస్యనటుడ్ని కోల్పోయింది. వేణుమాధవ్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ కమెడియన్, సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారు. టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ, అందరికంటే భిన్నంగా తెలుగుతెరపై తనదైన ముద్ర వేయగలిగారు వేణుమాధవ్

వేణుమాధవ్‌ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ. 1997లో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఆ సినిమాలో గుక్కతిప్పుకోకుండా వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ హైలెట్.

తొలిప్రేమ నుంచి వేణుమాధవ్ హవా పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఒక దశలో ఆయన హీరో రేంజ్ కు కూడా ఎదిగాడు. హీరోగా సినిమాలు కూడా చేశారు. అలా చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన వేణుమాధవ్, టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. ‘లక్ష్మి’ చిత్రంలో చేసిన కామెడీకి వేణు మాధవ్‌కు ఏకంగా నంది అవార్డు వచ్చింది.

ఎస్వీ కృష్ణారెడ్డి… ‘హంగామా’తో వేణుమాధవ్ ను హీరోను చేశారు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో కూడా హీరోగా నటించారు వేణుమాధవ్. ‘ప్రేమాభిషేకం’ చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. తనకు సినిమా అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అంటే వేణుమాధవ్ కు ప్రాణం. అందుకే తన ఇంటికి “అచ్చి” వచ్చిన “కృష్ణ” నిలయం అని పేరు పెట్టుకున్నారు.

దిల్, ఆర్య, నువ్వే నువ్వే, వెంకీ, ఛత్రపతి సినిమాల్లో వేణుమాధవ్ కామెడీ సూపర్ హిట్ అయింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. విలక్షణమైన డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ మేనరిజమ్స్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు వేణుమాధవ్. అలా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి తెలుగు ప్రజల అభిమాన హాస్యనటుడు స్థాయికి ఎదిగారు వేణుమాధవ్.

వేణుమాధవ్ మనమధ్య లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు నిత్యం మనల్ని నవ్విస్తూనే ఉంటాయి.