వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ

Wednesday,May 24,2017 - 11:00 by Z_CLU

కమెడియన్ గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ వెన్నెల కిషోర్ కు తెలుగు చిత్రసీమలో ఉన్న స్థానం వేరు. కామెడీని మాత్రమే కాక “క్షణం” లాంటి సినిమాలో సీరియస్ గానూ నటించి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు వెన్నల కిషోర్. ఆయన కీలకపాత్ర పోషిస్తున్న తాజా చిత్రం “అమీ తుమీ”. ఆ సినిమాలో ఆయన పాత్ర గురించి, తాజా హిట్ “కేశవ” గురించి వెన్నెల కిషోర్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..!!

కేశవ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను..
మొదట డైరెక్టర్ సుధీర్ వర్మ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ అని చెప్పడంతో ఇక ఆ పాత్రలో కామెడీ ఏం ఉంటుంది అనుకున్నా. కానీ షూటింగ్ టైంలో తెలిసింది అందులో ఎంత ఉందో. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది.

నాది నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్..
“అమీ తుమీ” లో నాది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అడివి శేష్, అవసరాల పాత్రలతో సమానంగా నా పాత్రను రాశారు. ఇందులో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఫన్నీగానే ఉంటాయి.

ఆ రెండ్రోజుల్లో ఏం జరిగిందనేది కీలకాంశం..
రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేదే కథ. పెళ్లి కోసం వచ్చిన నేను అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ ల ప్రేమ కథల మధ్యలోకి ఎలా వెళతాను, ఆ టైమ్ లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది మంచి కామెడీని జనరేట్ చేస్తుంది. స్టోరీ పరంగా చూస్తే నేను విలన్.

హీరోలతో తీసిపోని పాత్ర నాది..
అవును. కథలో వాళ్లకెంత ప్రాముఖ్యత ఉంటుందో నాకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళతో పోటా పోటీగా నటించే స్కోప్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకెన్ని సన్నివేశాలుంటాయో నాక్కూడా అన్నే ఉంటాయి.

సరికొత్త కామెడీ జోనర్..
ఇంతకు ముందు చేసిన సినిమాల్లోకి ఈ సినిమాలోకి తేడా ఉంటుంది. నా క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళిందంటే మాత్రం అది పూర్తిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి క్రెడిటే.

ఇంద్రగంటి గారితో చాలా ఈజీ..
ఫస్ట్ టైమ్ ఆయనతో “జెంటిల్మెన్” సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. సినిమాకి కొన్ని రోజుల ముందే అయన పూర్తి స్క్రిప్ట్ తో సహా మాకిచ్చేశారు. మేము కూడా ముందుగానే ప్రాక్టీస్ చేశాం. దాంతో షూటింగ్ స్పాట్ కు వెళ్ళాక కెమెరా ముందు పెద్ద కష్టమనిపించలేదు. ఆయనతో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది.

నేను జై కొట్టిన వారి పక్కనే నటిస్తున్నాను..
అవును పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పటికే 150 సినిమాల దాకా చేశాను. ఒక్కోసారి సాదించాల్సిన పేరుకంటే ఎక్కువే వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు థియేటర్లలో ఏ హీరోలకైతే విజిల్స్ వేశానో ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది.

ఆ ప్రయత్నం మాత్రం పొరపాటున కూడా చేయను..
అబ్బే అస్సలు లేవు. ఎందుకంటే నేనసలు హీరోగానే సెట్టవ్వను. ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు పిలిచి కామెడీ బాగా చేస్తున్నావ్. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు అన్నారు. నేను కూడా అస్సలు చేయనని ఒట్టేశాను!