వెంకటేష్ విక్టరీకి 15 ఏళ్లు

Wednesday,July 11,2018 - 01:34 by Z_CLU

విక్టరీ అంటే వెంకీ.. వెంకీ అంటే విక్టరీ.. ఒకప్పుడు వెంకటేష్ సినిమా చేస్తే సూపర్ హిట్. అలాంటి టైమ్ లో వచ్చిన సినిమా వసంతం. ఏమాత్రం ఆలస్యం లేకుండా విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. 2003లో సరిగ్గా ఇదే రోజు (జులై 11)న విడుదలై 15 ఏళ్లు పూర్తిచేసుకుంది వసంతం.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఇలా అన్నీ తానై విక్రమన్ తెరకెక్కించిన ఈ సినిమా 2003లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ ఏడాది దాదాపు 167 సినిమాలు విడుదలైతే.. అన్నింటిలో వసూళ్ల పరంగా, సక్సెస్ పరంగా వసంతం సినిమానే నంబర్ వన్.

తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కి, ఒకే రోజు విడుదలైంది ఈ సినిమా. తమిళ వెర్షన్ లో మాధవన్ హీరోగా నటించాడు. అక్కడ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. రెండు వెర్షన్లకు ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం అందించగా.. తెలుగు-తమిళ్ లో వసంతం పాటలు మారుమోగిపోయాయి. ఇప్పటికీ ఈ పాటలకు అభిమానులున్నారు.

ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడు. వెంకీ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి లక్ష్మణ్ ఇందులో నటించాడు. ఏపీలో ఈ సినిమా 139 సెంటర్లలో 50 రోజులాడింది. ఏకంగా 71 సెంటర్లలో వంద రోజులాడింది. బి, సి సెంటర్లలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్. అంతేకాదు.. ఈ సినిమాకు 2 నంది అవార్డులు కూడా వచ్చాయి.