వెంకటేష్ ఇంటర్వ్యూ
Thursday,December 12,2019 - 04:23 by Z_CLU
రియల్ మామా అల్లుళ్ళు… వెంకీ, చైతు కలిసి చేసిన సినిమా ‘వెంకీమామ’. డిసెంబర్ 13 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమా అనుభవాలనే కాదు, తన మేనల్లుడి గురించి తెలుసుకున్న విషయాలు కూడా మీడియాతో షేర్ చేసుకున్నారు. అవి మీకోసం…
నాన్నగారి కోరిక…
నాన్నగారికి ఈ కోరిక చాలా ఉండేది. నేను.. చైతు కానీ నేను, రానా కానీ.. లేకపోతే అందరూ కలిసి ఓ సినిమా చేయాలని. ఆయన ఉన్నప్పుడు కథలు కుదరలేదు. ఇపుడు కలిసి వచ్చింది. సినిమాలో ఒక ఎమోషనల్ ఆంగిలే కాకుండా, సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతున్నాయి.
ఈ మధ్య రాలేదు…
ఈ మధ్య ఇలా మామా, అల్లుళ్ళ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాలేదు. అది కూడా ‘వెంకీమామ’ కి కలిసొచ్చిందనే చెప్పాలి.
అన్నీ గుర్తున్నాయి…
చిన్నప్పుడు చైతు చాలా బొద్దుగా ఉండేవాడు. ఇంట్లో అందరం తనని ఎత్తుకోవడానికి, హగ్ చేసుకోవడానికి గొడవపడేవాళ్ళం. అలాంటిది వాడిప్పుడు ఇంత పెద్దవాడైపోయాడు. సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేశామన్నది నిజంగా అద్భుతమైన ఫీలింగ్.
అది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం…
మన తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని నటుడిగా ఆక్సెప్ట్ చేశారంటే ఎప్పటికీ ఆ అభిమానం చూపిస్తూనే ఉంటారు. అందుకే నేను ‘కలియుగపాండవులు’ తరవాత ఒకవేళ హిట్స్, ఫ్లాప్స్ వచ్చినా ఎప్పుడూ భయపడలేదు. వాళ్ళ అభిమానం దొరకడం నిజంగా నా అదృష్టం.

తెలుసుకుని ప్రయత్నించాలి…
మనం ఏం చేయగలుగుతాం అనేది తెలుసుకుని చేయాలి. అంతేకానీ ఎవరో ఏదో చేస్తున్నారు.. మనం కూడా అదే చేద్దాం అంటే బోల్తా పడతాం. నేను మొదటి నుండి ఇదే ఫార్ములా ఫాలో అవుతా…
అది సినిమాలో ఉంటుంది…
ఒక స్ట్రాంగ్ రిలేషన్ షిప్ ఉంటే.. నిజమైన ప్రేమ ఉంటే.. ఈ జాతకాలు… నమ్మకాలు ఏవీ వాటి ముందు నిలబడవు అనేది ఈ సినిమాలో చెప్పాం. నేను కూడా అదే నమ్ముతా…
అనుభవంతో పాటు సక్సెస్ కూడా
మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించడం అనేది అనుభవం. కానీ ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. చేసేద్దాం అనుకుంటే మా కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో వచ్చేసేది. కానీ ఇది సరైన కథ అనుకునే చేశాం.. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

చైతు గురించి తెలిసింది…
నేను కొంచెం సైలెంట్ గా ఉండే టైపే… చైతు కూడా నాలాగే సైలెంట్ గా ఉంటాడన్న విషయం ఈ సినిమా చేస్తున్నప్పుడే తెలిసింది. నేనే చెప్పిన టైమ్ కి కొద్దో గొప్పో ముందుండాలి అని ట్రై చేస్తుంటా. ఈ విషయంలో చైతు నాకన్నా ఎక్కువ ట్రై చేస్తాడు… నా పోలికలు చాలా ఉన్నాయనిపించింది.
ఎంతసేపు కనిపించామా..? అనవసరం…
సినిమాలో ఎంత స్క్రీన్ టైమ్ ఉంది..? మనం ఎంతసేపు కనిపిస్తాం అన్నది అనవసరం. చేసిన క్యారెక్టర్ కి న్యాయం చేశామా లేదా..? మంచి సినిమా చేశామా లేదా అన్నదే ముఖ్యం. ‘F2’ కూడా అలా అనుకునే చేశా… ఇప్పుడీ వెంకీమామ కూడా అంతే…
చైతు కోసం కేర్…
చైతుకి బెస్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశం కూడా ముందు నుండే ఉంది. అందుకే సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ‘వెంకీమామ’ చైతు కరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది.
చిన్నవాళ్ళతో సినిమా చేయాలి…
33 ఏళ్లవుతుంది సినిమాలు చేస్తూ… ఇంకా అచీవ్ చేయడానికి ఏమీ లేదు… రీసెంట్ గా వరుణ్ తేజ్ తో చేశాను. ఇప్పుడు చైతుతో.. ఇంకా జూనియర్ NTR, నాని.. ఇలా అందరూ యంగ్ స్టర్స్ తో సినిమా చేయాలి.
అదృష్టంగా ఫీలవుతున్నా…
సినిమా ఫ్యామిలీలో పుట్టడం నిజంగా నా అదృష్టంగా ఫీలవుతున్నాను. మరీ ముఖ్యంగా నాన్నగారి దగ్గరి నుండి నేర్చుకోవడానికి చాలా దొరికింది. ఎప్పుడూ ఆయన చుట్టూరా ఉంటూ కథలు వింటూనే ఉండేవాణ్ణి. సినిమా గురించి తెలుసుకుంటూనే ఉండేవాణ్ణి… ఆయన నేర్పిన క్రమశిక్షణ… ఫ్యామిలీ బాండింగ్.. ఆయన గొప్ప టీచర్ నాకు…

అసురన్ రీమేక్ గురించి…
శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసిగా ఉన్నాడు. బేసిగ్గా హార్డ్ వర్కర్. నేను కూడా ఇంతకు ముందు తనతో పని చేసి ఉన్నాను కాబట్టి మా ఇద్దరికీ మంచి రిలేషన్ షిప్ ఉంది. ‘సీతమ్మ వాకిట్లో.. ‘ తరవాత కూడా ఓ రెండు స్క్రిప్ట్స్ చెప్పాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మా ఇద్దరికీ కుదిరింది.
చాలెంజింగ్ సినిమా…
F2, ఇప్పుడు వెంకీమామ సినిమాల తరవాత ‘ఆసురన్’ చేయడమన్నది మంచి చేంజ్ ఓవర్ అవుతుంది. ఈ సినిమా చేయడం నాకు మరో గొప్ప చాలెంజ్ అనిపించింది.
ఫైనల్ గా ‘వెంకీమామ’ గురించి…
డిసెంబర్ 13 న మీరొక మంచి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడబోతున్నారు. చైతుతో సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేం సినిమా చూసుకున్నప్పుడు మంచి చేశాం అన్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా వల్ల నాన్న కోరిక కూడా తీరింది.