విక్టరీ వెంకటేశ్.. 33 ఏళ్ల కెరీర్

Wednesday,August 14,2019 - 04:09 by Z_CLU

టాలీవుడ్ లో విక్టరీకి కేరాఫ్ అడ్రస్. వరుసగా హిట్స్ కొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా 33 ఏళ్ల కెరీర్ ను కంప్లీట్ చేయడం ఆయనకే సాధ్యం. అతడే వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేశ్. ఈరోజు ఈ సీనియర్ హీరో కెరీర్ లో మరపురాని రోజు. అవును.. విక్టరీ వెంకటేష్ ను అఖిలాంధ్ర ప్రేక్షకులకు పరిచయం చేసిన కలియుగ పాండవులు సినిమా, సరిగ్గా 33 ఏళ్ల కిందట ఇదే రోజు (ఆగస్ట్ 14, 1986) రిలీజైంది.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా మారదామనుకున్న వెంకీ, ఈ సినిమాతో హీరోగా మారిపోయారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకీని మొదటి సినిమాకే సూపర్ హిట్ హీరోగా మార్చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాతోనే ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది.

కలియుగ పాండవులు ఇచ్చిన ఉత్సాహంతో వెంకీకి మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. విలక్షణమైన పాత్రలు మాత్రమే చేయాలని, కెరీర్ స్టార్టింగ్ లోనే నిర్ణయించుకున్న ఈ దగ్గుబాటి హీరో.. ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. విక్టరీ వెంకటేష్ అనే బిరుదు దక్కించుకున్నారు. ఇప్పటికీ వెంకటేష్ ఓ సినిమా చేస్తే అది రికార్డులు సృష్టిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది వచ్చిన ఎఫ్2.

నటించిన తొలి సినిమాతోనే నంది అందుకున్న వెంకీకి అవార్డులు రొటీన్ అయిపోయాయి. తన కెరీర్ లో వెంకటేష్ లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. అయితే అవార్డుల కంటే అభిమానులు, ప్రేక్షకుల కేరింతలే తనకు ఎక్కువ ఉత్సాహాన్నిస్తాయని కొన్ని వందల సార్లు చెప్పి ఉంటారు వెంకీ.

ఇండస్ట్రీకొచ్చి 33 ఏళ్లు పూర్తిచేసుకున్న విక్టరీ వెంకటేశ్.. తన కెరీర్ లో మరిన్ని మైల్ స్టోన్స్ అందుకోవాలని జీ సినిమాలు మనసారా కోరుకుంటోంది.