'విక్టరీ వెంకటేష్' బర్త్ డే స్పెషల్

Thursday,December 13,2018 - 11:00 by Z_CLU

విలక్షణం అంటే విక్టరీ … విక్టరీ అంటే విలక్షణం అనేట్టుగా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసాడు విక్టరీ వెంకటేష్… కెరీర్ ప్రారంభం నుండే రొటీన్ కి బిన్నంగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు… ‘బొబ్బిలి రాజా’ , ‘చంటి’, ‘ధర్మ చక్రం’, ‘కూలీ నెంబర్ 1’ ఇలా ఒకటా రెండా రొటీన్ కి బిన్నంగా వెంకీ చేసిన పాత్రలెన్నో .. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘జీ సినిమాలు’ బర్త్ డే స్పెషల్ స్టోరీ.

వెంకటేష్ కెరీర్ లో మైలు రాయిలాంటి సినిమా ‘చంటి’. ఈ సినిమాలో అమాయకపు చంటి పాత్రలో వెంకీ నటన అద్భుతం. హీరోగా వెంకటేష్ ఎన్ని గొప్ప సినిమాలు చేసినా అందులో చంటి కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అప్పటి వరకూ ఎవరూ చేయలేని ఇన్నోసెంట్  క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేసాడు వెంకీ.


‘బొబ్బిలిరాజా’ సినిమాలో వెంకటేష్ చేసిన రాజా క్యారెక్టర్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో వెంకీ లుక్ మాత్రమే కాదు, నటన , హావ భావాలు అన్నీ రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అంటూ డిఫెరెంట్  మేనరిజంతో వెంకీ చెప్పిన డైలాగ్ ఇన్నేళ్ళయినా ఆడియన్స్ గుర్తుచేసుకుంటారంటే అతిశయోక్తి కాదు.

 

వెంకీ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన సినిమాల్లో ‘సుందరకాండ’ ఒకటి.. ఈ సినిమాలో లెక్చరర్ వెంకటేశ్వర్లు గా వెంకీ హాస్యంతో పాటు సెంటిమెంట్ కూడా పండించి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసాడు.

 

 

టాలీవుడ్ లో రైల్వే కూలీ అనే పదం వింటే చాలు టక్కున గుర్తొచ్చే ఏకైక స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ మాత్రమే.. అప్పటి వరకూ ఏ స్టార్ హీరో టచ్ చేయని రైల్వే కూలీ గా నటించి ప్రేక్షకులను ఆవాక్కయ్యేలా చేసాడు. ఇక మాకంటూ ఓ సినిమా ఉందంటూ రైల్వే కూలీలు ‘కూలీ నంబర్ 1’ సినిమా చెప్పుకుంటూ మురిసిపోతుంటారు.

‘క్షణ క్షణం’ లో చందు అనే క్యారెక్టర్ తో ఆడియన్స్ కి కొత్తగా కనిపించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కొత్త జోనర్ అయినప్పటికీ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో విభిన్నంగా ఎంటర్టైన్ చేసాడు. వర్మ క్రియేట్ చేసిన క్యారెక్టర్ లో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసాడు వెంకీ.

 

వెంకటేష్ ద్వి పాత్రాభినయం చేసిన సినిమాల్లో ‘సూర్య వంశం’ కి అభిమానుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమాలో ఊరి పెద్ద హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.  ఈ సినిమాలో వెంకీ డ్యుయల్ రోల్ చేసినప్పటికీ భాను ప్రసాద్ క్యారెక్టర్ కంటే హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్ నే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు ఫ్యాన్స్.

 

‘ధర్మచక్రంలో’ రాకేశ్ క్యారెక్టర్ వెంకటేష్ అభిమానులకు చాలా ప్రత్యేకం. వెంకటేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన క్యారెక్టర్ ఇది.  సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా, ఆంగ్రీ యంగ్ మెన్ గా వెంకీ పెర్ఫార్మెన్స్ కి  థియేటర్స్ లో క్లాప్స్ కొట్టారంటే ఈ క్యారెక్టర్ వెంకీ కెరీర్ లో ఎలాంటి స్థానం అందుకుందో చెప్పొచ్చు.

 

ఒకానొక టైంలో వెంకీ డ్యుయల్ రోల్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ రెండు పాత్రల్లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటేనే సినిమా సైన్ చేసేవాడు. అలా వెంకీ పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ చేసిన సినిమాల్లో ‘జయం మనదేరా’ ఒకటి. ఈ సినిమాలో ఓ యంగ్ ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తూనే ‘మహదేవ నాయుడు’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ తో స్టోరీకి వెయిట్ పెంచాడు విక్టరీ.

 

‘DCPరామ చంద్ర’ ఈ పేరు చెప్తే చాలు వెంకీ నటించిన సినిమా టక్కున గుర్తొచ్చేస్తుంది. ‘ఘర్షణ’ సినిమాలో పవర్ పోలీసాఫీసర్ గా వెంకీ చేసిన ఈ క్యారెక్టర్ ఎప్పటికీ వెంకీ ఫ్యాన్స్ కి స్పెషల్ గుర్తుండే క్యారెక్టర్.

 

వెంకీ ఫ్రీడం ఫైటర్ గా నటించిన సినిమా ‘సుభాష్ చంద్ర బోస్’.. ఈ సినిమాలో వెంకీ టైటిల్ రోల్ లో నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్రీడం ఫైటర్ గా అందరినీ ఆకట్టుకున్నాడు.

 

తన కెరీర్ లో వెంకీ చేసిన మరో విలక్షణమైన పాత్ర ‘నాగ భైరవ రాజశేఖర’.. నాగవల్లి సినిమాలో వెంకటేష్ చేసిన ఈ పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాడు వెంకీ. లుక్స్ నుండి పెర్ఫార్మెన్స్ వరకూ అన్నీ విభిన్నంగా ఉండేలా చూసుకున్నాడు.

ఈ జెనరేషన్ లో మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఊపు తీసుకొచ్చిన ఘనత వెంకటేష్ కే దక్కుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు కి అన్నయ్య గా పెద్దోడి క్యారెక్టర్ లో వెంకీ పండించిన సెంటిమెంట్ అదుర్స్.. ఇప్పటి జెనెరేషన్ ఆడియన్స్ కి అన్నయ్య రోల్  ఇంతలా కనెక్ట్ అవ్వడానికి వెంకీ పెర్ఫార్మెన్స్ మెయిన్ రీజన్.

 

‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ చేసిన కేబుల్ రాంబాబు పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్ ని తన క్యారెక్టర్ తో గుర్తుచేస్తూ మెస్మరైజ్ చేసాడు వెంకీ. రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాలో వెంకీ పెర్ఫార్మెన్స్ కి ప్రత్యేకమైన అభినందనలు లభించాయి.

 

టాలీవుడ్ లో రీమేక్ రాజా అనిపించుకున్న విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాల్లో ‘గోపాల గోపాల’ ఒకటి. ఈ సినిమాలో పరేష్ రావల్ చేసిన నాస్తికుడి పాత్రలో అదరగోట్టేసాడు వెంకీ.. పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో భక్తి కి, మూర్ఖత్వానికి మధ్య తేడా ను సున్నితంగా తెలిపాడు.

గురు సినిమాలో ఆదిత్య అనే బాక్సింగ్ కోచ్ క్యారెక్టర్ లో నటించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో మెస్మరైజ్ చేసాడు దగ్గుబాటి హీరో… చేసిన ప్రతీ సినిమాలో విభిన్నంగా ఉండే క్యారెక్టర్ అలాగే డిఫరెంట్ లుక్ లో కనిపించడం వెంకీ నైజం.

హీరోగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ విక్టరీ ని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి జీ సినిమాలు తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.